న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మద్యం కొనుగోళ్ల కోసం కొత్త ఆన్‌లైన్ బుకింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (డీఎస్‌ఐఐడీసీ)‘Delhi Liquor Booking’ పేరుతో మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా 25 ఏళ్లు నిండిన వినియోగదారులు అందుబాటులో ఉన్న బ్రాండ్లలో విస్కీ, బీర్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అయితే, ఆన్‌లైన్‌లో బుక్ చేసిన మద్యాన్ని ఇంటికి పంపించే సదుపాయం లేదు. వినియోగదారులు తాము ఎంచుకున్న మద్యం దుకాణానికి వెళ్లి, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కొనుగోళ్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
బుకింగ్ ఎలా చేయాలంటే?
ముందుగా యాప్‌లో అందుబాటులో ఉన్న బ్రాండ్లను పరిశీలించి, డీఎస్‌ఐఐడీసీ నిర్వహించే మద్యం దుకాణాన్ని ఎంచుకోవాలి. అనంతరం బాటిల్ పరిమాణం, కావాల్సిన పరిమాణాన్ని ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయాలి. బుకింగ్ పూర్తయిన తర్వాత వినియోగదారులకు క్యూఆర్ కోడ్ అందుతుంది. దాన్ని ఎంపిక చేసుకున్న దుకాణంలో స్కాన్ చేసి మద్యాన్ని తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం డీఎస్‌ఐఐడీసీ నిర్వహిస్తున్న దుకాణాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఢిల్లీ వ్యాప్తంగా సంస్థకు 208 మద్యం దుకాణాలు ఉన్నాయి.
బుకింగ్ పరిమితులు ఇవే..
ఢిల్లీ ఎక్సైజ్ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 లీటర్ల విస్కీ, 18 లీటర్ల బీర్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే, ఆయా దుకాణాల్లో అందుబాటులో ఉన్న బ్రాండ్లను బట్టి కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో చేసిన బుకింగ్‌ను మద్యం తీసుకెళ్లే ముందు రద్దు చేసుకోవచ్చు. ఒకసారి కొనుగోలు చేసి దుకాణం నుంచి తీసుకెళ్లిన మద్యాన్ని తిరిగి ఇవ్వడం సాధ్యం కాదు.
ఈ కొత్త విధానం ఎందుకంటే?
మద్యం దుకాణాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, చెల్లింపుల కౌంటర్లపై ఒత్తిడిని తగ్గించడం, ధరలు, బిల్లింగ్‌లో పారదర్శకతను పెంచడం ఈ యాప్ ప్రధాన లక్ష్యాలని అధికారులు తెలిపారు. వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్లను ముందుగానే ఎంచుకునే అవకాశం కూడా ఉంటుందని వివరించారు. అయితే, ఇప్పటివరకు ఆన్‌లైన్ బుకింగ్‌కు వినియోగదారుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలా వద్దా అనేది ప్రజల స్పందనపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఒహియోలో హోరాహోరీ.. రామస్వామికి ఎదురీత!


