ఏం కొనాలి.. ఏం తినాలి!? | People are upset over the huge increase in prices of essential commodities | Sakshi
Sakshi News home page

ఏం కొనాలి.. ఏం తినాలి!?

Oct 27 2026 3:19 AM | Updated on Oct 27 2026 3:21 AM

People are upset over the huge increase in prices of essential commodities

భారీగా పెరిగిన నిత్యావసర ధరలపై రగిలిపోతున్న జనం

స్థానిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఓటర్లు

ఆరు నెలల క్రితం రూ.1,450గా ఉన్న 26 కేజీల బియ్యం బస్తా ఇప్పుడు రూ.2,538.. ఏడాది క్రితం రూ.825గాఉన్న గ్యాస్‌ బండ ఇప్పుడు రూ.965 

బాబు సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రూ.109 నుంచి రూ.117కి పెరిగిన లీటరు పెట్రోల్‌ ధర 

ఇక కందిపప్పు నుంచి పంచదార దాకా అన్నింటి ధరల చూపు ఆకాశం వైపే 

కొందామంటే షాకిస్తున్న కూరగాయల ధరలు 

అధిక ధరలతో సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నా మొద్దునిద్రలో చంద్రబాబు సర్కారు 

ఇదే సమయంలో కార్పొరేట్లకు రూ.కోట్ల విలువైన భూములు ఎకరాలకు ఎకరాలు 99 పైసలకే ధారాదత్తం

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామంటూ ఊరువాడా హామీ ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ధరల బాదుడుతో సామాన్యుడి నడ్డి విరుస్తోంది. అడ్డూ అదుపులేకుండా బియ్యం దగ్గర నుంచి ఉల్లిపాయ వరకు.. పెట్రోల్‌ దగ్గర నుంచి వంట గ్యాస్‌ వరకు అన్ని వస్తువుల ధరలు చుక్కల్ని అంటుతున్నా చంద్రబాబు సర్కారులో చలనం లేకపోవడంపై సామాన్యుడు రగలిపోతున్నాడు. రెండు­నెలల క్రితం కేజీ రూ.56గా ఉన్న సన్నరకం పాతబియ్యం ఇప్పుడు ఏకంగా సెంచరీ దాటిపోవడంతో సామాన్యులు ఏం కొనాలి.. ఏం తినాలంటూ తలబాదుకుంటున్నారు. 

రోజు వంటలో వినియోగించే నూనెలు దగ్గర నుంచి పప్పు దినుసులు, కూరగాయలు ఇలా అన్ని రకాల వస్తువులు దేశంలో కంటే మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయంటూ కేంద్ర గణాంకాలు ప్రతీవారం వెల్లడిస్తున్నా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదు. దీంతో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న కూట­మి అభ్యర్థులను ఓటర్లు కాలర్‌ పట్టుకున్నంత పనిచేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడిలా పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారంటూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో వారు ఇంటింటి ప్రచారం చేయాలంటే  బెంబేలెత్తిపోతున్నారు. 

సెంచరీ దాటేసిన బియ్యం ధరలు..  
గడిచిన రెండు నెలల్లో బియ్యం ధరలు రెట్టింపు అవుతున్నా చంద్రబాబు సర్కారులో ఉలుకూ లేదు పలుకూ లేదు. కనీసం ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. రెండు నెలల క్రితం రూ.1,450గా ఉన్న సన్నరకం పాత బియ్యం 26 కిలోల బస్తా ధర ఇప్పుడు రూ.2,538 దాటేసింది. కేజీ రూ.100 పెడితేగానీ బియ్యం దొరక్కపోతే ఏం తినాలి ఎలా బతకాలంటూ జనం గుండెలు బాదుకుంటున్నారు. కరువు పేరు చెప్పి సిండికేట్‌గా ఏర్పడిన మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ రిటైల్‌ మార్కెట్‌లో ధరలను పెంచేస్తుంటే చంద్రబాబు సర్కారు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోంది. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కానీ, ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్న మిల్లర్లపైగానీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. 

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు ఉన్నాయో లేదో కూడా తెలీని పరిస్థితి. రోజువారీ తనిఖీల జోలికి పోవడంలేదు. మార్కెట్‌లో బియ్యం, ఇతర నిత్యావసరాల నిల్వలను పరిశీలించడం, కృత్రిమ కొరతను అరికట్టడం, మిల్లర్ల ధరల నిర్ణయ విధానాలను పర్యవేక్షించడంలో ప్రభు­త్వం ఘోరంగా విఫలమవుతోంది. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు మొక్కుబడి తంతుగా మారింది. స్థానిక ఎమ్మెల్యేల నుంచి ముఖ్యనేత వరకు భారీగా నెలవారీ ముడుపులు అందుతుండడంవల్లే ప్రభుత్వం ధరల పెరుగుదలను అరికట్టడంలేదన్న వాదన వినిపిస్తోంది. 

పిల్లలకు కడుపు నిండేదెలా?.. 
ఇక పాలు, కోడిగుడ్లు, కందిపప్పు, చికెన్, పంచదార ఇలా అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పిల్లలకు బలవర్థకమైన ఆహారం ఎలా పెట్టేదంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత పాలు లీటరుకు రూ.12పైనే పెరిగిందని.. అలాగే, ఐదు రూపాయలకు దొరికే కోడిగుడ్డు ఇప్పుడు రూ.8 పెట్టినా దొరకడంలేదని, చివరకు పంచదార కూడా రూ.30 నుంచి రూ.75కి పెరిగిపోయిందని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. చివరకు కూరగాయల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండాపోతున్నాయి. టమాటా, వంకాయ, బీరకాయ, కాకరకాయ ఇలా ఏ కూరగాయ ధర చూసినా బహిరంగ మార్కెట్లో మండిపోతున్నాయి. ఉల్లి సైతం కిలో రూ.70–80 వరకు పలుకుతోంది. ఇది రూ.100కు చేరే అవకాశాలు లేకపోలేదని వ్యాపారస్తులు చెబుతున్నారు.

బడాబాబులకు మాత్రం కారుచౌకగా భూములు..
మరోవైపు నూనెలు, పçప్పుల ధరలు కూడా చుక్కలంటుతున్నాయి. నెలవారీ ఆదాయంలో ఆహార పదార్థాలకే అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోందని సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలా అన్ని ధరలు దడపుట్టిస్తున్నా పట్టించుకోని చంద్రబాబు సర్కారు కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం రూ.కోట్ల విలువైన భూములను గంపగుత్తగా 99 పైసలకే కట్టబెడుతోంది. కేజీ బియ్యం రూ.100 పలుకుతుంటే.. అదే కార్పొరేట్లకు చంద్రబాబు సర్కారు ఎన్ని ఎకరాలైనా 99 పైసలకే ధారాదత్తం చేయడంపై ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.

షాక్‌ కొడుతున్న సన్న బియ్యం ధరలు.. 
మాది వ్యవసాయ కుటు­ంబం. బియ్యం ధరలు రోజు­రోజుకూ చుక్కలనం­టు­తు­న్నాయి. సన్న బియ్యం ధరలు షాక్‌ కొడుతున్నాయి. 26 కేజీ­ల బస్తా రూ.1,900–2,500 మధ్య పలుకు­తో­ంది. ఇలా అయితే ఏం తిని బతాకాలి? ధరల నియంత్రణను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పప్పులు, నూనె ధరలూ మండిపోతున్నాయి. కూరగాయలైతే కొనలేని పరిస్థితి. – పగిడిపల్లి వినోద్, విశదల గ్రామం, గుంటూరు జిల్లా  

బియ్యం ధరలు ఇలా పెరిగితే ఎలా?
బియ్యం 26 కిలోల బస్తాను గత నెలలో రూ.1700కు కొన్నాం. ఈనెలలో అది 2,500 అయింది. నెలలోనే రూ.800 పెరిగితే ఎలా బతకాలో మీరే చెప్పండి.  అన్ని ధరలూ పెరిగాయి.  ధరలను అదుపు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వెంటనే బియ్యం ధరలు తగ్గించాలి. లేకుంటే పేదలు బతకలేరు. – బోరుగడ్డ భాగ్యమ్మ, మేడికొండూరు, గుంటూరు జిల్లా

సామాన్యుడు బతకలేని పరిస్థితి.. 
రెండేళ్లలో అన్ని రకాల నిత్యావసర వస్తువుల రేట్లు రెట్టింపయ్యాయి. పావు బస్తా బియ్యం రూ.2,500, పప్పులు రూ.150–200 పెట్టందే దొరకడంలేదు. గతంలో వంద రూపాయలిస్తే పండ్లు వచ్చేవి. ఇప్పుడు అన్నీ కేజీలు లెక్కనే అమ్ముతున్నారు. కూలినాలీ చేసుకునే వారే కాదు.. సామాన్యులు కూడా బతకలేని పరిస్థితులున్నాయి. పాలకులకు ఇవేమీ పట్టడంలేదు.  – బగాది పద్మ, మధురవాడ, విశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement