జ్యోతిర్మయం
కార్తిక దానం
శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన కార్తిక మాసంలో చేసే ప్రతి సత్కర్మ అనంత ఫలితాన్ని ఇస్తుంది. ఇందులో దానానికి విశేష స్థానం ఉంది. దానం అంటే వస్తువును ఇవ్వడం కాదు; అహంకారాన్ని, మమకారాన్ని వదులు కోవడం. మన దగ్గర ఉన్నదంతా ఈ సృష్టి ఇచ్చిన తాత్కాలిక సదుపాయం మాత్రమే. ‘నేను’, ‘నాది’ అనే బంధాల నుండి విముక్తికి దానం దివ్యౌషధం.
ధర్మబద్ధమైన దానం తరాలను కాపాడుతుందని కార్తిక పురాణం చెబుతోంది. దీనికి ధనేశ్వరుడి కథ నిదర్శనం. లోభిగా మారిన అతడు, కార్తికంలో నర్మదా తీరాన తెలియకుండా చేసిన గుప్తదానం వల్ల సద్గతులు పొందాడు. అజాగ్రత్తగా చేసిన దానానికే అంతటి ఫలితం దక్కితే, భక్తితో చేసే దానాల మహిమ వర్ణనాతీతం అని దీన్ని బట్టి అర్థమవుతుంది. భౌతిక సంపదలు తాత్కాలికం... హృదయ పూర్వకంగా చేసే దానమే శాశ్వతం.
– తూలుగు రమణారావు


