పత్రాలు కాదు.. ప్రజాస్వామ్యమే మాయం! | YSRCP candidates nominations rejected due to lack of key documents | Sakshi
Sakshi News home page

పత్రాలు కాదు.. ప్రజాస్వామ్యమే మాయం!

Oct 27 2026 2:56 AM | Updated on Oct 27 2026 2:56 AM

YSRCP candidates nominations rejected due to lack of key documents

అన్ని పత్రాలూ సమర్పించినా.. కీలక డాక్యుమెంట్లు లేవంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

రిటర్నింగ్‌ అధికారులు సంతకాలు చేసి ఇచ్చిన పత్రాలున్నా అభ్యర్థులకు తప్పని అన్యాయం!

అభ్యర్థులు వెళ్లిపోయాక నామినేషన్‌ పత్రాలు తొలగించిన పచ్చమూకలు

తిరస్కరణలపై ఆర్డీవోల వద్ద అప్పీళ్లు చేసినా దక్కని న్యాయం!

అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించిన బాబు గ్యాంగ్‌

బయట గూండాల దౌర్జన్యం.. లోపల అధికారిక వ్యవస్థలోనే అన్యాయం జరిగితే ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడ?

సాక్షి, అమరావతి: నామినేషన్‌ వేయనీయకుండా అడ్డుకోవడం ఒక దౌర్జన్యం.. నానా అవరోధాలను దాటుకుని నామినేషన్‌ సమర్పిస్తే, ఆ పత్రాలనే మాయం చేసి తిరస్కరించడం మరో దారుణం! అన్ని డాక్యుమెంట్లను స్వీకరించి, పరిశీలించి, సంతకాలు చేసి ఇచ్చిన తర్వాత అవే పత్రాలు లేవంటూ నామినేషన్‌ను తిరస్కరిస్తే దాన్ని ఏమనాలి? ఇది ఎన్నికల ప్రక్రియనా? అధికార దుర్వినియోగమా? లేక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమా? ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలను చంద్రబాబు సర్కార్‌ ఏ స్థాయికి దిగజార్చిందో తెలుసుకోవడానికి ఇదో ప్రబల నిదర్శనం.

చంద్రబాబు డైరెక్షన్‌లో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం నుంచి, నామినేషన్లు సమర్పించిన తర్వాత పత్రాలు లేవంటూ తిరస్కరించడం వరకు సాగుతున్న పరిణామాలు ఇందుకు ఉదాహరణ. తమ వద్ద అన్ని పత్రాలు సమర్పించినట్లు ఆధారాలు ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నా, నామినేషన్లు తిరస్కరణకు గురైతే వారికి న్యాయం చేసేదెవరు? రిటర్నింగ్‌ అధికారుల నిర్ణయాలపై అప్పీళ్లు చేసినా పరిష్కారం లభించకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఎలా నిలుస్తుంది? 

మీరే పత్రాలు తీసేసి.. తిరస్కరించడం న్యాయమా? 
స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా ఎల్లో మూకలు, గంజాయి ముఠాలు, పోలీసులు కలిసి కాలకేయుల్లా అడ్డుకున్నారు. వారందరినీ దాటుకుని ఈ అరాచకాన్ని ఎదిరించి ఎలాగోలా నామినేషన్‌ సెంటర్లకు వచ్చి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్లను అందించారు. నామినేషన్‌ పేపర్లకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయని చెక్‌చేసి ధృవీకరించి అధికారికంగా రిటర్నింగ్‌ అధికారి సంతకం చేసి మరీ ఇచ్చారు. అంటే దానర్థం ఏమిటి? నామినేషన్‌ సరిగా ఉందనే కదా? కానీ అభ్యర్థులు వెళ్లిపోయిన తర్వాత కాలకేయులు, పచ్చమూకలు మళ్లీ రంగంలోకి వచ్చాయి. వాళ్లు సూచించిన నామినేషన్లలో కొన్ని పేపర్లను తీసేశారు. కొన్ని డాక్యుమెంట్లు మాయం చేసేశారు. చివరకు అవి లేవంటూ ఆ నామినేషన్లను తిరస్కరించారు.  

ఇది ‘సర్‌’ కన్నా ఘోరం. 
ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఇది ‘సర్‌’ కన్నా దారుణం. మాటలలో వర్ణించలేని ద్రోహం. సర్‌ ప్రక్రియ వల్ల ఒక ఓటు పోతుందంటే ఎంతో ఘోరం అని మనం అంటున్నాం. అలాంటిది ఒక ఎంపీటీసీ లేదా జడ్‌పీటీసీ లేదంటే ఒక వార్డు కౌన్సిలర్‌ అయినా ఏవో దుర్మార్గమైన, దొంగ కారణాలు చెప్పి నామినేషన్‌ లేదంటే ఎంత ఘోరం? ఎన్ని వేలమందికి చేసిన అన్యాయమది? ఒక ఎంపీటీసీ నామినేషన్‌ తీసేయడమంటే మొత్తం మండలంలోని ఓటర్లందరినీ తీసేసినట్టే. ఎందుకంటే పోటీలేదంటే ఇక ప్రజాభిప్రాయానికిచోటు లేనట్లే కదా..  

ఆర్డీవోల వద్దా అదే అన్యాయం 
తాము ఎంచుకున్న నామినేషన్లను తీసేయడానికి రిటర్నింగ్‌ అధికారులను పచ్చమూకలు పచ్చిగా వాడుకున్నాయి. నామినేషన్‌ వేసేటపుడే అన్నీ ఇచ్చామని, తాము అన్నీ ఇచ్చినట్లు ఆర్‌వోలు ఇచ్చిన లేఖలు ఇవిగో అంటూ ఆర్డీవోల వద్దకు అభ్యర్థులు అప్పీలుకు వెళితే అక్కడా ఇదే రకమైన అన్యాయం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్‌వోలను వాడుకుని ఇలా నామినేషన్లను తిరస్కరించడం అత్యంత దుర్మార్గమని ప్రజాస్వామికవాదులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

ఇంత పతనం.. సమాజానికే ప్రమాదం..
ఉన్నత చదువులు చదివిన అధికారులు.. ఉన్నతంగా బ్రతకాలి.. మనస్సాక్షిని, నైతిక విలువలను వదిలిపెట్టి దిగజారకూడదు. కిరాయి గూండాలు, రౌడీలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను బయట చించివేస్తే.. మీరు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను అధికారికంగా మీ ఆఫీసులో చించేశారు.. మీకు వాళ్లకు తేడా ఏముంది. భవిష్యత్తులో మీ మీద మీరే నమ్మకం కోల్పోయే స్థితి వస్తుంది. ఒక ఉన్నతాధికారి ఇంత నైతికంగా పతనమై ఉద్యోగం చేయడం సమాజానికే ప్రమాదం. ఈ రోజు ఎందరో రాజకీయ భవిష్యత్తును దెబ్బకొట్టిన మీరు కూడా భవిష్యత్తులో పశ్చాత్తాపం పడే రోజు తప్పక వస్తుంది. ఈ రోజు తప్పు చేసిన మీ అందరిపై మా శక్తి మేరకు న్యాయ పోరాటం కొనసాగుతుంది.       – చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్‌సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement