‘ నాకు వైఎస్‌ జగన్‌ అంటే ఆ భయాన్ని మించిన ధైర్యం’ | Rachamallu Siva Prasada Reddy on Administrative Corruption in Proddatur | Sakshi
Sakshi News home page

‘ నాకు వైఎస్‌ జగన్‌ అంటే ఆ భయాన్ని మించిన ధైర్యం’

Oct 26 2026 3:32 PM | Updated on Oct 26 2026 3:52 PM

Rachamallu Siva Prasada Reddy on Administrative Corruption in Proddatur

ప్రొద్దుటూరు: టీడీపీకి చెందిన వారు మానం, మర్యాద, సిగ్గు ఏమీ లేకుండా తిరుగుతిన్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాదరెడ్డి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘116 సంవత్సరాలు చరిత్ర కలిగిన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, అన్ని వార్డు కౌన్సిలర్లు ఏకగ్రీవం అవడం ఇదే మొదటిసారి. ఒక మున్సిపల్ చైర్మన్,52 మంది కౌన్సిలర్లు,33 మంది ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీని ఏకగ్రీవం చేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్, పోలీసు శాఖ, కలెక్టర్, స్క్రూటినీ అధికారులు తప్పు చేశారు. రాజుపాలెం జడ్పీటీసీకి నామినేషన్ వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పట్టుకొని నామినేషన్ విత్ డ్రా చేయించడం కోసం టీడీపీ రౌడీలు, పోలీసులు వేటాడుతున్నారు. 

ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ పార్టీల నాయకులకు, ఓటు వేసే ప్రజలకు కిక్కు లేదు. గెలిచిన వారిలో కూడా ఆనందం లేదు. గెలిచిన వారు శవాల ముఖాలు వేసుకొని డిక్లరేషన్ ఫామ్‌లు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో విధులు నిర్వహించిన ప్రభుత్వ అధికారులకు మాత్రం ఫుల్ కిక్కు వచ్చింది. 84 మంది అధికారులు ఎన్నికల విధులలో పాల్గొన్నారు. ఎలక్షన్ ఆఫీసర్‌కు లక్ష రూపాయలు, అడిషనల్ ఎలక్షన్ ఆఫీసర్‌కు 75 వేల రూపాయలు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌కు 75 వేల రూపాయలు, వీఆర్వోకు 50 వేల రూపాయలు, సచివాలయ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగికి 25 వేల రూపాయలు, కెమెరామన్‌కు 20 వేల రూపాయలు మొత్తం 3 లక్షల 45 వేల రూపాయలు ఇచ్చారు’’ అని తెలిపారు.

అధికారానికి భయపడి.. 
అధికారులు డబ్బు కోసం ఈ తప్పు పనిచేయలేదని.. అధికారానికి భయపడి తప్పు చేశారని రాచమల్లు తెలిపారు. ‘‘ఎన్నికలు జరిగిన పది రోజులలో టీడీపీ వారు కూర్చోమంటే కూర్చున్నందుకు, లెమ్మంటే లేచినందుకు మున్సిపల్ కమిషనర్‌కు 25 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు. కానిస్టేబుల్ కు 5 వేల రూపాయలు, ఏఎస్ఐ,స్టేషన్ రైటర్ కు పదివేల రూపాయలు, ఎస్సైకి లక్ష రూపాయలు, సీఐకి రెండు లక్షల రూపాయలు ఇచ్చారని ప్రజలు అనుకుంటున్నారు. నేను చెప్పింది అబద్ధమైతే 84 మంది అధికారులలో ఎవరైనా  సరే డబ్బు తీసుకోలేదని దైవ సాక్షిగా, వారి పిల్లలపై ప్రమాణం చేయాలి. 

నేను చెప్పేది అబద్ధం కాదు నిజమని నేను ప్రమాణానికి సిద్ధం మీరు ప్రమాణం చేయడానికి సిద్ధమా? 2029లో ఓట్లు అడగడానికి ఇళ్ల వద్దకు మీరు వస్తే చెప్పుతో కొడతామని ప్రజలు అంటున్నారు. ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే నాయకుడు అవుతారు, పోలీసులు ఓటు వేసి గెలిపిస్తే రౌడీవి అవుతావు. ఇది రాజకీయమని టీడీపీ వారు అనుకుంటున్నారు.. కాదు ఇది రౌడీయిజం. నాపై కేసులు పెడతారని నాకు భయం లేదు. మరణం అంటే భయం అందరికీ ఉంటుంది, నాకూ మరణం అంటే భయం ఉంది.. ఆ భయాన్ని మించి నాకు వైఎస్‌ జగన్ అంటే ధైర్యం ఉంది. నేను బతికి ఉన్నంత వరకు వైఎస్‌ జగన్‌కు ఉపయోగపడతా, ఒకవేళ నేను మరణించాల్సి వస్తే నా మరణం కూడా వైఎస్‌ జగన్‌కు ఉపయోగపడుతుంది’’ అని తెలిపారు. 

ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement