అఫ్గానిస్థాన్‌లో కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలను తాలిబన్లు నిలిపివేశారు. ఈ చికిత్స ఇస్లామిక్ బోధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పేలుళ్లు, ప్రమాదాల్లో చూపు కోల్పోయిన వందలాది మంది బాధితులకు తిరిగి చూపు పొందే అవకాశం దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది.
కాబూల్, జలాలాబాద్ నగరాల్లో విరాళంగా అందిన కార్నియాలతో ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ నిర్ణయంతో నిలిచిపోయింది. ఇప్పటికే వైద్య నిపుణుల కొరత, దశాబ్దాల యుద్ధం వల్ల దెబ్బతిన్న ఆరోగ్య వ్యవస్థతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌లో ఈ పరిణామం రోగులపై మరింత ప్రభావం చూపనుంది.
కార్నియా అంటే కంటిలో ముందు భాగంలో ఉండే పారదర్శక పొర. ఇది దెబ్బతిన్నప్పుడు చూపు మందగించవచ్చు లేదా పూర్తిగా కోల్పోవచ్చు. దెబ్బతిన్న కార్నియాను దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కణజాలంతో మార్చడమే కార్నియా మార్పిడి శస్త్రచికిత్స.
కాబూల్‌లోని నూర్ ఐ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నూర్ జమాన్ హషీమ్ తెలిపిన వివరాల ప్రకారం.. కార్యక్రమం నిలిచిపోయే ముందు ఆయన బృందం ఇటీవలి నెలల్లో 90 కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించింది. ప్రస్తుతం చికిత్స కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీరిలో పేలుళ్లు, శారీరక గాయాలు, వెల్డింగ్ ప్రమాదాల వల్ల చూపు కోల్పోయిన యువకులు ఎక్కువగా ఉన్నారు.
“దశాబ్దాల హింస అఫ్గానిస్థాన్ ఆరోగ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. మార్పిడి చికిత్సల అవసరాన్ని తీర్చేందుకు తగినంత మంది కంటి వైద్యులు, స్థానికంగా అందుబాటులో ఉండే కార్నియాలు మా వద్ద లేవు” అని ఆయన తెలిపారు. “మార్పిడి శస్త్రచికిత్సలను నిలిపివేయాలని తాలిబన్లు మౌఖికంగా ఆదేశించారు. తీవ్రమైన శిక్షలు పడతాయనే భయంతో వారి ఆదేశాలను ధిక్కరించే ధైర్యం ఎవరికీ లేదు” అని పేర్కొన్నారు.
ఉచిత చికిత్స కార్యక్రమానికి విరాళాలే ఆధారం
అమెరికాకు చెందిన అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ పాకిస్థానీ డిసెంట్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ ఈ కార్యక్రమానికి సహకరించింది. ఈ సంస్థ 2017 నుంచి పాకిస్థాన్‌లో కార్నియా మార్పిడి చికిత్సల కోసం ఉచితంగా కార్నియాలను అందిస్తోంది. ఈ ఏడాది తన సేవలను అఫ్గానిస్థాన్‌కు విస్తరించడంతో అక్కడ 150కు పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ చికిత్సలు నిర్వహించేందుకు ముగ్గురు అఫ్గాన్ కంటి వైద్యులకు పాకిస్థాన్‌లోని పెషావర్‌లో శిక్షణ కూడా ఇచ్చారు.
విరాళంగా అందిన కార్నియాలను ఉపయోగించడంతో రోగులు వాటి కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందగలిగారు. ఇప్పుడు ఈ కార్యక్రమం నిలిచిపోవడంతో ఇప్పటికే శస్త్రచికిత్స కోసం పేర్లు నమోదు చేసుకున్నవారు తమకు ఎప్పుడు చికిత్స అందుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
కాబూల్‌లో చెరకు రసం విక్రయించే ఓ వ్యక్తి 2023లో గ్యాస్ సిలిండర్ పేలుడులో చూపు కోల్పోయాడు. ఉచిత శస్త్రచికిత్స కార్యక్రమం గురించి తెలుసుకుని ఆసుపత్రిని సంప్రదించాడు. సెప్టెంబరులో శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు చెప్పారని, అయితే ఆగస్టులోనే కార్యక్రమం నిలిచిపోయిందని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని అతడు తెలిపాడు. 2021 ఆగస్టులో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబన్లు అనేక ఆంక్షలు విధించారు.
మహిళలు, బాలికల హక్కులు, విద్యపై పరిమితులతో పాటు వైద్య సేవల అందుబాటుపైనా తాజా నిర్ణయం ప్రభావం చూపుతోంది. కార్నియా మార్పిడి చికిత్సలు తిరిగి ప్రారంభమవుతాయా, ఎదురుచూస్తున్న రోగులకు ఎప్పుడు వైద్యం అందుతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
ఇదీ చదవండి: డీఏ, డీఆర్ పెంపు.. కేంద్ర క‍్యాబినెట్ కీలక నిర్ణయాలు


