మీకు విలనే ‘ఇన్సులిన్‌’! | Insulin Resistance Lifestyle Diseases | Sakshi
Sakshi News home page

మన ఆహారమే అనారోగ్యానికి కారణమవుతోందా?

Nov 27 2026 9:39 AM | Updated on Nov 27 2026 9:39 AM

Insulin Resistance Lifestyle Diseases

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

ఇన్సులిన్‌ నిరోధకతతో మనుషుల్లో జబ్బుల ఫ్యాక్టరీ

సుమారు 80రకాల జబ్బులకు దారితీస్తున్న వైనం

షుగర్, బీపీ, హృద్రోగం, పక్షవాతం, కేన్సర్, అల్జీమర్స్, ఒబెసిటీ వ్యాధులకు మూలకారణమిదే

ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌తో కొంతమేర బయటపడొచ్చు

పిండిపదార్థాలకు దూరంగా, మితంగా తినాలంటున్న వైద్యులు

జీవనశైలి మార్పులతోనే నివారణ సాధ్యమంటున్న నిపుణులు

ఇన్సులిన్‌ నిరోధకతను రైలు బోగీతో పోల్చిన కెనెడా నెఫ్రాలజిస్ట్‌

ఒక వ్యక్తికి ఒకటికి నాలుగు ఆరోగ్య సమస్యలు ఉంటే.. వాటికి వేర్వేరు కారణాలు ఉండి ఉంటాయని సాధారణంగా అనుకుంటూ ఉంటాం. అయితే, అది వాస్తవం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఆధునిక జీవనశైలి రుగ్మతల్లో సుమారు 80 వ్యాధులకు శరీరంలో ఏర్పడే ‘ఇన్సులిన్‌ నిరోధకతే’(ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌) ప్రధాన మూల కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

కేవలం షుగరే కాకుండా ఊబకాయం, గుండె జబ్బులు, బీపీ, ఫ్యాటీ లివర్, పీసీఓఎస్, పక్షవాతం, అల్జీమర్స్‌ తదితర కొన్ని రకాల క్యాన్సర్లకు ఇదే మూలమని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మనం తీసుకునే ఆహారంలోని మితిమీరిన స్థాయిలో ఉన్న కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్డ్‌ చక్కెరలు రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్‌ స్థాయిలను విపరీతంగా పెంచుతున్నాయి. మన ఆహారం ద్వారా శరీరంలోకి చేరిన గ్లూకోజ్‌తో కణాలు పూర్తిగా నిండిపోవడం వల్ల, ఆ తర్వాత ఇన్సులిన్‌ ప్రభావం చూపలేకపోతోంది.

ఆ విధంగా ఇన్సులిన్‌ నిరోధకత తలెత్తుతుంది. దీన్ని గుర్తించకుండా కేవలం షుగర్‌ మందులపైనే ఆధారపడుతూ పోతే.. దీర్ఘకాలంలో శరీరంలోని వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ ‘చక్కెర చక్రబంధం’నుంచి బయటపడటం ఎలా? రక్తంలో చక్కెర తగ్గించుకోవడమే కాకుండా, కణాల్లో పేరుకుపోయిన అధిక గ్లూకోజ్‌ను ఖాళీ చెయ్యాలి. అది జరగాలంటే రోజూ మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు తగ్గించి, రోజుకు రెండు లేదా మూడు సార్లు మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

అంటే.. వైద్యుల పర్యవేక్షణలో ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌’పాటించాలన్న మాట. అంటే పగలు 8 గంటల్లో రెండు సార్లు తినడం, సూర్యాస్తమయం సమయానికే తినడం ముగించి.. మిగతా 16 గంటలు శరీరానికి తనను తాను బాగు చేసుకునే అవకాశం ఇవ్వాలని, ఆ విధంగా ‘ఇన్సులిన్‌ నిరోధకత’నుంచి బయటపడి ‘ఇన్సులిన్‌ సున్నితత్వా’న్ని పెంచుకొని జీవనశైలి రుగ్మతలన్నిటి నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

‘ఓవర్‌ఫ్లో’సిద్ధాంతం తెలుసా? 
కెనడాకు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్, పలు బెస్ట్‌ సెల్లింగ్‌ పుస్తకాల రచయిత డాక్టర్‌ జాసన్‌ ఫంగ్‌ ఇన్సులిన్‌ నిరోధకతను రైలు బోగీతో పోల్చి విశ్లేíÙంచారు. ‘ఒక రైలు బోగీ (కణం) ప్రయాణికుల(గ్లూకోజ్‌)తో కిక్కిరిసిపోయినప్పుడు, బోగీ డోర్లు తెరిచినా కొత్తగా లోపలికి ఎవరూ వెళ్ళలేరు.

అదే విధంగా నిండిపోయిన కణాల్లోకి గ్లూకోజ్‌ వెళ్లలేక బయట రక్తంలో పేరుకుపోతుంది. కిక్కిరిసిన బోగీలోకి బలవంతంగా తోయడానికి మరిన్ని ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు ఇస్తే, తాత్కాలికంగా రక్తంలో చక్కెర తగ్గినట్లు కనిపించినా శరీరంలో కొవ్వు, బరువు పెరిగి సమస్య మరింత జఠిలమవుతుంది. కణం లోపలి గ్లూకోజ్‌ను ఖాళీ చేయడమే ఈ సమస్యకు పరిష్కార మార్గం. లో–కార్బ్‌ ఆహారాలు తీసుకోవడం, ఉపవాసం (ఫాస్టింగ్‌) ద్వారా శరీరంలోని కొవ్వు నిల్వలను కరిగించుకుంటే ఇన్సులిన్‌ నిరోధకత, ఫ్యాటీ లివర్‌ రివర్స్‌ అవుతాయి..’అన్నారాయన.

ఇన్సులిన్‌ అసమతుల్యతే 80 రోగాలకు మూలం
వ్యక్తి శారీరక అవసరాలకు మించి ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ (పిండిపదార్థాలు) ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ హార్మోన్‌ పనితీరు దెబ్బతిని 80 రకాల జబ్బులు తలెత్తుతున్నాయి. పిండిపదార్థాలు మితిమీరి తింటే శరీరం బరువు, పొట్ట పెరుగుతాయి. మనిషి ఎత్తు కొలతలో నడుము చుట్టుకొలత సగం కంటే తక్కువగా ఉండాలి. అంతకన్నా పెరిగితే ఇన్సులిన్‌ నిరోధకత ఉన్నట్లే.

దీని వల్లే స్థూలకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్‌ వంటి 80 ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. మందులతో సరిపెట్టుకోవడం కాదు. వైద్యుల పర్యవేక్షణలో వ్యక్తిగత అవసరాల మేరకు ఆహారంలో పిండిపదార్థాలను నియంత్రించుకుంటూ ఇన్సులిన్‌లో అవకతవకలను సరిచేసుకొని, తిరిగి ఆరోగ్యవంతులం కావడమే అసలైన పరిష్కారం. 
– డాక్టర్‌ పీ.వీ. సత్యనారాయణ, ప్రముఖ కార్డియో థొరాసిక్‌ సర్జన్, సీనియర్‌ మెటబాలిక్‌ హెల్త్‌ కన్సల్టెంట్‌

ఇదీ చదవండి: Prostate cancer: పురుషుల్లో పెరుగుతున్న ఆ క్యాన్సర్‌..! ఐసీఎంఆర్‌ అలర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement