పల్నాడు జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టించారని మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీని చూసి వణికిపోతున్నారని విమర్శించారు.
పల్నాడు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తెలుగుదేశం నాయకులు, ఎన్నికల అధికారులు అంతా కలిసి కుమ్మక్కైపోయి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ దాఖలు వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళల చీరలు లాగేసి మరీ టీడీపీ గూండాలు దారుణానికి పాల్పడ్డారు. కొంతమంది పోలీసులు తెలుగుదేశం నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని దారుణంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయింది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు బిహార్ బ్యాచ్‌ను అద్దెకు తెచ్చి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుని దాడులు చేశారు. తెలుగుదేశం నాయకులే మెడలో వైఎస్సార్‌సీపీ కండువాలు వేసుకుని మా పార్టీ పేరుతో నామినేషన్లు వేయటం సిగ్గుచేటు. పోలీసులు తెలుగుదేశం నాయకులు దాఖలు చేసిన దొంగ నామినేషన్లకు సెక్యూరిటీ కల్పించడం సిగ్గుచేటు’’ అని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నామినేషన్ దాఖలు చేయకుండా దాడులు చేసి ఏకగ్రీవాలని చెప్పుకుంటూ టపాసులు కాల్చుకోవడానికి సిగ్గుండాలి. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికలను రద్దుచేసి మళ్లీ ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు 70 ఎంఎం లో సినిమా చూపిస్తాం’’ అని హెచ్చరించారు.
సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని కలెక్టర్ ఎస్పీ ఎన్నికల సంఘానికి అనేకసార్లు ఫిర్యాదు చేశాం. ఎవ్వరు పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులమని తెలుగుదేశం నాయకులు దాఖలు చేసిన నామినేషన్లకు పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడం సిగ్గుచేటు. మా కార్యకర్తలపై దాడులు చేసిన వారిని అక్రమంగా కేసులు పెట్టిన పోలీస్ అధికారులు ఎవరినీ వదలం. ఈ రోజు మాకు వాళ్లు ఒకటి ఇచ్చారు రేపు కచ్చితంగా వాళ్లకు రెండు ఇస్తాం. ప్రాణాలకు తెగించి కొన్నిచోట్ల నామినేషన్ దాఖలు చేస్తే అర్ధరాత్రి పోలీసులు మఫ్టీ లో వచ్చి గంజాయి కేసులు పెడతామని బెదిరించి నామినేషన్లు విత్ డ్రా చేసుకోమని భయపెడుతున్నారు’’ అని తెలిపారు.


