అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలా ఐపీఎస్ అధికారి
‘స్థానిక’ నామినేషన్ల వేళ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచకాలు
మాజీ మంత్రితో సహా మహిళలపై అమానుష చర్యలు
అధికారం అడ్డు పెట్టుకుని రెచ్చిపోతున్న పచ్చ గూండాలు
చట్టాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్న పోలీసులు
ఇంత జరుగుతున్నా నోరు విప్పని ఎన్నికల నోడల్ ఆఫీసర్
ప్రతిపక్షాలు, బాధితుల ఫోన్లకు సైతం స్పందించని వైనం
ఐజీపీ రాజకుమారి తీరుపై సర్వత్రా విమర్శలు
సాక్షి, అమరావతి: ఉన్నత చదువు.. అత్యున్నత ఉద్యోగం.. శాంతిభద్రతలను కాపాడతానని చేసిన ప్రమాణం.. ఇవన్నీ అధికార పార్టీ ముందు తలవంచాయి. రాజకీయ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన చోట కూడా పక్షపాతంతో వ్యవహరించాల్సిన దుస్థితి. చివరికి కళ్ల ముందు జరుగుతున్న అక్రమాలను చూసి కూడా మౌనంగా ఉండిపోవాల్సిన దైన్యం. ఇవీ సీనియర్ ఐపీఎస్ అధికారి బి.రాజకుమారి గురించి ప్రస్తుతం రాష్ట్రంలో వినిపిస్తున్న విమర్శలు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి, ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర పోలీసు విభాగానికి మధ్య వారధిగా ఉండేందుకు రాజకుమారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. అయితే ఆమె తనకు అప్పగించిన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అక్రమాలే ఇందుకు నిదర్శనం.
తలవంచిన అనుభవం
బురుగు రాజకుమారి 2007 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. నూజివీడులో ఏఎస్పీగా, రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విజయనగరం జిల్లా ఎస్పీగా పని చేశారు. 2021లో డీఐజీగా పదోన్నతి పొందిన ఆమెకు దిశ విభాగం బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఏపీఎస్పీ బెటాలియన్లలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2025లో ఐజీపీగా పదోన్నతి పొందారు. కొన్నాళ్లు సీఐడీ మహిళా భద్రత విభాగం అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రైల్వేస్ ఐజీపీగా నియమితులయ్యారు.
ఇంత అనుభవం ఉన్న అధికారి ఇప్పుడిలా అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారడం పోలీసు వర్గాల్లో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందనే వాస్తవ సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, పోలీసు శాఖను అప్రమత్తం చేస్తే.. జరుగుతున్న దారుణాలు కొంత వరకైనా తగ్గి ఉండేవి. కానీ రాజకుమారి ఆ పదవిలో ఉండి కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
ఎందుకంత మౌనం?
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతూనే ఉంది. కనీసం నామినేషన్లూ వేయనివ్వకుండా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుంటోంది. ఈ క్రమంలో ఎంపీలు, మాజీ మంత్రులు అని కూడా చూడకుండా వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలకు చెందిన ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేయిస్తోంది. నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుని టీడీపీ నేతలు చించి వేయడం కళ్లారా చూశాం. చివరికి మహిళలపైనా అమానుషంగా వ్యవహరించేంతగా ఆ పార్టీ దిగజారింది. ఈ అన్యాయాలకు సంబంధించిన సాక్ష్యాలు వీడియోలు, ఫొటోల రూపంలో టీవీలు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్నాయి. పత్రికల్లో పతాక శీర్షికలుగా ప్రచురితమవుతున్నాయి.
ఆఖరుకు సుప్రీంకోర్టూ ఏపీలో జరుగుతున్న హింసను ఎత్తిచూపి, ఎన్నికల కమిషన్‌కు మార్గ నిర్దేశం చేసింది. అయినా రాజకుమారి మౌనంగానే ఉండిపోయారు. కనీసం తమకు అన్యాయం జరుగుతోందని మొర పెట్టుకోవడానికి బాధితులు, జరుగుతున్న అరాచకాల గురించి సమాచారం ఇవ్వడానికి ప్రతిపక్ష నేతలు రాజకుమారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి యత్నిస్తుంటే ఆమె స్పందించడం లేదు. ఘటనలపై సమాచారం కోసం యత్నించిన మీడియా ప్రతినిధులకు సైతం ఆమె పలకడం లేదు. ఇలాంటి వారిని ఎన్నికల సంఘం నోడల్ ఆఫీసర్‌గా కొనసాగిస్తే, ఎన్నికల్లో శాంతిభద్రతలు మరింత క్షీణించే అవ కాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.


