ఫ్రాన్స్‌లో నిరసన జ్వాల | Student and youth protests that began in France, spreading across Europe | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌లో నిరసన జ్వాల

Nov 1 2026 5:29 AM | Updated on Nov 1 2026 5:29 AM

Student and youth protests that began in France, spreading across Europe

యూరప్‌లోని ఇతర దేశాలకూ సెగ 

పారిస్‌: ఫ్రాన్స్‌లో మొదలైన విద్యార్థి ఆందోళనలు యూరప్‌లోని ఇతర దేశాలకూ వ్యాపిస్తున్నాయి. జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌కి కూడా నిరసనల సెగ తగిలింది. ప్రాన్స్‌లో శనివారం నిరసనలు కొనసాగాయి. విద్యావ్యవస్థలో సంస్కరణలు, జీవన వ్యయంలో పెరుగుదల వంటి అంశాలపై జరుగుతున్న నిరసనల్లో శనివారం 3.20లక్షల మంది పాల్గొన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రదర్శనల కట్టడికి ప్రభుత్వం 70 వేల మంది పోలీసులను వినియోగించింది. 

అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారిస్‌ నగర శివార్లవైపు ర్యాలీలను మళ్లించింది. ఫ్రాన్స్‌ వ్యాప్తంగా అక్టోబర్‌ 17న జరిగిన నిరసనల్లో అత్యధికంగా 5 లక్షల మంది, అక్టోబర్‌ 24న 4.10 లక్షల మంది పాల్గొనడం, తీవ్ర విధ్వంసం చోటుచేసుకోవడం తెల్సిందే. జర్మనీలో ‘‘జెన్‌ జీ రెగెల్ట్‌’’పేరుతో మొదలైన మరో ఉద్యమం 30 నగరాల్లో జరిగింది. విద్య, గృహ నిర్మాణ రంగంపై ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెట్టాలనే డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలకు 1.4 లక్షల మంది ఆన్‌లైన్‌లో మద్దతు తెలిపినట్లు నిర్వాహకులు చెప్పారు. నిరసనల్లో వేలాది మంది పాల్గొన్నారన్నారు. 

బెర్లిన్‌లోని చారిత్రక బ్రాండన్‌బర్గ్‌ గేట్‌ వద్దకు కనీసం 10వేల మంది తరలివచ్చినట్లు అంచనా. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దుకాణదారులు ముందుజాగ్రత్తగా మూసివేశారు. కొలోన్‌లో నిరసన కారులు ముసుగులు ధరించి పోలీసులపైకి బాణసంచా కాల్చుతూ, రాళ్లు రువ్వారు. పోలీసులు కూడా వాటర్‌ కెనన్లతో వారిని చెదరగొట్టారు. హాంబర్గ్‌లో ఆందోళనకారులు బారికేడ్లకు నిప్పుపెట్టారు. దీంతో, పోలీసులు వాటర్‌ కెనన్లను, టియర్‌గ్యాస్‌ను ప్రయోగించడంతో వారు చెల్లాచెదురయ్యారు. అయితే, ఫ్రాన్స్‌లో మాదిరిగా జర్మనీలో నిరసనలు తీవ్ర హింసాత్మక రూపం దాల్చే అవకాశాలు లేవని పరిశీలకులు చెబుతున్నారు. 

స్పెయిన్‌లోని బార్సిలోనాలో కూడా నిరసనలకు దిగాలంటూ సామాజిక మాధ్యమాల్లో పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారం క్రితం కాటలోనియా ప్రాంతంలో జరిగిన అల్లర్లకు సంబంధించి సుమారు 130 మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఎక్కువ మంది మైనర్లే. ఇటలీలోని మిలాన్, టురిన్, బొలోగ్నా నగరాల్లో ఘర్షణల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బెల్జియం, నెదర్లాండ్స్, ఆ్రస్టియా, స్విట్జర్లాండ్, పోర్చుగల్‌లలోనూ టిక్‌టాక్‌ ద్వారా నిరసనలు దిగాలంటూ కొన్ని గ్రూపులు పిలుపునిచ్చినా పెద్దగా స్పందన కనిపించలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement