అల్లరితోనే ఆరోగ్యం!  | fitness gadgets to help improve health your Childrens | Sakshi
Sakshi News home page

అల్లరితోనే ఆరోగ్యం! 

Nov 29 2026 2:00 PM | Updated on Nov 29 2026 2:00 PM

 fitness gadgets to help improve health your Childrens

ఇంట్లో పిల్లల అల్లరికి ఫుల్‌స్టాప్‌ పెట్టడం కష్టమే కాని, ఆ అల్లరినే వ్యాయామంగా మార్చేస్తే? కేవలం ఆటపాటలతోనే ఆరోగ్యాన్ని అందించే స్మార్ట్‌ గాడ్జెట్లే ఇవీ!

గోడే కొండ!
పిల్లలు గోడలు ఎక్కాలనుకోవటం మామూలే. అయితే ఈసారి ఆ అల్లరికి ఓ సాహస క్రీడను జోడించండి! ఈ క్లైంబింగ్‌ హోల్డ్స్‌తో ఇంట్లోనే చిన్న క్లైంబింగ్‌ వాల్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆరు రంగురంగుల హోల్డ్స్‌ ఉండే ఈ సెట్‌ను చెక్క బోర్డుపై లేదా తగిన గోడ నిర్మాణంపై బిగించుకోవచ్చు. ఒక్కో హోల్డ్‌ను పట్టుకుని, పాదాలను ఆసరాగా చేసుకుంటూ పైకి ఎక్కడం పిల్లలకు సరదాతోపాటు మంచి శారీరక శ్రమనూ ఇస్తుంది. పట్టును బిగించడం, చేతులు, కాళ్ల సమన్వయం, శరీర సమతుల్యత వంటి నైపుణ్యాలు మెరుగుపడటానికి తోడ్పడుతుంది. ఒక్కో హోల్డ్‌ గరిష్ఠంగా 120 కిలోల బరువును తట్టుకోగలదు. బోల్టులు, వాషర్లు, అలెన్‌కీ కూడా సెట్‌లో ఇస్తారు. ధర రూ.900.

హైట్‌ ఫైట్‌!
ఫోన్‌ లో గేమ్‌ ఆడితే బ్యాటరీ అయిపోతుంది. కాని, అదే ఈ హ్యాంగింగ్‌ రాడ్‌తో ఆడితే క్యాలరీలన్నీ ఖర్చవుతాయి! పిల్లల ఎత్తు పెంచడానికి పార్కుల చుట్టూ తిప్పాల్సిన పనిలేకుండా, ఇంట్లోనే ఈజీగా కేవలం తలుపుల మధ్య ఉంచి సెట్‌ చేసుకోవచ్చు. పైగా ఇందుకోసం గోడలకు చిల్లులు పెట్టాల్సిన పనిలేదు. పిల్లల పొడవుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకునే వీలు కూడా ఉంది. 

దీనిపై వేలాడుతూ స్ట్రెచింగ్, పుల్‌ అప్స్, చిన్‌  అప్స్‌ వంటి వ్యాయామాలు చేయొచ్చు. వీటి సేఫ్టీ లాక్, జారిపోకుండా పట్టుకునే రబ్బర్‌ ప్యాడ్స్‌ అదనపు భరోసా ఇస్తాయి. పిల్లలతోపాటు పెద్దలూ ఉపయోగించుకునేలా 100 కిలోల బరువును తట్టుకుంటుంది. పని పూర్తయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ధర రూ.700.

మూడు రకాల మజా!
ఒకసారి ఊయల ఊగాలి... మరోసారి తాళ్లతో పైకి ఎక్కాలి... ఇంకోసారి రింగ్స్‌ పట్టుకుని వేలాడాలి! పిల్లల అల్లరికి అంతులేని అవకాశాలిచ్చే త్రీ ఇన్‌ ఒన్‌ ప్లే సెట్‌ ఇది. ఇందులో డిస్క్‌ స్వింగ్, నింజా రోప్‌ ల్యాడర్, ట్రపీజ్‌ బార్‌తో కూడిన జిమ్నాస్టిక్‌ రింగ్స్‌ ఉన్నాయి. 

ఇంట్లో సరైన సపోర్ట్‌ ఉన్న చోటైనా, పెరట్లో ఏర్పాటు చేసుకున్న ఫ్రేమ్‌కైనా అమర్చుకోవచ్చు. ఊగడం, ఎక్కడం, వేలాడటం వంటి ఆటలతో పిల్లలకు వినోదంతోపాటు శారీరక ఆరోగ్యం కూడా అందుతుంది. మూడు నుంచి పన్నెండు ఏళ్ల పిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ధర రూ.1,500.

ఇదీ చదవండి: ఎంత పెద్ద మనసు ఆ ‘అమ్మ’ది..! ఒడిలో పసికందు, కళ్లముందు పుట్టెడు దుఃఖం అయినా..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement