రామ్‌లీలా ర్యాలీకి 10 లక్షల మంది | Congress targets 10 lakh people for November 1 Delhi rally against vote theft | Sakshi
Sakshi News home page

రామ్‌లీలా ర్యాలీకి 10 లక్షల మంది

Oct 27 2026 5:49 AM | Updated on Oct 27 2026 5:49 AM

Congress targets 10 lakh people for November 1 Delhi rally against vote theft

రాష్ట్రాల విభాగాలకు లక్ష్యాలను నిర్దేశించిన కాంగ్రెస్‌ అధిష్టానం 

ర్యాలీని వాయిదా వేయాలన్న వ్యాపారుల విజ్ఞప్తికి నో చెప్పిన రాహుల్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌), ఓట్ల చోరీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో చేపట్టిన చలో ఢిల్లీ నిరసనకు కాంగ్రెస్‌ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. కనీసం 10 లక్షల మందిని సమీకరించాలని, ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన అతిపెద్ద నిరసన కార్యక్రమంగా దీనిని నిలపాలని కాంగ్రెస్‌ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా పార్టీ అన్ని రాష్ట్రాల యూనిట్లకు, అనుబంధ విభాగాలకు స్పష్టమైన భారీ టార్గెట్లను నిర్దేశించింది. 

జన సమీకరణకు జిల్లాకో ఇన్‌చార్జి 
ర్యాలీ కోసం మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి 3 లక్షల మందిని తరలించాలంటూ కాంగ్రెస్‌ అధిష్టానం టార్గెట్‌ పెట్టింది. ఆయా రాష్ట్రాల నేతలతో ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకాగాం«దీ, కేసీ వేణుగోపాల్‌ సమీక్షలు జరిపారు. ఢిల్లీతో పాటు పొరుగున ఉన్న హరియాణా, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ల నుంచి లక్ష మంది చొప్పున తీసుకురావాలంటూ రాష్ట్ర నాయకత్వాలను ఆదేశించింది. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్కో రాష్ట్రానికి 15 వేల మంది చొప్పున సమీకరించాలని ఏఐసీసీ ఆదేశించింది. 

అర నిమిషంలోనే ఆందోళనలకు చెక్‌: రాహుల్‌ 
నవంబర్‌ 1న కూటమి పార్టీలు చేపట్టిన ఈ ర్యాలీపై ఢిల్లీ వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ (సీటీఐ) అధ్యక్షుడు బ్రిజేష్‌ గోయల్‌ నేతృత్వంలోని ప్రతినిధులు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాం«దీని వారు కలిశారు. పండగల వేళ రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారాలకు కీలకమైన సమయంలో భారీ నిరసన నిర్వహిస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై రాహుల్‌గాంధీ సోమవారం ఎక్స్‌ వేదికగా స్పందించారు. వ్యాపారుల ఇబ్బందులను తాము అర్థం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం మెట్రో సేవలను నిలిపివేసి, రహదారులను దిగ్బంధించి దేశ రాజధానిని అష్టదిగ్బంధనం చేసిందని రాహుల్‌ విమర్శించారు. ప్రధాని మోదీ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘జ్ఞానేశ్‌ను మోదీ తొలగిస్తే 30 సెకన్లలోనే ఆందోళనలు ఆగిపోతాయి’అని పేర్కొన్నారు. 

ర్యాలీని విజయవంతం చేయండి: ఖర్గే పిలుపు 
దేశంలో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని, ఇప్పటికీ కొనసాగుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కోట్లాది మంది పౌరుల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు ప్రమాదంలో పడిందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. సీఈసీ రాజీనామా, సర్‌ ప్రక్రియను తక్షణమే నిలిపివేయా లని డిమాండ్‌ చేస్తున్నామని, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా నవంబర్‌ 1న చేపట్టిన మహా ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement