నైజీరియా మతబోధకుడి కాల్చివేత! | Nigerian Controversial Islamic Preacher Yahaya Masussuka Shot Dead Outside His Home Amid Death Threats, Two Killed In Attack | Sakshi
Sakshi News home page

నైజీరియా మతబోధకుడి కాల్చివేత!

Oct 28 2026 11:25 AM | Updated on Oct 28 2026 11:36 AM

Nigerian Islamic Preacher Yahaya Masussuka Shot Dead Amid Death Threats

కట్సినా: నైజీరియాలో వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు యాహయా మసుస్సుకా దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర నైజీరియాలోని కట్సినా రాష్ట్రం దుట్సిన్-మా ప్రాంతంలో తన ఇంటి బయట ఉండగా గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. సోమవారం సాయంత్రం మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు బీబీసీ తెలిపింది. ఆ సమయంలో ఆయన ఇంటికి వచ్చిన అతిథులకు వీడ్కోలు పలుకుతున్నారు. ఈ ఘటనలో 47 ఏళ్ల మసుస్సుకాతో పాటు ఓ సందర్శకుడు కూడా గాయపడ్డారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

మసుస్సుకా బోధనలు ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలపై కట్సినా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు మతపండితుల కమిటీ (ఉలమాల కమిటీ) ఎదుట హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. మరోవైపు, జమాతు ఇజాలతిల్ బిదా గ్రూపునకు చెందిన కొందరు తనను దూషించడంతో పాటు దాడి చేస్తామని బెదిరించారని మసుస్సుకా ఫిర్యాదు చేశారు. ఈ వివాదాన్ని కట్సినా ఎమిర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మసుస్సుకాతో పాటు ఇతర మతపండితులతో సమావేశమై, ఇతర ముస్లింలను రెచ్చగొట్టే ప్రసంగాలకు దూరంగా ఉండాలని ఇరువర్గాలకు సూచించారు.

మసుస్సుకా తన 13వ ఏట నుంచే ఖురాన్ పాఠశాలల్లో మతబోధనలు చేయడం ప్రారంభించారు. అనంతరం ఈజిప్టులోని అల్-అజ్హర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ తర్వాత ఒమన్‌లోనూ విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. తన ఇంట్లోనే ప్రత్యేక స్టూడియో ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా అనుచరులకు బోధనలు అందించేవారు. మతపరమైన అంశాలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, హింసాత్మక తీవ్రవాదాన్ని ఆయన వ్యతిరేకించేవారు.

ఇదీ చదవండి: విస్కీ 9 లీటర్లు.. బీర్ 18 లీటర్లు.. ఇంటి నుంచే బుకింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement