సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ సంక్షోభం, ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేసిన తప్పులకు అధికారులను బాధ్యులను చేస్తూ సీఎం, మంత్రులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు.
బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఏర్పాటు చేసుకోకపోవడం, విద్యుత్ రంగంపై సకాలంలో సమీక్షలు నిర్వహించకపోవడం వల్లే కరెంట్ కోతల పరిస్థితి ఏర్పడిందని హరీశ్ రావు విమర్శించారు. ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాఖ, శాస్త్రవేత్తలు తొమ్మిది నెలలుగా హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు పరిస్థితి తీవ్రం కావడంతో అధికారులను సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరించడం సరికాదన్నారు.
నిషేధిత భూముల జాబితా అంశంలోనూ ప్రభుత్వమే తప్పులు చేసి అధికారులపై నెపం నెట్టిందని హరీశ్ రావు విమర్శించారు. విద్యుత్ సంక్షోభం విషయంలోనూ అదే వైఖరిని అనుసరిస్తోందని ఆరోపించారు. ఎల్నినోను కోవిడ్ తరహా విపత్తుగా సీఎం అభివర్ణించడాన్ని ప్రస్తావిస్తూ.. అలాంటి పరిస్థితి వస్తుందని ముందే హెచ్చరికలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదని ప్రశ్నించారు. అధికారుల ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరించే ముందు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీశ్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: తెలంగాణలో కొత్త ఓటర్లకు బిగ్ అలర్ట్.. నేడే, రేపే ఛాన్స్!


