హైదరాబాద్: గత ప్రభుత్వం నుంచి అపరిష్కృతంగా ఉన్న గురుద్వారా భూ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయసమ్మత పరిష్కారం లభించేలా కృషి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోనీ ఐటిసి కాకతీయ హోటల్ లో ఆదివారం సిక్కు సమాజ ప్రముఖులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధూ, సురీందర్‌పాల్ సింగ్, అమర్‌దీప్ సింగ్, సిక్కా, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో పాటు పలువురు సిక్కు మత పెద్దలు, సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. గురుద్వారా భూములు, పాఠశాల, ఆటస్థలానికి సంబంధించిన సమస్యలను సిక్కు సమాజ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన నేపథ్యంలో తమ భూములకు నష్టం వాటిల్లే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఈ అంశం తన శాఖ పరిధిలో లేకపోయినప్పటికీ సమస్యను పక్కన పెట్టబోనని స్పష్టం చేశారు. సంబంధిత శాఖలు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమగ్రంగా పరిశీలించేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గురుద్వారా భూములు, సిక్కు సమాజ సంస్థలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వపరంగా చేయగలిగిన సహాయాన్ని తప్పకుండా అందిస్తామని తెలిపారు.
గురుద్వారాలలో ఆధ్యాత్మిక సేవలందిస్తున్న రాగీలు, గ్రంథీల గౌరవ వేతనాల అంశంపైనా మంత్రి సానుకూలంగా స్పందించారు. మౌల్వీలు, ఆలయాల్లో మతపరమైన సేవలందిస్తున్న వారితో సమానంగా రాగీలు, గ్రంథీలకు గౌరవ వేతనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధూ భారత విదేశాంగ సేవలో అందించిన విశిష్ట సేవలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు.
తాను భారత వైమానిక దళ అధికారిగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతులు ఆర్. వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ వద్ద పనిచేసిన కాలంలో అనేకమంది విదేశాంగ సేవా అధికారులతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. సిక్కు సమాజంతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని పేర్కొన్న మంత్రి, వారి హక్కులు, సంక్షేమం, సంస్థల పరిరక్షణకు సంబంధించిన ఏ అంశంలోనైనా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.


