వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్ వేసిన టీడీపీ నేత యాడిక గోవిందరెడ్డి ఆ పార్టీ దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మీతో దిగిన ఫొటో
తాళ్లూరు(ప్రకాశం జిల్లా): మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనీయకుండా టీడీపీకి చెందిన కొందరు అడ్డుకోవడంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాకుండా టీడీపీకి చెందిన నాయకులే వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి అభ్యర్థికి ఉందని, నామినేషన్ వేయకుండా ఎలా అడ్డుకుంటారని మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియలో మహిళలపై దాడి చేస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, అధికారులు సైతం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లిస్టులో ఉన్న యాడిక గోవిందరెడ్డి పేరు
ఫేక్ నామినేషన్లు వేసిన టీడీపీ నేతలు...
మండలంలోని తూర్పుగంగవరం గ్రామానికి చెందిన టీడీపీ బొల్లా శివన్నారాయణ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే గ్రామానికి చెందిన యాడిక గోవిందరెడ్డి టీడీపీ తరఫున గతంలో 13వ వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. టీడీపీ నేత అయ్యి ఉండి కూడా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయడంపై మండల ప్రజలు మండిపడుతున్నారు.
అలాగే తురకపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ చంద్రగిరి గురువారెడ్డి భార్య చంద్రగిరి రాజేశ్వరి కూడా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. అర్హత ఉన్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అడ్డుకుని టీడీపీ నేతలే వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా ఫేక్ నామినేషన్లు వేసి కుట్రలకు పాల్పడటంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆడవాళ్లని కూడా చూడకుండా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు
నామినేషన్ల రెండో రోజు బ్యాంకు పనిమీద తాళ్లూరు వెళ్లాం. అక్కడున్న టీడీపీ నేతలు ఎక్కడికి వెళ్లేది మీరు.. బ్యాంకు లేదు ఏమీ లేదంటూ మా సెల్‌ఫోన్లు లాక్కుని నేలకేసి కొట్టారు. భయంతో వెనక్కి వెళ్లిపోయాం. ఆ తర్వాత తురకపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళితే టీడీపీ గూండాలు అడ్డుకుని మహిళలని కూడా చూడకుండా మాపై దాడి చేశారు. భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసులు చూస్తూ ఉన్నారు తప్ప వారిని ఏమీ అనలేదు.
– కుమ్మిత రవణమ్మ, కుమ్మిత శివపార్వతి
నామినేషన్ కాగితాలు లాక్కున్నారు
మల్కాపురం ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్ వేయడానికి వెళ్లాం. హైస్కూల్ వద్దకు వెళ్లేసరికి అక్కడ గుంపుగా ఉన్న టీడీపీ నేతలు చుట్టుముట్టి నామినేషన్ వేయడానికి వీల్లేదని అడ్డుకుని నామినేషన్ కాగితాలు లాక్కున్నారు. ఆ సమయంలో భయమేసింది. దళిత మహిళలపై దాడి చేయడానికి వచ్చిన టీడీపీ నేతలను అడ్డుకోకుండా అక్కడున్న పోలీసులు చోద్యం చూశారు. దీంతో నామినేషన్ వేయకుండానే వెనుదిరిగాం.
– అనపర్తి మార్తమ్మ, పులి విజయ, పులి అనూష


