బాలికల విద్యపై తాలిబన్లకు జాకీర్ వకాల్తా.. మలాలా తండ్రి ఆగ్రహం | Zakir Naik Defends Talibans stance on girls education, Malala father expresses outrage | Sakshi
Sakshi News home page

బాలికల విద్యపై తాలిబన్లకు జాకీర్ వకాల్తా.. మలాలా తండ్రి ఆగ్రహం

Oct 31 2026 4:04 PM | Updated on Oct 31 2026 4:11 PM

Zakir Naik Defends Talibans stance on girls education, Malala father expresses outrage

వివాదాస్పద ఇస్లామిక్ మత బోధకుడు జాకీర్ నాయక్ మరోసారి వార్తల్లో నిలిచారు. అఫ్గానిస్థాన్‌లో బాలికల ఉన్నత విద్యపై తాలిబన్లు విధించిన ఆంక్షలను ఆయన సమర్థించినట్లు వచ్చిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అయితే ఈ వ్యాఖ్యలపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ తండ్రి జియావుద్దీన్ యూసఫ్‌జాయ్ తీవ్రంగా స్పందించారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో జాకీర్ నాయక్ మాట్లాడుతూ.. అఫ్గానిస్థాన్‌లో మహిళలకు భద్రత లేని కారణంగానే ఆరో తరగతి తర్వాత బాలికల విద్యను తాలిబన్లు ప్రస్తుతానికి వాయిదా వేశారని పేర్కొన్నారు. అంతేకాదు పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయుల కొరత కూడా ఇందుకు కారణమని, తగిన పరిస్థితులు ఏర్పడిన తర్వాత బాలికల ఉన్నత విద్యకు అనుమతిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ఈ వ్యాఖ్యలపై మలాలా తండ్రి జియావుద్దీన్ స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఓ మత పండితుడు తాలిబన్ల బాలికల విద్య నిరాకరణను సమర్థించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు. అనంతరం పలువురు విద్యావేత్తలు, అఫ్గాన్ మహిళా నాయకులు కూడా జాకీర్ నాయక్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్గానిస్థాన్‌లో 12 ఏళ్లు దాటిన బాలికలకు విద్యపై ఆంక్షలు విధించారు. అంతేకాదు అక్కడి మహిళల ఉద్యోగాలతో పాటు వారి వ్యక్తిగత స్వేచ్ఛపైనా అనేక పరిమితులు అమలు చేస్తున్నారు. దాంతో ఈ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా, భారత్ జాకీర్ నాయక్ అప్పగింత కోసం మలేషియాతో చర్చలు కొనసాగిస్తోంది. 2016 మనీలాండరింగ్ కేసులో ఆయనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కేసు నమోదు చేసింది.

ఇదీ చదవండి: ఎల్‌కేజీ బాలికపై మూడవ తరగతి విద్యార్థి భీకర దాడి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement