సాంకేతికతలో ప్రపంచానికి మనం నాయకత్వం వహించాలి | PM Narendra Modi inaugurated India ESTIC 2026 Conclave | Sakshi
Sakshi News home page

సాంకేతికతలో ప్రపంచానికి మనం నాయకత్వం వహించాలి

Oct 28 2026 5:09 AM | Updated on Oct 28 2026 5:09 AM

PM Narendra Modi inaugurated India ESTIC 2026 Conclave

భవిష్యత్‌ సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి

నూతన ఆవిష్కరణలు చేయాలి  

కొత్త ఆలోచనా విధానంతో, నూతన ఆత్మవిశ్వాసంతో భారత్‌ ముందుకు సాగుతోంది  

ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి  

ఢిల్లీలో ఎమర్జింగ్‌ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ కాన్‌క్లేవ్‌–2026  

న్యూఢిల్లీ:  మన దేశం భవిష్యత్‌ సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని, నూతన ఆవిష్కరణలు చేయాలని, వాటి అభివృద్ధిలో ప్రపంచానికి నాయకత్వం వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎమర్జింగ్‌ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ కాన్‌క్లేవ్‌(ఎస్టిక్‌)–2026లో ఆయన పాల్గొన్నారు. ఆయా రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం, ప్రపంచం కోసం, నేటికీ, రేపటికీ నూతన సాంకేతికతను సృష్టించి, దాని దిశను నిర్దేశించడమే భారతదేశ లక్ష్యమని చెప్పారు. 

నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని సూచించారు. దశాబ్దాల క్రితం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో మన దేశం వెనుకంజలో ఉండేదని గుర్తుచేశారు. ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా కొత్త ఆవిష్కరణ జరిగితే.. ఆ సాంకేతికత కొన్ని సంవత్సరాల తర్వాత మన దేశానికి చేరేదని వివరించారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కొత్త టెక్నాలజీని రూపొందించి, ప్రపంచానికి అందించే సామర్థ్యం మనకు ఉందని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో 21వ శతాబ్దపు భారతదేశం ఒక కొత్త ఆలోచనా విధానంతో, నూతన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు.  

ఏఐ ఆధారిత, క్వాంటం భద్రతా పరిష్కారాలు  
నేటి కృత్రిమ మేధ(ఏఐ) యుగంలో కొత్త సవాళ్లు ఉన్నాయని ప్రధాని మోదీ తెలియజేశారు. ఉదాహరణకు.. ఉత్పాదకతను పెంచడానికి ఏఐ సాధారణ పనులను వేగంగా చేయగలిగినప్పటికీ, అది స్వతంత్ర ఆలోచనను పరిమితం చేయకూడదని, దాన్ని మరింత సుసంపన్నం చేయాలని చెప్పారు. తద్వారా ఆదా అయిన సమయాన్ని మరింత క్లిష్టమైన సమస్యల పరిష్కారం, కొత్త ప్రయోగాలు, ఆలోచనల కోసం ఉపయోగించుకునేలా వీలు కల్పించాలని అన్నారు. 

ఆర్థిక వ్యవస్థలకు, జాతీయ భద్రతకు ఏఐ యుగంలో తలెత్తుతున్న సైబర్‌ సెక్యూరిటీ ముప్పుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. జాతీయ వ్యవస్థలను పరిరక్షించి, మానవాళికి సేవ చేసే ఏఐ ఆధారిత, క్వాంటం భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేయాలని సూచించారు. దేశానికి సాధికారత కల్పించడంతోపాటు మానవాళి సమస్యల పరిష్కారానికి కూడా దోహదపడే సాంకేతికతలను అభివృద్ధి చేయడమే మన లక్ష్యం కావాలని సైంటిస్టులకు పిలుపునిచ్చారు.  

భారత్‌ సాధించిన విజయాలు అపూర్వం  
గణితంలో ‘సున్నా’ఆవిష్కరణ నుంచి సంఖ్యా వ్యవస్థ అభివృద్ధి, ఖగోళ శాస్త్రంలో పురోగతి వరకు భారతదేశ సంస్కృతి ఎల్లప్పుడూ జ్ఞానం, ఆవిష్కరణలతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం మన దేశం ఈ శాస్త్రీయ వారసత్వాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు తీసుకువెళుతోందని అన్నారు. అణుశక్తి ప్రాముఖ్యతను వివరించారు. 

‘వికసిత్‌ భారత్‌’నిర్మాణానికి భారీ స్థాయిలో అణుశక్తి అవసరమని, అందుకే మనం ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో తమిళనాడులోని కల్పకంలో దేశపు మొట్టమొదటి స్వదేశీ నమూనా ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌ క్రిటికాలిటీని సాధించడం ఒక ముఖ్యమైన మైలురాయి అని అభివరి్ణంచారు. 

వివిధ కీలక రంగాల్లో భారత్‌ సాధించిన విజయాలు అపూర్వమైనవని మోదీ అన్నారు. మన దేశంలో తయారైన చిప్‌లు ఇప్పుడు ప్రపంచ దేశాలకు చేరడం మొదలైందని చెప్పారు. బ్యాటరీ నిల్వ రంగంలో సైతం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని సామర్థ్య పెంపుపై దృష్టి పెట్టామని తెలియజేశారు. 

అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలను వివరించారు. భారత సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ చేపట్టిన జూలై మిషన్‌ గురించి ప్రస్తావించారు. అణుశక్తి నుంచి అంతరిక్షం వరకు, ఏఐ నుంచి సెమీకండక్టర్ల వరకు... ఈ రంగాలన్నింటి అవసరాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, వాటన్నింటి నుంచి వచ్చే సందేశం ఒక్కటేనని స్పష్టంచేశారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో భారతదేశం తన బలాన్ని, విశ్వాసాన్ని పెంపొందించుకుంటోందని ఉద్ఘాటించారు. ‘అభివృద్ధి చెందిన భారత్‌’ను నిర్మించేందుకు పరిశోధనా రంగాన్ని నిరంతరం బలోపేతం చేస్తున్నామని ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement