ఇజ్రాయెల్‌ ఫలితాల్లో నెతన్యాహు వర్గానికి ఆధిక్యం | Netanyahu's coalition leads in Israeli election results update | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ ఫలితాల్లో నెతన్యాహు వర్గానికి ఆధిక్యం

Oct 28 2026 1:04 PM | Updated on Oct 28 2026 1:13 PM

Netanyahu's coalition leads in Israeli election results update

జెరూసలేం: ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తొలుత ఎగ్జిట్‌ పోల్స్‌లో కూటమికి ఆధిక్యం కనిపించినప్పటికీ, వాస్తవ ఫలితాల్లో ఆ పరిస్థితి మారుతోంది. ఇప్పటివరకు సగానికి పైగా ఓట్లు లెక్కించగా, ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 55 స్థానాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాడి ఐజెన్‌కాట్‌ నేతృత్వంలోని మార్పు కూటమి 49 స్థానాలతో వెనుకబడింది. అరబ్‌ పార్టీలకు 16 స్థానాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, తుది ఫలితాలు వెల్లడయ్యే వరకు ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ వస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది.

నెతన్యాహుకు ట్రంప్‌ మద్దతు.. కొత్త షరతులు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నెతన్యాహు తదుపరి ప్రభుత్వంలో ఇట్‌మార్‌ బెన్‌ గ్విర్‌, బహుశా బెజలెల్‌ స్మోట్రిచ్‌లకు చోటు కల్పించకూడదని ట్రంప్‌ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించేందుకు సౌదీ అరేబియా సహా కొన్ని అరబ్‌ దేశాలు నెతన్యాహు ప్రధానిగా కొనసాగడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఐక్య ప్రభుత్వ ఏర్పాటుకు ట్రంప్‌ ప్రయత్నించవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే అధికార భాగస్వామ్యం, పదవీకాలాన్ని పంచుకునే ఒప్పందం ద్వారా రాజకీయ ప్రతిష్ఠంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరగవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అరబ్‌ పార్టీలకు పెరుగుతున్న మద్దతు
ఓట్ల లెక్కింపులో అరబ్‌ పార్టీలకు లభిస్తున్న మద్దతు కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జెరూసలేం నగరంలో అరబ్‌ పార్టీలకు గత ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి. అక్కడ 80 శాతానికి పైగా పోలింగ్‌ కేంద్రాల లెక్కింపు పూర్తయ్యే సమయానికి, ఉమ్మడి జాబితాకు 11,477 ఓట్లు వచ్చినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఈ జాబితాకు వచ్చిన ఓట్లతో పోలిస్తే ఇది సుమారు 4.5 రెట్లు అధికం. మరోవైపు, సైన్యంలో పనిచేస్తున్న వారిలో 79.9 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువ. అయితే, కొన్ని ప్రధాన నగరాల్లోని పోలింగ్‌ కేంద్రాల ఫలితాలు ఇంకా పూర్తిగా నమోదు కాకపోవడంతో తుది రాజకీయ చిత్రం మారే అవకాశం ఉంది.

మరో మలుపు తిప్పనున్న డబుల్‌ బ్యాలెట్‌ కవర్లు
ఇజ్రాయెల్‌ ఎన్నికల తుది ఫలితాలపై డబుల్‌ బ్యాలెట్‌ కవర్ల లెక్కింపు ప్రభావం చూపే అవకాశముంది. సైనికులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు, నిరాశ్రయులైన ప్రజలు వేసిన ఓట్లు ఇందులో ఉంటాయి. ఎన్నికల సంఘం అంచనా ప్రకారం ఐదు లక్షలకు పైగా కవర్లు ఉండవచ్చు. వీటి లెక్కింపు అర్ధరాత్రి ప్రారంభమై మరుసటి రోజు సాయంత్రం వరకు కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఓట్లు దాదాపు 15 స్థానాల సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. మరోవైపు, నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతుండగా, ఐజెన్‌కాట్‌ కూటమి మెజారిటీ సాధించేందుకు అవసరమైన మద్దతు కూడగట్టాల్సి ఉంది. తుది లెక్కింపు పూర్తయ్యే వరకు ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వం ఎవరిదనే ఉత్కంఠ కొనసాగనుంది. 

ఇదీ చదవండి: ట్రంప్‌తో కలిసి రంగంలోకి దిగుతా: నెతన్యాహు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement