అపార సంపద ఉన్నా.. అనుభవించేవారు లేరని కన్నీళ్లు! | Ocean Wealth Life Lesson | Sakshi
Sakshi News home page

అపార సంపద ఉన్నా.. అనుభవించేవారు లేరని కన్నీళ్లు!

Nov 23 2026 7:58 AM | Updated on Nov 23 2026 7:58 AM

Ocean Wealth Life Lesson

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

జ్యోతిర్మయం

స్వార్థరహితమైన ఆనందం

సాయం సమయ. మధ్యవయస్కుడైన ఒక వ్యక్తి సముద్రతీరంలో కూర్చుని తీక్షణంగా సముద్రం వైపునకే చూస్తున్నాడు. ముఖంలో ఏదో దిగులు, కళ్లలో నీరు! అందరూ అక్కడికి సంతోషంగా గడప డానికి వచ్చినవారే కావడంతో ఎవ్వరూ అతడిని పట్టించుకోలేదు. కొంతసేపటికి, ఆ వ్యక్తి పక్కన ఒక వృద్ధుడు వచ్చి కూర్చున్నాడు. ముందు తానే పలకరించి, ఆ మధ్యవయస్కుడిని మాటలలో పెట్టి, దుఃఖ కారణం అడిగాడు.

అనంతమైన సంపదకు నెలవైన తన కుటుంబంలో, ఆ సంపదను అనుభ వించడానికి ఎవరూ లేకపోవడం తన దుఃఖానికి కారణమని చెప్పాడా మధ్యవయస్కుడు. ఆ అర్హత ఉన్న తన ఒక్కగా నొక్క కొడుకును, ఎదురుగా ఉన్న ఈ సముద్రమే కొన్నాళ్ళ క్రితం తన పొట్టన పెట్టుకుందనీ, పగలనక రేయనక కష్టపడి తాను సంపాదించి కూడబెట్టిన సంపద అంతా అలా వ్యర్థంగా మారిపోవడం మాటలలో చెప్పలేని బాధను కలిగిస్తున్నదనీ కన్నీళ్ళుపెట్టుకున్నాడు.

ఆ వ్యక్తి మాటలను విన్న వృద్ధుడు, కరుణ నిండిన చూపులతో అతడిని చూసి, హాలుడి గాథాసప్తశతికి చెందిన ఒక గాథకు సంస్కృత ఛాయను చదివి వినిపించి, దుఃఖోపశమన్నాన్ని కలిగించి, మార్గనిర్దేశం చేశాడు.

యథా గమ్భీరో యథారత్ననిర్భరో
యథా చ నిర్మలచ్ఛాయః
తథా కిం విధినా యేషః
సరసపానీయో జలనిధిర్నకృతః

‘విధాత జలనిధిని గంభీరమైనదిగాను, రత్నములతో నిండినదిగాను, నిర్మలమైనదిగాను చేశాడు. కాని ఆ జలనిధి నీటిని తాగడానికి యోగ్యమైనదిగా మాత్రం ఎందుకో చేయలేదు. ఆ విధంగానే, ఈ సముద్రంలా అనంతమైనదిగా నీవు చెబుతున్న నీ సంపదను నీ వారసుడు అనుభవించడానికి విధాత ఎందుకో నిశ్చయించలేదు. లోకహితం కోసం ఆ సంపదను వినియోగించడం మొదలుపెట్టు. మనసును మభ్యపెట్టి బాధిస్తున్న దుఃఖం మాయమై, స్వార్థరహితమైన పరమానంద స్థితి అప్పుడు నీ సొంతం అవుతుంది’ అని దీని అర్థం.
– భట్టు వెంకటరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement