breaking news
bhakti
-
దైవకార్యాన్ని అర్థం చేసుకోవాలి
దాసియైన మంధర మాటలు విని, కైకేయి దశరథుడిని కోరిన రెండు వరములతో, శ్రీరాముడికి జరగవలసిన పట్టాభిషేక కార్యక్రమం అకస్మాత్తుగా ఆగిపోయింది. అదేకాక, శ్రీరాముడు పదు నాలుగేళ్ళు వనవాసం చేయవలసిన విషమ పరిస్థితి ఏర్పడింది. శ్రీరాముడికి బహిప్రాణంలా ఉండే లక్ష్మణుడు ఈ హఠాత్పరిణామానికి తట్టుకోలేక దుఃఖంలో మునిగిపోయాడు.‘చేతిలోకి వచ్చి స్వంతమయింది కదా అని భావించిన సంపద అంతలోనే పోవడం, అడవుల పాలవడం– ఇవి దైవనిర్ణయా లుగా జరుగుతాయే తప్ప మనుషుల వశంలో ఉండి జరిగేవి కావు తమ్ముడా!’ అని లక్ష్మణుడిని సమాధానపరిచాడు శ్రీరాముడు. తండ్రి మీద కూడా కోపంతో ఉన్న లక్ష్మణుడితో ఇంకా ఇలా చెప్పాడని ‘గోపీనాథ రామాయణము’ తెలిపింది.మనుషుల జీవితాలలో లాభాలాభములను, సుఖదుఃఖములను, భయక్రోధములను, భవాభవంబులను ఏది కలుగజేస్తుందో అది దైవం అనబడుతుంది. విశ్వామిత్రాది తపోధనులు– జితేంద్రియులు అయ్యుండి కూడా– దైవంచే పీడితులగుచూ శక్తిమంతాలైన వారి నియమాలను విడిచిపెట్టినవారై కామక్రోధాసక్తులగుట తెలిసినదే కదా! ఈ లోకంలో కావలసినదిగా భావించబడే కార్యాన్ని కాకుండాచేసి, ఊహించని కార్యాన్ని, సంకల్పించని పరిణామాన్ని జరిగేటట్లుగా చేయడమే దైవకార్యంగా భావించి మనిషి సమాధానపడాలి. అటువంటి వివేకం కలిగిన బుద్ధితో, క్రోధాది ఇంద్రియ భావములను అదుపులో పెట్టుకుని ఆలోచించినపుడు అకస్మాత్తుగా తప్పిపోయిననా పట్టాభిషేక కార్యం గురించిన శోకం నాలో జనించదు.తే. నాకు జూడ బ్రజాపాలనము కంటెనవ్విపినవాస మధికోదయంబు గానననఘ లక్ష్మీవిపర్యయమందు నీవుమది విషాదంబు విడువుము మమత దక్కి. పట్టాభిషేకం చేయించుకుని ప్రజాపాలనం గురించిన పనులలో పడడం కంటె, అడవికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడపడంలోనే నాకు ఎక్కువ ఆనందం లభిస్తుంది. కాబట్టి రాజ్యా ధికారం అనే లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోయిందనే శోకాన్ని విడిచిపెట్టు. ప్రశాంతంగా ఉండు – అని చెప్పి శ్రీరాముడు లక్ష్మణుడిని శాంతపరిచాడు.– భట్టు వెంకటరావు -
జ్ఞానం పంచితేనే పెరిగే సంపద
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహైతేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిఃతైత్తిరీయోపనిషత్తులోని శాంతి మంత్రం ఇది. పూర్వం విద్యాభ్యాసానికి ముందు ప్రతి దినం గురు శిష్యులు ముక్తకంఠంతో ఈ శ్లోకాన్ని పఠించేవారు. ‘మనం కలిసి మెలిసి ఉందాము. కలిసి మెలిసి ఫలితాలను అనుభవిద్దాము. కలిసి పనులను చేస్తూ తేజో పూర్ణుల మవుదాము. మనలో మనకు వైషమ్యాలు ఉండకుండు గాక. శాంతితో విలసిల్లుదాము’ అని చేసే ఉత్తమ ప్రార్థన ఇది.ఈ ప్రార్థన గురుశిష్యు లిరువురి మనస్సులో నిక్షిప్తమై ఉండేది. ఇరువురు కలిసి విజ్ఞాన కృషి సలపాలి. కలిసి విజ్ఞాన ఫలం పొందాలి. గురు శిష్యుల మధ్య విబేధాలు లేకుండా శాంతియుతంగా విజ్ఞానార్జన చేయాలి అనే సమభావన; గురువును శిష్యుడు, శిష్యుని గురువు పరస్పరం గౌరవించుకునే ఉన్నత భావన ప్రాచీన విద్యావిధానంలో కనిపిస్తుంది. అప్పుడు విద్య అంటే గురు శిష్యు లిద్దరు కలిసి చేసే నిత్య సత్య శోధనా యత్నం.విద్య నిరంతర ప్రవాహం. పరంపరా గతంగా విస్తరించేది. గురువు నుండి శిష్యుడు నేర్చుకున్న విద్య, సంస్కారం తర్వాత మళ్ళీ తన శిష్యులకు అందజేస్తాడు. ఆ శిష్యుల నుండి తరవాతి వారికి అలా అందుతూనే ఉంటుంది. ఇది నిరంతర జ్ఞానగంగా ప్రవాహం. ఇచ్చే కొద్దీ పెరిగే సంపద జ్ఞాన సంపద. ఆనాడు గురు శిష్య సంబంధాలు ఎంత ఆదర్శంగా ఉండేవో, జ్ఞానార్జన ఎలా సాగేదో ఈ శ్లోకం చెబుతోంది.– డా. చెంగల్వ రామలక్ష్మి -
మాధవుడి మందిరంలో మన్మథుడికి చోటుందా?
దేవతలు తాగే అమృతం కావాలంటే, మందర పర్వతాన్ని మోసుకొచ్చి, దాన్ని కవ్వంగా చేసి, క్షీర సాగరాన్ని చేతులు పడిపోయేలా చిలకాలి. అది మహామహులకే తప్ప, మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అలాగని దిగులు అక్కర్లేదు. భక్త కవీంద్రుడు లీలాశుకుడు తన కవితాశక్తి అనే కవ్వంతో, నుడి కడలిని మథించి వెలికి తీసిన ‘కృష్ణ కర్ణామృతం’ ఉంది.వీనుల విందు చేసే ఈ అమృతాన్ని, అభిరుచి ఉన్నవారెవరయినా, ఉచితంగా, తనివి తీరా ఆస్వాదించవచ్చు. లీలాశుకుడు ఈ కావ్యంలో తన ఇష్టదైవమైన బాలగోపాల కృష్ణుడిని ఎన్నెన్నో శబ్దాలంకారాలతో, అర్థాలంకారాలతో, చమత్కారాలతో అలంకరించి తరించాడు. ఆ కర్ణామృత కలశంలో ఒక్క చుక్క పట్టి చూసినా, అమృతం నాణ్యత అర్థమైపోతుంది.మన్మథుడు తుంట వింటివాడే కాదు. తుంటరివాడు కూడా. ఎంతో ప్రయత్నంతో, ఎన్నో సాధనలతో కష్టపడి, శుద్ధి చేసుకొన్న మహాభక్తుడి మనసులోకి ఎలాగో చొచ్చుకుపోతాడు. మదన వికారాల మాలిన్యంతో దాన్ని మళ్లీ మైల పడేస్తాడు. అలాంటి ఆగడాలు తన దగ్గర సాగవని లీలాశుకుడు మృదుమధురంగా, సొగసుగా, గడుసుగా మంద లిస్తూ..‘మార! మా రమ మదీయ మానసే,మాధవైక నిలయే యాదృచ్ఛయా!’అంటాడు. ‘‘మదనుడా! నా మనసులో దూరి అల్లరి చేయకు. ఇది మాధవుడు ఒక్కడి కోసం అచ్చంగా ఏర్పరచిన మందిరం. ఇక్కడ స్వేచ్ఛా విహారం చేస్తూ, ‘రమించ’కు. మా రమ!’ అని. అలా రమిస్తూ, ఆగం చేస్తే ఏమౌతుంది? కొంప మునుగుతుంది.ఎందుకంటే, 'శ్రీ రమాపతిః – ఇహ – ఆగమేత్ – అసౌ’ ఇల్లుగలాయన అయిన ‘రమాధవుడు ఇప్పుడో, ఇంకాసే పట్లోనో ఇక్కడికి వస్తాడు.’ ఆయన నీ గోల చూస్తే నీ వీపు విమానం మోత మోగిస్తాడో, తాట ఒలిచేస్తాడో!కః సహేత నిజ వేశ్మ లంఘనమ్? ‘తన ఇంట్లో పరులు స్వేచ్ఛగా జొరబడితే, ఎవరు సహిస్తారు?’ అందులో ఆయన సామాన్యుడా? సకల శక్తిశాలి. ఏమయినా చేయగలడు. ‘కనుక బతుకు మీద తీపి ఉంటే, నా నుంచి దూరంగా పారిపో!’’ అని పంచశరుడిని భక్తాగ్రణి హెచ్చరిస్తున్నాడు.– ఎం. మారుతి శాస్త్రి -
అలంకారం శరీరానికా? వ్యక్తిత్వానికా?
అలంకారాలు అంటే కళ్ళు జిగేలుమనిపించేలా కనిపించడం కాదండోయ్ ఇక్కడ.. అలాగే తళుక్కుమనే ఆభరణాలు బంగారం, వెండి గూర్చి కూడా కాదు... మనిషికి సహజంగా ఉండవలిసిన నిజమైన అలంకారం ఆభరణాలు గూర్చి శతకాల్లో చెప్పిన బంగారు మాటలు నెమరువేసుకుందాం.ఈ మాటలవిలువ ఏ మూటలతో లెక్క కట్టలేం...భర్తృహరి రాసిన సంస్కృత శతకానికి ఎంతో దగ్గరగా స్వేచ్ఛానువాదం చేసిన ఏనుగు లక్ష్మణకవి ఒక పద్యంలో...‘అమరుజెవి శాస్త్రమున గుండలముగాదువలయమున నొప్ప, దీవి చే వెలయుబాణియురుదయాడ్యుల మేను పరోపకారకలన రాణించు గంధంబు వలనకాదు’.కుండలాలు, బంగారు కడియాలు, గంధం – ఇవన్నీ అలంకారాలు కావుట. ధర్మశాస్త్ర శ్రవణమే చెవులకు అలంకారం. నిరంతరం దానం చేసిన చేసిన చేతులకు మిలమిల మెరిసే కడియాలు ఆభరణం కాదు. దయాగుణం కలవారికి సుగంధద్రవ్యాలు /గంధపు పూత అలంకారం కాదు.ఇంకా లోతులోకి వెళ్తే సత్పురుషులకు వారి గుణాలే అలంకారాలు. బాహ్యంగా తళుకులు, మెరుపులు అక్కర్లేదు..ఇదే కవి మరో పద్యంలో‘కరమున నిత్యదానం, ముఖంబన సూనత వాణి, ఔదలంగురుచరణాభివాదన, ముకుంఠిత వీర్యం దోర్యుగంబునన్వరహదయంబునన్ విశదవర్తన, మంచిత వీనులన్సురుచిరభూషణంబు లివి శూరులకు సిరి లేనియప్పుడున్’....ఐశ్వర్యం లేనప్పుడు మహాత్ములకు సహజ అలంకారాలు ఏమి ఉండాలో చెప్తూన్నాడు, ఏనుగు లక్ష్మణ కవి. అవి ఏమిటంటేదానం, సత్యాన్ని పలకడం, గురువు గారికి నమస్కరించే గుణం, ఎదురు లేని పరాక్రమం, మంచి ప్రవర్తన శాస్త్ర శ్రవణం... ఇవన్నీ... కంకణాలు, కిరీటం, కుండాలాలు బయట తాత్కాలిక సౌందర్యన్నే కలిగిస్తాయ్. స్థిరమైన శాశ్వతమైన అంతరమైన సౌందర్యం కలగాలంటే సద్గుణాలుండాలి.‘నిజమైన ఆభరణాలు, అలంకారాలు’ గురించి శతక కవులు బంగారాన్ని కాదు, గుణాలనే ఆభరణాలు అని అన్నారు.వేమన గారు బాహ్య అలంకారాలను ఖండించి, అంతరంగ శుద్ధినే అసలైన అలంకారం అన్నారు.పసిడి కుండలములు చెవులకుపసిడి హారములు మెడకు భాసిల్లును గానిమంచి మాటలు లేకున్నపశువుతో సమానమగును పార్థివా వేమాఅర్థం: చెవులకు బంగారు కమ్మలు, మెడకు హారాలు ఉన్నా, నోట మంచి మాటలు లేకుంటే పశువుతో సమానం.మరో పద్యం చూడండిఅంగడి సరుకుల వలెనాఅలంకారములెల్ల కొనగ అందుబాటగునాసంగతి తెలిసిన వానికేసద్గుణమే అలంకారము సర్వజ్ఞా వేమాఅర్థం: అంగడిలో దొరికేవి ఆభరణాలు కావు. సద్గుణాలే నిజమైన అలంకారం.బద్దెన కవి విద్య, వినయమే నిజమైన ఆభరణాలు అన్నారు.విద్య భూషణము పురుషునకువిద్యయె కీర్తిని తెచ్చు విశ్వమందునవిద్య లేని మనుజుండుపశువు కంటెను హీనమగును పార్థివా సుమతీఅర్థం: విద్యయే మనిషికి అసలైన ఆభరణం. విద్యే కీర్తిని తెస్తుంది. విద్య లేనివాడు పశువు కంటే హీనుడు.‘సత్యము భూషణము సతికిసత్యము భూషణము నరునకు సర్వజనులకున్సత్యము లేని నరుండుమత్యువుతో సమానమగును మేదిని సుమతీ‘అర్థం: స్త్రీకైనా, పురుషుడికైనా సత్యమే అసలైన ఆభరణం. భాస్కరుడు అదే బాణిలో వెళ్ళాడు భాస్కరుడు శీలము, దానమే ఆభరణాలు అన్నారు.‘దానము శీలము సత్యముమానము విద్యయును నీతి మర్యాదయునుమేనికి భూషణములు సుమ్మీమేలైన గుణములు గలిగెనేని భాస్కరా‘అర్థం: దానం, మంచి నడవడి, సత్యం, గౌరవం, విద్య, నీతి, మర్యాద – ఇవే శరీరానికి నిజమైన ఆభరణాలు.భర్తృహరి గారు కూడా గుణాలనే ఆభరణాలు అన్నారు.రత్నములు కావు భూషణరత్నములు సద్గుణములె సుమ్మీ రత్నములురత్నములు లేకపోయినరాజిల్లును సద్గుణముల రమణీయముగన్’దీనికి అర్థం అక్కర్లేదు.వినయము విద్యకు భూషణవినయము లేని విద్య విషముతో సమము సుమ్మీవినయ విద్యలు గల్గినవనరులెల్ల వచ్చు జగతిన.బాహ్య అందం కోసం సాధన చేసినా ఫలితాలు తాత్కాలికం.. కనుమరుగు అయిపోతాయి... బదులుగా నిజమైన అలంకారాలు, ఆభరణాలు గుణాలు రూపంలో ఉంటే అవి సద్వినియోగం చేస్తే ఫలితాలు శాశ్వతం, లోక ప్రయోజనం, విశ్వ కళ్యాణం అవుతుంది.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి నిర్వహణ: డి.వి.ఆర్. -
ప్రార్థనతో బలపడే విశ్వాసం!
‘దేవుని ఇశ్రాయేలు’గా చెప్పబడే క్రీస్తు ప్రభువు సంఘ సభ్యులు అపొస్తలుల బోధకు లోబడి క్రీస్తునందు క్రీస్తును బట్టి దేవునియందు ఆనందించుటలో సిద్ధహస్తులు. యేసు దేవుని కుమారుడు అంటే దేవుని పక్షాన ఏలుబడి చేసే ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్ధం. ఆ రారాజైన క్రీస్తును బట్టే ఆత్మసంబంధ ఇజ్రేలీయులుగా క్రైస్తవులు పిలువబడుతున్నారు. క్రీస్తు సంబంధులు, క్రైౖస్తవులు అనే పదాలకు ఆత్మ సంబంధ ఇజ్రేలీయులు అనేది ఒక గొప్ప పర్యాయపదం. ఆత్మ సంబంధ హృదయ పరిపాలకుడుగా ఉన్న క్రీస్తు ప్రేమను బట్టి ఎలా ఆనందించాలో ఎందుకు ఆనందించాలో చూద్దాం.ఇక సాహసించక తప్పదనేలా దేవుని సంకల్పం బహు బలంగా ఉంది. అంతరాయాలకు, అడ్డుకట్టలకు, అభ్యంతరాలకు ఎలాంటి తావులేదు. ఇజ్రేలీయులకు వాగ్దానం చేసిన మెస్సీయాను ఈ భూమి మీద ప్రవేశపెట్టే వేళలలో దుస్సాహసాలకు పాల్పడుతూ దేవుని సంకల్ప చిత్తానికి ఆయన సత్యానికి అడ్డొచ్చే ప్రతి ఒక్కరూ దేవుని శత్రువులుగా ముద్రవేయించుకొని దేవుని ఉగ్రతకు బలై చరిత్రలో కలిసిపోయారు. తన ప్రేమను క్రీస్తు ద్వారా వెల్లడి చేయుటకు దేవుడు ఎన్నో సాహసకార్యాలకు పూనుకొన్నాడు. అదేవిధంగా మానవాళి అనుభవానికొచ్చి అలరించుటకు క్రీస్తుప్రేమ కూడా అనేకనేక అడ్డు ఆటంకాలకు ఎదురొడ్డి నిలిచింది. ఇప్పుడైతే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపువారెవరును లేరు.- ''క్రీస్తు లేకుంటే దేవునికి సంకల్పమే లేదు. క్రీస్తు కేంద్రంగానే సర్వంలో సర్వమూ చేయబడింది అనుటకు తగిన మూలాధారం ఇదే. మొత్తం దేవుని సంకల్పంలో కేంద్రకం క్రీస్తుబలి. కారణం చూస్తే యేసును నలగగొట్టడం యెహోవా దేవునికి ఇష్టమైంది. క్రీస్తుబలి దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే తన స్వకీయ సంకల్ప ప్రకారంగా ఈ బలిని రూపొందించినది ఆ దేవదేవుడే. అంతకంటె ముఖ్య కారణం, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించడం. మానవాళికి తన సొంత కుమారుని అనుగ్రహించుట ద్వారా ఇలా తన కుమారుని బలియాగం ద్వారా తన ప్రేమను వైవిధ్యంగా చేతలలో ఈ లోకానికి చాటి చెప్పాడు.''క్రీస్తునందు ఆనందిస్తూ ఎర్ర సముద్రం, ఎరికో గోడలు, వంటి ఉపద్రవాలు, శ్రమలు, బాధలకు తలవంచక కేవలం క్రీస్తును బట్టి మాత్రమే ఎదురునిలిస్తే అవి ఏవైనా వినయ వినమ్రతలతో దారి ఇచ్చుకోక తప్పదు. యేసు తన తండ్రియైన దేవదేవుని సంకల్పప్రకారంగా మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం మరణించాల్సి వచ్చింది. ఆయన అత్యంత క్రూరంగా ఘోరంగా సిలువలో బలి అయ్యాడు. నీ చిత్తమే సిద్ధించును గాక అంటూ సాహసించి మరీ మరణానికి ఎదురుగా వెళ్ళాడు.ఇందువలననే యేసు తన తండ్రి సంకల్ప చిత్తానికి విధేయంగా తలవంచాడు. మానవాళిని ప్రేమించి ప్రేమతో సాహసించి తన నిండు యవ్వన్రపాయాన్ని బలిగా పెట్టాడు. ఇట్టి యేసు సాహసోపేత ప్రేమను బట్టి ఆనందించండి అనునదే పరిశుద్ధులైన అపొస్తలుల బోధగా సంఘాలలో ఉపదేశక్రమ సత్యారాధనలలో నిత్యమూ చెప్పబడుతూ ఉంటుంది. వారపు ప్రప్రథమదినమను ఆదివారంనాడు సంఘము ఇలా క్రీస్తు సాహసాలను ప్రకటిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. సాహసించి క్రీస్తు సాహసాలను క్రీస్తు సంఘం ప్రకటిస్తూ ఉంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే యెడతెగక ్రపార్థన చేయాలి. ్రపార్ధన చేయుట ద్వారానే క్రీస్తుద్వారా దేవునితో సత్సంబంధ సహవాస బాంధవ్యాలు బలపడి దృఢపడతాయి. అప్పుడే ప్రతి ఒక్కరూ సాహసోపేత దైవిక ప్రేమను బట్టి ఎంతగానో సంతోషించే వీలుంటుంది.– జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్ -
మహాత్ముల చేష్టలు..
బాలోన్మత్త పిశాచవత్ సిద్ధానాం రీతిః మహాత్ములయిన సిద్ధపురుషుల పద్ధతంతా విపరీ తంగా ఉంటుంది. పిల్ల చేష్టలు చేస్తారు. పిశాచం పట్టిన వాళ్ళలాగా వింతగా ప్రవర్తిస్తారు. పిచ్చివాళ్ళలాగా సంచరిస్తారు. వాళ్ళ చూపులు, పనులు వంటివన్నీ పైకి అలాగే కనిపిస్తాయి. అలాంటి మహనీయుల గొప్పతనాన్ని మహాత్ములే గుర్తిస్తారు. సామాన్యులకు తెలియదు.గౌతమ మహర్షి మహామహితాత్ముడు. గొప్ప సిద్ధుడు. శ్రీవిద్యోపసనా దురంధరుడు. ముద్రోపాసనను, శైవ సిద్ధాంతాన్ని మనకందించిన పుణ్యమూర్తి. పెద్ద పెద్ద పండితులు, చక్రవర్తులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. నిత్యం వేదపారా యణం, ఉపాసన, యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, సంద్గ్రంథ పారాయణాలు జరిగేవి.ఒక ఉన్మత్తుడు ఆశ్రమంలోనే ఉంటూ అందరికీ తపో, ధ్యాన భంగం చేస్తూ ఉండేవాడు. గౌతముడు మాత్రం ఆ పిచ్చివాణ్ణి దగ్గరకు పిలిచి ఆదరించేవాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిచ్చివాణ్ణి తిట్టేవారు. ఇలా ఉండగా ఒక రోజున పండితులు, రాజు గౌతముని సన్మానించటానికి, పూజా సామగ్రిని, కానుకలను తీసుకొనివస్తే ఆ పిచ్చివాడు ఆ సామగ్రినంతటినీ చిందరవందర చేసి అందరిచేత తన్నులు తిన్నాడు. అందుకు గౌతముడు చాలా బాధపడ్డాడు. పాపం పిచ్చివాడిలాగా తిరిగే అవధూత మరణించాడు. ఇది చూచి గౌతముడు కూడా ప్రాణం వదిలేశాడు. అది తెలిసి శుక్రాచార్యులు కూడా ప్రాణత్యాగం చేశారు.ఆ విషాదం చూచి భరించలేక దేవతలందరూ జగన్మాతను ప్రార్థించారు. శ్రీమాత వాళ్ళ ప్రార్థన విని గౌతముని బ్రతికించింది. గౌతముడు మంత్రజలం చల్లి అవధూతను బ్రతికించాడు. శుక్రాచార్యుని సైతం బ్రతికించాడు. అక్కడి వాళ్ళతో గౌతముడు ‘ఈయనను పిచ్చివాడనుకొంటున్నారు మీరు. ఇది భ్రమ తప్ప నిజం కాదు. ఈయనొక మహాయోగి. అవధూత! నా పూర్వజన్మలో నా గురుదేవుడు. ఈయన ఇంతవరకు మీ విషయంలో చేసిన వింతచేష్టలు మిమ్మల్ని అనుగ్రహించటానికే. కానీ ఈ యధార్థం మీకు తెలియదు’ అని చెప్పాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
స్వయం గురువుగా తయారు కావాలి..
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీగురవే నమః...గురు మంత్రంలో చివరి మంత్రం చెప్పేటప్పుడు‘గురుః సాక్షాత్ పరబ్రహ్మ’ అని అంటారు. అంటే పరబ్రహ్మయే. మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ఆ శక్తియే మీ ద్వారా ప్రవహిస్తుంది. కనుక అప్పుడు మీరు పరబ్రహ్మ సాధనంగా మారతారు. మీలో స్వయం గురుతత్వ స్థితిని పెంపొందించుకుంటారు.ఆదిగురువు అవతరమూర్తులందరూ పంచభూతాలపై ఆధిపత్యం కలిగివుంటారు. వారి ద్వారానే బ్రహ్మ వ్యక్తీకరింపడ్డాడు. ఈ ఆదిగురువు ముగ్గురి ద్వారా అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా వ్యక్తీకరింపబడ్డాడు. ఆయన నాలుగు తలలుగల బ్రహ్మలా జన్మించాడు. మనకు పైకి కనబడే ఈ ముగ్గురు కాకుండా నాల్గవ తల శ్రీ గణేశునిది. ఈ విధంగా దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గణేశ రూపంతో, శక్తులతో ఆది గురువయ్యాడు. గురువు కు వుండాల్సిన ఉత్తమ గుణాలు చాలా వున్నాయి. ఆ గుణాలన్నీ గురువులో వ్యక్తమవ్వాలి. ఈ గుణాలకు యజమాని శివుడు. శివ తత్వం అంటే గురుతత్వమే. అలా ఈ గుణాలన్నీ మీ ద్వారా ప్రస్పుటమవ్వాలి, ప్రకాశించాలి.అప్పుడు మీరు విరాటశక్తిలో ఒకరైపోతారు. ఇతరులకు ధర్మాన్ని బోధించగలుగుతారు. ఆత్మగా మారుతారు. ఆ విధంగా నిజమైన గురువుగా మారుతారు.ఒక గురువుగా మీరు మీ నిత్య జీవితంలో అనేక విషయాలకు అతీతంగా వుండగలగాలి. అదే మీరు చేరుకోవలసిన ఉన్నత స్థితి.‘‘యధా రాజా తధా ప్రజా’’ అన్నట్లుగా మీరు స్వయం గురువుగా తయారయిన్నప్పుడే ఇతరులకు గురువుగా మారి ఓ ప్రతీకగా, ఆదర్శ్ర΄ాయంగా నిలబడి నడిపించగలరు.. ఇక్కడ మన అర్థం చేసుకోవలసిన విషయమేమంటే – సమాజంలో మనం చూస్తున్న గురువులను, తమను తాము గురువులుగా చెప్పుకునే గురువులు మనకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలుగుతున్నారా అన్నది. తమలో గురు తత్వం లేని గురువు కూడా ఇతరులకు గురువు కావాలనుకుంటారు. తాను స్వయంగురువుగా వ్యక్తీకరింపబడిన వ్యక్తి ఇతరులకు గురువు కావాలని ఎన్నడూ అనుకోడు.మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మగా రూపొందండి. ఎప్పుడు మీరు ఆత్మగా రూపొందుతారో అప్పుడు మీకు మీరు గురువు కాగలగుతారు. అదే స్వయం గురుతత్వం.గురువు ప్రప్రధమంగా మనల్ని భగవంతుడినితో అనుసంధాన పరచడానికి ప్రయత్నిస్తాడు. అంటే దానర్థం ఆయన మీ కుండలినీ శక్తిని జాగృత పరిచి, సర్వవ్యాపిత శక్తితో మిమ్మల్ని అనుసంధానం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.గురువుకి మించిన తత్వం లేదుగురువును మించిన తపస్సు లేదుగురువుని మించిన జ్ఞానం లేదుఅటువంటి గురుదేవునికి నమస్కరిస్తున్నాను అని గురుగీత స్తోత్రంలోని ఒక శ్లోకంలో గురువుకి వున్న ఉన్నత స్థాయి గురించి చెప్పారు.– డాక్టర్ ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులు, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)శ్రీ మాతాజీ నిర్మలాదేవినిర్వహణ: డి.వి.ఆర్. -
దేవతలు కట్టిన కోవెల!
విష్ణుమూర్తి... సౌమ్యనాథస్వామిగా అవతరించి, చిరుమందహాసంతో, అభయహస్తంతో దర్శనమిస్తూ ..కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం నందలూరు సౌమ్యనాథాలయం. విశాలమైన ప్రాంగణంలో... నాలుగు రాజగోపురాల మధ్య ఉన్న ఈ ఆలయం పది ఎకరాల విస్తీర్ణంలో, పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి నిర్మించడం విశేషం.ఈ ఆలయంలోని 108 స్తంభాలపైనా భాగవతం చిత్రించి ఉండటం మరో విశేషం. 11 శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయాన్ని దేవతలే కట్టించారని పురాణాలు చెపుతున్నాయి. స్వయంగా నారదమహర్షి సౌమ్యనాథస్వామి మూలవిరాట్టును ప్రతిష్టించారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది.స్వామి పాదాలపై సూర్యకిరణాలు...గర్భగుడికీ ఆలయ ప్రధాన ద్వారానికీ మధ్య 120 గజాల దూరం ఉన్నా.. ద్వారం నుంచి మూలవిరాట్టు రూపం చాల స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో స్వామి పాదాలపైన సూర్యకిరణాలు పడటమూ ఇక్కడ చూడొచ్చు.స్వామిపై అన్నమయ్య కీర్తనలు...తాళ్లపాకకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని ఒకప్పుడు అన్నమాచార్యులు రోజు దర్శించుకునేవాడనీ, స్వామిపైన పదహారు కీర్తనలు కూడా రాశాడనీ అంటారు. ఇక్కడ స్వామికి ప్రతిరోజు నిర్వహించే పూజలు ఒకెత్తయితే, ఆషాఢమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముక్కోటి ఏకాదశి నాడు చేసే లక్షతులసీ అర్చన మరొకెత్తు. ఇవే కాకుండా శ్రావణ, ధనుర్మాసాల్లో నిర్వహించే ఉత్సవాలు చూసేందుకు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన భక్తులకు ఎక్కువగా చూస్తారు.వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవాలు...ఈనెల 21, మంగళవారం అంకుర్పారణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. బుధవారం ధ్వజారోహణం జరిగింది. 26న గరుడసేవ, 28న కళ్యాణోత్సవం, 29న రథోత్సవం, 30న చక్రస్నానం, 31న పుష్పయాగం నిర్వహించనున్నారు. స్వామివారు రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఐదవరోజున గరుడోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను స్వయంగా టీటీడీ దేవస్థానం వారే నిర్వహించడం సంప్రదాయం.– రామమోహన్ మోడపోతుల, సాక్షి, రాజంపేట, వైఎస్సార్ కడప జిల్లానిర్వహణ: డి.వి.ఆర్. -
క్రీస్తునందున్న యాత్రికులు, పరదేశులు
క్రీస్తు సిలువ మరణాన్ని బట్టి కొట్టివేయబడిన ధర్మశాస్త్రమను పాతనిబంధన దృష్టిలో నుండి చూస్తే, ఇశ్రాయేలు జనాంగం పూర్తి రక్షణ కొరకు మెస్సీయా రానేవచ్చాడు. క్రొత్తనిబంధన దృష్టికోణంలో నుండి చూస్తే పాపులను రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు అనగా యావత్తూ అన్య జనాంగాన్ని రక్షించుటకు క్రీస్తు ప్రత్యేకంగా రావడం జరిగింది.గురి కలిగిన క్రైస్తవుల గూర్చి ఎప్పుడూ ఘనంగానే చెప్పవచ్చు. ప్రభువైన క్రీస్తు ద్వారా అంది వచ్చిన క్రొత్త నిబంధన చట్టప్రకారం చూసినా, నేడు అమలులో ఉన్న అపొస్తలుల బోధను అనుసరించి చూసినా, ఈ భూమి మీద ఉన్న క్రైౖస్తవులు అనబడే క్రీస్తు సంబంధులు పరదేశులు, యాత్రికులుగా చెప్పబడుతున్నారు.‘నశించిన ఇశ్రాయేలు ఇంటివారైన గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను’ అన్న యాత్ర జీవితం మెస్సీయాది.గొఱ్ఱెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకే వచ్చానని నిశ్చయముగా చెప్పుకున్న ఆయన, ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తోడుకొని రావాలి అన్నది కూడా మొత్తానికి ఆయన స్పష్టం చేయడం అంతా విదితమే. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనను రోజు రోజూకు భక్షిస్తూ ఆయన్ను స్థిరంగా ఒక్కచోట నిలబడనివ్వని కారణం చేత ఉన్నతమైన ఉరుకులు పరుగుల జీవితం ఆయనది. తాను పుట్టినవేళ సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో పడుకొన్న శిశువైన యేసుగా పెరిగి పెద్దవాడై తనను తాను రిక్తుడిగా చేసుకొనినందున ఆయనకు ఇల్లు వాకిలి లేకున్నా రోజూ నిలువ నీడలేని సంకట పరిస్థితి. రాత్రివేళ ఎక్కడో ఒకచోట తలదాచుకొని పగలు ఉన్నంత వరకు అవిశ్రాంతంగా దేవుని పనిచేయడం ఒక్క క్రీస్తుకే చెల్లింది.దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను చాటుతూ ఆ రాజ్యం ఇప్పుడు మీ చేరువలోకే వచ్చిందంటూ యేసు సామాన్యుల చెంత సామాన్యుడుగా కలిసిపోతూ సత్యాన్ని వివరాణాత్మకంగా మనస్సుకు హత్తుకొనేలా బోధించాడు. ఇశ్రాయేలు దేశపు ప్రతి ఇంటి గడపను, ప్రతి బాధితుడను దాటిపోని క్షేత్రస్థాయి విస్తృత పర్యటనలు చేస్తూ యేసు తనదైన దైవిక ప్రేమను బట్టి మానవాళిని తన దివ్య వాక్కులతో బోధలతో అలరించడం విశేషం. ధనికులు, పండితులు వద్దకే కాకుండా అట్టడుగు వర్గాలను ఆకట్టుకొనేలా కూడా యేసు ప్రభువు నేరుగా వారి ఇళ్ళవద్దకు వెళ్ళి పరామర్శలు చేస్తూ వాగ్దాన సంబంధ దేవుడు సత్యవంతుడని స్థాపిస్తూ ఆయన ఎంతో నమ్మదగినవాడని ప్రచారం చేసాడు.దేవుని ఉనికి, స్పృహ లేకుండా పోతున్న రోజుల్లో సత్యవంతుడైన వానిని మనం ఎరుగవలెనని మనకు వివేకం అనుగ్రహించాడు కూడా. ఇట్టి విధానంలో ఈ క్రమంలో ఆయన యాత్రజీవితం విజయవంతం కాకుండా ఎలా ఉంటుంది? నేను పరదేశినైన పరసంబంధుడను, ఈ భూమిమీద యాత్రికుడను అన్నది యేసు ఉన్నత జీవితపాఠం గొప్పగా చాటుతుండడం విశేషమనే చెప్పాలి.– జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్. -
కోపాన్ని వదలండి..
రెండు పదాల ఈ చిన్న సలహా పాటించకపోతే జీవితం ఎన్నో మలుపులతో కలచి వేస్తుంది, సంతోషాన్ని కబళిస్తుంది.. తాత్కాలికం, క్షణికం అయినా కోపం శాశ్వతంగా బంధాల్ని తెంపివేస్తుంది..స్నేహన్ని చెడగొడుతుంది, చుట్టరికాలు చెడిపోతాయ్.. మనుషుల్ని దూరం చేస్తుంది. మమతల్ని చంపివేస్తుంది. ఆరోగ్యం మటు మాయం అయిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కోపం వలన వచ్చే కష్టనష్టాలు బేరీజు వేసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే కోపం గూర్చి ఎన్నో శతకాల్లో నిక్కచ్చిగా, స్పష్టంగా చెప్పారు... కోప్పడకుండా చదవండి.‘తన కోపమే తన శత్రువుతన శాంతియె తనకు రక్ష దయ చుట్టంబౌదన సంతోషమే స్వర్గముతన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’ఎన్నో సందర్భాలలో ఈ పద్యం వింటాం.. వేరే వివరణ అవసరం లేదు. కోపమే శత్రువు, శాంతమే రక్ష.. సంతోషం స్వర్గం బాధే నరకం... అన్నీ మనలోనే ఉన్నాయి ఈ పద్యంలోనే దయా గుణాన్ని అంటే ఇబ్బంది ఉంటే ఆదుకునే వాడే చుట్టం అని చె΄్తాడు. అందుకునే కాబోలు ‘అక్కరకు రాని చుట్టము... గ్రక్కున విడువంగ వలయు ‘ అని సలహా ఇస్తాడు బద్దెన కవి.వేమన కోపం గురించి అత్యధికంగా చెప్పాడుకోపము దుఃఖమునకు మూలము కోపము శత్రుభయంకరము కోపము కీర్తి నశింపజేయురా కోపము వదలిన సుఖియైతివిరా వేమా!అర్థం: కోపమే దుఃఖానికి మూలం. కోపం వల్ల శత్రువులు పెరుగుతారు. కీర్తి నాశనమవుతుంది. కోపం వదిలితేనే సుఖపడతావు.మరో పద్యం..కోపము వచ్చినప్పుడు కుయుక్తుల వచ్చురా కోపము వచ్చినప్పుడు కూటమి చెడురా కోపము వచ్చినప్పుడు కులమెల్ల చెడురా కోపము వదలరా వేమా!సుమతి శాంతంగా ఉండమని చెప్పాడుకోపము పాపమునకు మూలము కోపము దుఃఖమునకు మూలము కోపము అధోగతికి మూలము కోపము వదలి సుఖముండుము సుమతీ!అర్థం: కోపమే అన్ని పాపాలకు, దుఃఖాలకు, అధోగతికి కారణం. అందుకే కోపం వదిలి సుఖంగా ఉండు. భర్తృహరి సుభాషిత శతకం – ఏనుగు లక్ష్మణకవి చేసిన అనువాదంపద్యంక్షమయా భూషితః పురుషః క్రోధేన భూషితో నరః నీచోపచారైః నరకం వ్రజేత్ ఉత్తమో నరకాత్ పరమ్తెలుగు అనువాదంఓర్పుతో భూషితుడైన నరుడు ఉత్తముడు కోపముతో నుండు నరుడు నీచుడునీచుడు నరకమునకు పోవును ఉత్తముడు స్వర్గమునకు పోవునుకోపము కామము లోభము మదము మాత్సర్యము ఈ పంచ మహాపాములు దహించును వీనిని జయించినవాడే మానవుడు శ్రీరామ నీ దాసుడైతిని దాశరథీ!నీతి శతకంలో పద్యంకోపాత్ భవతి మూర్ఖత్వం మూర్ఖత్వాద్ వినశ్యతి వినాశాత్ నరకం యాతి తస్మాత్ కోపం వివర్జయేత్అంటే...కోపం వల్ల మూర్ఖత్వం వస్తుంది. మూర్ఖత్వం వల్ల నాశనం. నాశనం వల్ల నరకం. అందుకే కోపాన్ని వదలిపెట్టాలి. శతక రచయితలు భావ యుక్తంగా చెప్తే, త్యాగరాజుల వారు రాగయుక్తంగా ‘శాంతము లేక సౌఖ్యము లేద’న్నారు. చివరిగా చెప్పినంత సులువుగా కోపాన్ని వదులుకోగలమా..మాటకు మాట తూటాలాగా వదిలితే శాంతి ఎక్కడ.. శాంతం లేనిదే శాంతి.. సహనం, శాంతం ఉంటే కోపాన్ని దూరం చేసుకోవచ్చు... డాక్టర్లు కూడా ఆరోగ్యం బాగుండాలంటే కోపం వద్దు.. ఈ దిçశలో బయలు దేరితే మన ఆరోగ్యదశ బాగుంటుంది.. ఆ ప్రయత్నంలో అడుగులేద్దాం.– డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. -
వర్షాల కోసం ‘ఇస్తిస్ఖా’... నమాజు
వర్షాలు పడక పొలాలు ఎండిపోతే, చెరువులు తడారిపోతే రైతు గుండె గొంతుకలోకి వస్తుంది. వాన చుక్క కోసం ఊరంతా ఆకాశం వైపు దీనంగా చూస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మహమ్మద్ ప్రవక్త (స) కాలంలో ఏం చేసేవారో తెలుసా?ఊరి ప్రజలందరినీ ఒక చోటికి తీసుకెళ్లి వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయించేవారు. దాన్నే ‘నమాజ్–ఎ–ఇస్తిస్ఖా’ అంటారు. తప్పులు పెరిగితే తడారిపోయే నేల! మనిషి చేసే పనులకి, ప్రకృతి మారే తీరుకి దగ్గర సంబంధం ఉంటుంది. వ్యాపారంలో మోసాలు ఎక్కువైనప్పుడు, సమాజంలో పేదలకు ఇవ్వాల్సిన దానధర్మాలు (జకాత్) సరిగ్గా చేయనప్పుడు వర్షాలు ఆగిపోతాయని ప్రవక్త చె΄్పారు. కరువు రావడం అనేది కేవలం వాతావరణం మారడం వల్ల మాత్రమే కాదు, మనుషుల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని చెప్పే ఒక హెచ్చరిక.‘ఒకవేళ ఈ భూమి మీద మూగజీవాలు లేకపోతే, అస్సలు వర్షాలే పడవు’ అని ప్రవక్త చెప్పిన మాటలు మన అహంకారాన్ని ఆలోచనలో పడేస్తాయి. ఆడంబరం లేదు... కేవలం వినయం మాత్రమే! వర్షం కోసం వేడుకునేందుకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆడంబరాలు ఉండేవి కావు. చాలా సాధారణ బట్టలు వేసుకుని, భయభక్తులతో, వినయంగా ఊరి బయట ఉన్న ఈద్గాహ్ మైదానానికి వెళ్లేవారు. పండుగ నమాజ్ లాగే రెండు రకాతుల నమాజ్ చదివిన తర్వాత, ప్రవక్త చేతులను చాలా ఎత్తుకి ఎత్తి అల్లాహ్‌ను వేడుకునేవారు.సాధారణంగా దేవుడిని కోరుకునేటప్పుడు అరచేతులు ఆకాశం వైపు ఉంచుతారు. కానీ వర్షం కోసం అడిగేటప్పుడు అరచేతులు నేల వైపు, చేతుల వెనుక భాగం ఆకాశం వైపు ఉంచేవారు. అలాగే వేసుకున్న దుప్పటిని కూడా తిరగేసేవారు. మన కష్టాల కాలం మారి, మంచి రోజులు రావాలని కోరుకోవడానికి ఇది ఒక పద్ధతి. ‘ప్రభూ! నీ దాసులకు, మూగజీవాలకు నీళ్లు ప్రసాదించు... నీ కరుణను పంచు... ఎండిపోయిన ఈ భూమికి మళ్లీ ప్రాణం పోయ్!’ఇస్తిస్ఖా ప్రార్థన సారాంశం చిన్న చీమ... గొప్ప పాఠం! ఒకసారి ఒక ప్రవక్త వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తూ, మార్గమధ్యంలో ఒక చిన్న చీమను చూశారట. ఆ చీమ తన కాళ్లను ఆకాశం వైపు ఎత్తి వర్షం కోసం వేడుకుంటోంది. అది చూసిన ప్రవక్త తన అనుచరులతో... ‘మనం వెనక్కి వెళ్లిపోదాం, ఆ చిన్న చీమ చేసిన ప్రార్థనను ఆలకించి దేవుడు మనకు వర్షం కురిపిస్తున్నాడు’ అన్నారట.దేవుడి దయ కేవలం మనుషులకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవికీ సమానంగా లభిస్తుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వాన చినుకుల్లో పరవశం! ప్రార్థన ముగియగానే ఆకాశంలో దట్టమైన మేఘాలు పట్టి, ఉరుములు మెరుపులతో వర్షం పడేది. వాన పడటం ప్రారంభం కాగానే ప్రవక్త తన చొక్కాను కాస్త పక్కకి జరిపి, ఆ మొదటి వాన చుక్కలు తన ఒంటిమీద పడేలా నిలబడేవారు. ‘ఇది దేవుడి దగ్గర నుంచి ఇప్పుడే వస్తున్న కొత్త వర్షం’ అని సంతోషపడేవారు. నిజమైన పశ్చాత్తాపంతో, వినయంతో ప్రార్థిస్తే ఎండిపోయిన భూములైనా, మనుషుల మనస్సులైనా మళ్లీ చిగురిస్తాయనడానికి ఇస్తిస్ఖా ప్రార్థనే నిదర్శనం.– డా. అబ్దుర్రహీం బిన్ ముహమ్మద్ బిన్ మౌలానానిర్వహణ: డి.వి.ఆర్. -
తొలి పర్వం..
సంవత్సరంలో సాధారణంగా 24 ఏకాదశులు వస్తాయి (అధిక మాసం వస్తే 26). అయితే ఆషాఢ శుక్ల ఏకాదశికి ‘తొలి ఏకాదశి‘ అనే విశిష్ట నామం వచ్చింది. దక్షిణాయనం ప్రారంభం అయ్యాక వచ్చే మొదటి ఏకాదశి కనుక మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి అంటే ప్రారంభ ఏకాదశి అని చెప్పవచ్చు.ఈ ఏకాదశిని ఇంకా... దేవశయన ఏకాదశి, హరిశయనీ ఏకాదశి, పద్మ ఏకాదశి, ఆషాఢ శుక్ల ఏకాదశి .. అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) నాడు మేల్కొంటారని ఆగమాలు, పురాణాలు వివరిస్తాయి.ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి నాడు విధిగా పారణ చేసినవాడు సర్వపాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతాడని పద్మ పురాణం తెలియజేస్తుంది. గాయత్రీ మంత్రం కంటే గొప్ప మంత్రం లేదు. తల్లి కంటే గొప్ప దైవం లేదు. కాశీ కంటే గొప్ప తీర్థం లేదు. ఏకాదశి వ్రతం కంటే గొప్ప వ్రతం లేదు అని స్కందపురాణం చెబుతోంది. భవిష్య పురాణం ప్రకారం చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది.ఈ నాలుగు నెలలు జపం, ధ్యానం, దానం, విష్ణు ఆరాధన, పురాణ పారాయణం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంది.తొలి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం అత్యంత శ్రేయస్కరమని సంప్రదాయం.భీష్ముడు యుధిష్ఠిరునికి ఏకాదశి మహిమను వివరిస్తూ, ఉపవాసం, దానం, విష్ణుభక్తి ప్రాముఖ్యతను బోధించాడు. అతని ఉపదేశాలే తరువాత అనేక ధర్మగ్రంథాలకు ఆధారమయ్యాయి. గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభువు ప్రతి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ రామానుజులు ఏకాదశి ఆచరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మధుమేహం, గర్భధారణ, దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు.. ‘ఓం నమో నారాయణాయ’భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి అనగా తొలి ఏకాదశిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని, ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.తొలి ఏకాదశి రోజున చేయవలసినవి- బ్రహ్మముహూర్తంలో లేవాలి.- స్నానం చేసి విష్ణుపూజ చేయాలి.- ఓం నమో నారాయణాయ అనే నామ మంత్రాన్ని జపించాలి.- విష్ణు సహస్రనామం చదవాలి.- భగవద్గీత పారాయణం చేయాలి.- తులసి దళాలతో శ్రీమహావిష్ణువును అర్చించాలి.- ద్వాదశి రోజున అన్నదానం చేయాలి. విధిగా పారణ చేయాలి.చేయకూడనివి- కోపం, అసత్యం, పరనింద, మద్యపానం, మాంసాహారం, వ్యర్థ వాదనలు, అధిక నిద్రను త్యజించాలని శాస్త్రాలు చెబుతాయి.తొలి ఏకాదశి చెప్పే సందేశంతొలి ఏకాదశి మనకు కేవలం ఆహారాన్ని తగ్గించడం మాత్రమే కాదు, అహంకారం, కోపం, లోభం, అసూయ వంటి అంతరంగ దోషాలను తగ్గించుకోవాలని బోధిస్తుంది. భగవంతునికి దగ్గర కావడానికి ముందు మన మనస్సును పవిత్రం చేసుకోవాలనే సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తుంది. తొలి ఏకాదశి అనేది ఒక పండుగ మాత్రమే కాదు; అది భక్తి, నియమం, ఆత్మపరిశీలన, ధర్మాచరణ, ప్రకృతితో సమన్వయ జీవన విధానానికి శ్రీకారం చుట్టే మహోన్నత దినం. పద్మ పురాణం, స్కంద పురాణం, భవిష్య పురాణం వంటి శాస్త్రాలు దీనిని అత్యున్నత వ్రతాలలో ఒకటిగా కొనియాడాయి.– మద్దికుంట శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రంనిర్వహణ: డి.వి.ఆర్. -
హైదరాబాదు గోల్కొండ: మహంకాళి తల్లికి ప్రణమిల్లి
-
వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న శాపగ్రస్త నగరం..!
ఊహించుకోండి.. చుట్టూ అంతులేని సముద్రం. ఒకవైపు బంగాళాఖాతం, ఇంకోవైపు హిందూ మహాసముద్రం. ఆ రెండు సముద్రాలు కలిసే చోట ఒక సన్నటి ఇసుక తిన్నె. పగటిపూట చూస్తే అద్భుతమైన పర్యాటక ప్రాంతం. కానీ.. సూర్యుడు అస్తమించాక, చీకటి పడ్డాక... అక్కడికి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి ఉండదు. అక్కడి గాలిలో ఒక రకమైన భయం, నిశ్శబ్దం అలుముకుంటాయి. పాడుబడిన రైల్వే స్టేషన్, కూలిపోయిన చర్చి గోడలు, ఇసుకలో పూడుకుపోయిన ఇళ్లు..అవును, మనం చెప్పుకుంటోంది భారతదేశం చివరి సరిహద్దు, తమిళనాడులోని జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన రామేశ్వరం సమీపంలోని 'ధనుష్కోటి' గురించి. ఇవాళ ప్రపంచం దీన్నే ఒక Ghost Town అని పిలుస్తోంది. కానీ, ఈ నిర్జన ప్రదేశం వెనుక కేవలం ఒక తుఫాను కథ మాత్రమే లేదు.. యుగాల నాటి రామాయణ రహస్యం దాగి ఉంది. అసలు ఈ నగరంలో రాత్రి వేళల్లో ఏం జరుగుతోంది? సైన్స్ కూడా తలవంచిన ఆ అయస్కాంత క్షేత్రాల మిస్టరీ ఏంటి? తుఫాను వల్ల నగరం నాశనమైంది.. మరి దీన్ని 'మిస్టరీ' అని ఎందుకు అంటున్నాం? పగటిపూట ఈ రామసేతు అందాలను చూడటానికి పర్యాటకులు వస్తారు. కానీ సాయంత్రం 6 గంటలు దాటితే చాలు.. ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. టూరిస్టులను, స్థానిక జాలర్లను కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించేస్తారు. ఎందుకు? ఈ మిస్టరీని అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి... -
ఆలయంలో దాగిన మహానిధి.. తాకితే సర్వనాశనమేనా?
నిధి.. అనంతమైన సంపద.. కొన్ని శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న రహస్యం! భారతదేశంలో నిధులు అనగానే మనకు కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడ నాగబంధం ఉన్న ఓ గది తలుపులను ఇప్పటికీ తెరవలేదు. అయితే.. అంతకంటే మర్మంగా ఉన్న ఓ ఆలయం మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఉందనే విషయం మీకు తెలుసా? కర్ణాటకలో.. దట్టమైన పశ్చిమ కనుమల నడుమ.. ఉడుపి జిల్లా కొల్లూరులో కొలువుదీరిన మూకాంబిక అమ్మవారి ఆలయ గర్భంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిధులు ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు. అయితే.. టెక్నాలజీతో ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకున్న ఈ రోజుల్లో కూడా.. సైన్స్ సమాధానం చెప్పలేకపోతున్న ఓ మిస్టరీ ఆ ఆలయం..! మూకాంబికా ఆలయంలో నిధుల గురించి చూద్దాం..ఎన్ని శతాబ్దాలు గడిచినా.. ఎంతగా అధునాతన టెక్నాలజీ వచ్చినా.. కొల్లూరు మూకాంబిక ఆలయ సర్ప ముద్ర వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ వీడలేదు. ఆ పాము ఆకారం కింద నిజంగానే వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిధి ఉందా? దాన్ని ఇప్పటికీ ఆ దైవిక సర్పం కాపాడుతోందా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.. -
ఈ 4 అలవాట్లుంటే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే..!
హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న గ్రంథాల్లో ఒకటైన గరుడ పురాణం అనగానే.. మనకు సాధారణంగా గుర్తొచ్చేది మరణం, ఆ తర్వాత ఆత్మ ప్రయాణం, యమలోకంలో శిక్షలు మాత్రమే. కానీ, ఇది కేవలం జీవన్మరణ రహస్యాలకే పరిమితమైన గ్రంథం కాదు! మనిషి బతికుండగా భూమిపై ఎలా జీవించాలి? ఎలాంటి ప్రవర్తనను అలవర్చుకోవాలి? ఏ విధమైన క్రమశిక్షణతో మెలగాలి? అనే ఎన్నో జీవన సూత్రాలను గరుడ పురాణంలోని 'ఆచార కాండం' అద్భుతంగా వివరిస్తుంది. ఆ వివరాలను తెలుసుకుందాం..నాలుగు తప్పుడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో కూడిన, పరిశుభ్రమైన, సానుకూల జీవనశైలిని ఎవరైతే అనుసరిస్తారో.. వారి జీవితంలో సుఖశాంతులు, శ్రేయస్సు వైపు మార్గం సుగమం అవుతుంది. అయితే ఇది పూర్తిగా విశ్వాసాలు, మన పురాతన సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడిన సమాచారం అని ప్రేక్షకులు గమనించాలి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.. -
సజ్జన సాంగత్య ఫలం... బలం
ఆదిశేషుడు సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై మోస్తున్నాడు. ఒకరోజు బ్రహ్మ దేవునికి దీటుగా సృష్టికి ప్రతి సృష్టి గావించిన రాజర్షి విశ్వామిత్రుడు వచ్చి ఆదిశేషుడిని తనతో రమ్మన్నాడు. ఆదిశేషుడు మిక్కిలి వినయ విధేయతలతో ‘‘ఓ మహర్షీ! ఈ సమస్త భూమండలం నా శిరస్సుపైనే వుంది. దీనిని పరిరక్షించడమే నా కర్తవ్యం. నేను ఈ కార్యాన్ని విస్మరిస్తే, ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవడం తథ్యం. అప్పుడు కోటానుకోట్ల జీవరాశులు నా మూలంగా నాశనమైపోతాయి’’ అన్నాడు. ఆ మాటలకు విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి ‘‘అటువంటిదే గనక జరిగితేనేను నా అమోఘమైన తపశ్శక్తితో దానిని ఆపుతాను’’ అన్నాడు.ఆదిశేషుడు అందుకు ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా నచ్చ జెప్పి చూసినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలనని మొండిపట్టు పట్టాడు. ఆదిశేషుని మంకుపట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది. కమండలం ఎత్తి శపించబోయాడు. ఆదిశేషుడు భయపడి చేసేదిలేక భూమిని పక్కకు పెట్టి వచ్చాడు.అంతలోనే ఘోరమైన విపత్తు సంభవించింది. ఆదిశేషుని వేయిపడగలపై భద్రంగా వున్న భూగోళం వెంటనే తాళం వైపు పడిపోవడం ప్రారంభించింది. దానిపై నివాసముంటున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాయి.జరిగిన దానిని చూసి తీవ్రమైన దుఃఖంతో ఆదిశేషుడు మ్రాన్పడిపోగా, తపశ్శక్తి సంపన్నుడనన్న గర్వంతో విశ్వామిత్రుడు తన కమండలంలోని నీరు ధారపోసి ‘ఆగు’ అంటూ భూమిని ఆజ్ఞాపించాడు. భూగోళ పతనం ఆగకపోగా, మరింత వేగంగా పడిపోవడం ప్రారంభించింది. విశ్వామిత్ర మహర్షి పట్టరాని ఆగ్రహంతో ‘‘నా తపశ్శక్తి అంతా ధారపోస్తున్నాను, వెంటనే ఆగు’’ అంటూ ఆజ్ఞాపించాడు. అయినా ఫలితం లేకపోయింది.దాంతో విశ్వామిత్రునికి అహంకార మైకం తొలగిపోయింది. భూమిని ఆపడానికి తన తపశ్శక్తి చాలదని తెలుసుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగిన దానిని తెలుసుకొని ‘‘నీవు ఎప్పుడైనా సజ్జన సాంగత్యం చేసి ఉంటే ఆ ఫలితాన్ని వెంటనే ధారపోయి. భూపతనం ఆగి΄ోతుంది’’ అని చెప్పాడు. విశ్వామిత్రుడు ఆలోచనలో పడ్డాడు. తాను అందరితో తగవులు పెట్టుకోవడమేకాని సజ్జన సాంగత్యం చేసింది లేదు. సాటి ముని పుంగవులతోనూ తగవులే. సత్సంగం చేసింది లేదు. అయినా తాను వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పుణ్యాన్ని ధార΄ోయగా వెంటనే భూగోళ పతనం ఆగిపోయింది. ఆదిశేషుడు యధావిధిగా తిరిగి భూమండలాన్ని తలకు ఎత్తుకున్నాడు.ఇందులోని నీతి ఏమిటంటే... మానవులలో దానవ మానవ గుణాలు రెండూ నిక్షిప్తమై వుంటాయి. సమయం సందర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమౌతూ వుంటుంది. దుర్జనులతో సాంగత్యం చేస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులను చేస్తాం. అదే సజ్జన సాంగత్యం చేసినట్లయితే మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది. అందుకే సజ్జన సాంగత్యం ఎంతో బలం..ఫలం.– భాస్కర్ -
చిత్తం, చింత, చింతన
చిత్త వ్యాపారాలే చింత, చింతన. మనస్సు చేత ప్రేరేపితమైన ఇంద్రియ వ్యాపారాలను భద్రపరచేది చిత్తం. విషయాలను, అనుభవాలను, భావోద్వేగాలు మొదలైనవాటిని జ్ఞాపకాల రూపంలో భద్రపరచి దాచి ఉంచేది చిత్తం. దానిలో ప్రతి మనోవ్యాపారం ముద్రితమై ఉంటుంది. ఒకోసారి మర్చిపోయాం అనుకొన్నవి కూడా సందర్భానుసారం బయట పడుతూ ఉంటాయి. అందుకే ఏదైనా మరచిపోతే కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. అప్పుడు జ్ఞాపకాల గది తలుపు తెరుచుకుంటుంది. చింతన అంటే నిరంతరం ఒక విషయాన్ని గురించి తలచుకుంటూ, మననం చేయటం. ఇది కూడా చిత్తం చేసే పనే అయినా చింతకి చింతనకి మధ్య ఎంతో తేడా ఉంది. నక్కకి నాకలోకానికి ఉన్నంత. లౌకిక స్థాయిలోచింతన మనిషి మేథకి మెఱుగులు పెడుతుంది. ఆలోచనలకి పదును పెడుతుంది. ఒక విషయాన్ని గురించి కూలంకషంగా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుంది. ఇది వ్యక్తిగతంగా తన సమస్యలని పరిష్కరించుకోవటానికి ఎంతో అవసరం. చింత అంటే జరిగి పోయిన లేదా జరగబోయే విషయాలను తలుచుకుంటూ బాధపడుతూ వేదన చెందుతూ ఉండటం. పైకి వ్యక్తం చేయక పోయినా మనసు లోపల నిరంతరం అదే విషయం మెదులుతూ సంతోషమన్నది లేకుండా చేస్తుంది. కొంతమంది ముఖాలు చూస్తూనే చెప్పవచ్చు వాళ్ళు ఏదో విషయంలో చాలా బాధ పడుతున్నారు అని. సాధారణంగా ఆ విషయానికి పరిష్కారం వాళ్ళకి తెలియక పోవటమో, తెలిసినా చేయగలిగే పరిస్థితిలో లేక΄పోవటమో దానికి కారణం అయి ఉంటుంది. ఆ అనిశ్చితి, అసమర్థత నిరంతరం మనసులో తిరుగుతూ వేదనని కలిగించి కుంగదీస్తాయి. పరిష్కారం దొరికితే కొంత ఉపశమనం కలుగుతుంది. దానిని అమలు చేయగల శక్తి ఉంటే ధైర్యం కలుగుతుంది. వేదన కొంత ఉపశమిస్తుంది. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమంటే ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించ గల శక్తి మనిషి మనస్సుకి ఉంది అని. దానిని ఉపయోగపడని వాటికి వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. అప్పుడు అది చింతన అవుతుంది. చింతన మనిషిని తాత్త్వికుడిగా పరిణమింప చేస్తుంది. వ్యక్తిగతమైన సమస్యలు, వాటి పరిష్కారాలు అనే స్థాయి దాటి ఏదైనా ఒక అంశం గాని, సిద్ధాంతం గాని, మరేదైనా గాని – దానిని గురించి లోతుగా, అన్ని కోణాలలోనూ, పరిశీలించి, అధ్యయనం చేసి, మూల తత్త్వాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తుంది. ఆధ్యాత్మికత, మతం, రాజనీతి, సాంఘిక సామాజిక పరిస్థితులు, కమ్యూనిజం వంటి ఆధునిక సిద్ధాంతాలు – ఒకటేమిటి ఏవైనా కావచ్చు, వాటి మౌలికతత్త్వం తెలుసుకోవటానికి వాటి గురించిన చింతన ఒకటే మార్గం. ఆ విషయానికి సంబంధించిన అంశాలనే నిరంతరం తలుచుకుంటూ, మననం చేస్తూ ఉంటే, పైకి కనపడే అంశానికి మూలమైన సూత్రం, అసలు లక్షణం, సరిగా చెప్పాలంటే బీజం స్ఫురిస్తుంది. దానితో విరాడ్రూపం మనోనేత్రం ముందు కదలాడుతుంది. లోతుపాతులు, మంచిచెడులు, విస్తరణ, పరిమితులు మొదలైన వన్ని చాలావరకు అర్థం అవుతాయి. ఇతరులు గుర్తించ లేని రహస్యాలు స్ఫురిస్తాయి. శాస్త్రవేత్తలని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎంతోమంది శాస్త్రవేత్తలు తాము చేసే పరిశోధనల గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు నిత్యకృత్యాలు నిర్వహిస్తూ కూడా. కొన్నిమార్లు వారికి నిద్రలో కలల రూపంలోనో, పరిసరాల్లో జరుగుతున్న సంఘటనల రూపంలోనో, ఆహారం తీసుకుంటున్నప్పుడో హఠాత్తుగా చేయవలసినది కానీ, పరిష్కారం గాని స్ఫురిస్తుంది. ఆర్కిమిడీస్ దానికి పెద్ద ఉదాహరణ. అతడికి తొట్టెలో స్నానం చేస్తుండగా నీళ్ళలో మునిగినప్పుడు పదార్థం బరువు తగ్గటానికి కారణం స్ఫురించింది. దానికి అతడు దాని గురించి చింతన చేస్తూ ఉండటమే కారణం. మనిషి దేనిని చింతన చేస్తే దానిగా మారిపోతాడు అన్నది ఆధునిక మనస్తత్వశాస్త్ర పరిశోధకులు నిర్ధారించి చెప్పిన మాట. సాధకుడు ఏమి పొందాలని అనుకుంటున్నాడో దానిని సిద్ధింపచేసేది చింతన అని ఆధ్యాత్మికవేత్తలు చెప్పేమాట. – డా. ఎన్. అనంతలక్ష్మి -
భక్తి అంటే..?
భక్తి అంటే ఏమిటి? వేదాంత గ్రంథాలిచ్చే నిర్వచనాల జోలికి వెళ్లవద్దు మనం. మామూలు మాటల్లో అర్థం కావటానికి భక్తి అంటే ఏమిటి? చాలామంది అభిప్రాయంలో ఫోటో పెట్టి, దండలు వేసి, పూలు, అగరొత్తులు, దీపాలు పెట్టి నివేదన చెయ్యటం, దణ్ణం పెట్టటం అనుకుంటారు. అది భక్తా? ఒకరకంగా తను మారకుండా ఉండటాన్ని సమర్థించుకునే ప్రయత్నం. ‘‘ఆయన మహానుభావుడు కనుక అట్లా చేయగలిగాడు. మనవంటి సామాన్యులకి సాధ్యమా?’’ అని తప్పించుకునే మార్గం. అట్లా పూజ చెయ్యటం తప్పు అని కాని, చెయ్య కూడదని కాని చెప్పటం లేదు. అది ఒకరకం. దానివల్ల ఒరిగేది ప్రత్యేకంగా ఏమీ లేదు. అది ఒక క్రమశిక్షణ. చిత్త శుద్ధిని కలిగిస్తుంది. ఇది మొదటిమెట్టు అని చెప్పవచ్చు. కానీ చాలా మంది ఇదే పరమార్థం అనుకుంటారు. కొంతమంది అనుకరించటమే భక్తి అనే భ్రమలో ఉంటారు. అనుకరించటానికి, అనుసరించటానికి చాలా వ్యత్యాసం ఉంది. వారిలాగా ఉండే ప్రయత్నం అనుకరణ. ఇది భౌతికంగా తమ ఆదర్శమూర్తుల లాగా ఉండేట్టు చేస్తుంది. చూడగానే ఫలానా వారి అభిమానులని తెలియ చేస్తుంది. కాని వారిస్థాయికి చేర్చదు. అయితే అనుకరణ పనికి రానిదని చెప్పటానికి వీలు లేదు. అది రెండవ మెట్టు. ఒకరిపట్ల భక్తి ఉన్నది అంటే వారు చెప్పిన దానిని చెప్పినట్టు అనుసరించటమే. భక్తిలో ప్రశ్నలకు, సందేహాలకు, వాదోపవాదాలకు తావుండదు. నోటితోనే చెప్పనక్కరలేదు. వారి ప్రవర్తనను చూసి అనుసరించవలసి ఉంటుంది. ‘‘మీ బొమ్మకి పూజ చేస్తాం, కాని, మీరు చెప్పినట్టు చెయ్యటం మావల్ల కాదు, మీరు ఉన్నట్టు ఉండటం అసాధ్యం’’ అంటే అది భక్తి అనిపించుకోదు. భగవంతుడివిషయంలోనైనా అంతే! దేవుణ్ణి గదికే పరిమితం చేసి, పూజచేసిన కొద్దిసేపు మాత్రం ఆయన్ని తలచుకొని, తరువాత దుర్మార్గంగా లోకకంటకంగా ప్రవర్తిస్తే అది భక్తి అనిపించుకోదు. పరమాత్మ నిర్దేశించిన విధంగా, ఆయన మెప్పు వడసే పద్ధతిలో ప్రవర్తిస్తే అది నిజమైన భక్తి. సాటిమనిషి మీద సానుభూతి, జాలి చూపించలేని వాడు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించ లేని వాడు, తనకి హాని చేసిన శత్రువుని కాక పోయినా కనీసం ఎదుటివాడిని క్షమించలేనివాడు విశ్వాసి ఎలా అవుతాడు? పొరుగువారిని తనవలే ప్రేమించమని చెప్పిన ఏసు క్రీస్తు అంటే భక్తి ఉంటే ఆయన చెప్పిన మాటలని పాటించాలి, ఆయనలాగా ప్రవర్తించాలి. ఆయన మార్గాన్ని అనుసరించాలి. ఎక్కువసేపు వాళ్ళతో ఉండటం వల్లనో, పోలికలు రావటం వల్లనో మనవలు, మనవరాళ్ళు తరచుగా తాతానాయనమ్మల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాతలకి నాయనమ్మలకి, అమ్మమ్మలకి మనవలు, మనవరాళ్ళు అంటే ఇష్టం ఉండటానికి కూడా ఇదే కారణం. మనుషుల విషయంలోనే ఇలా ఉంటే భగవంతుడి విషయంలో ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తే ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భగవంతుడికి, భక్తుడికి ఉండే సంబంధాన్ని భ్రమరకీట న్యాయంగా చెప్పటం ఈ కాణంగానే. తన చుట్టూ తిరుగుతున్న భ్రమరం చేసే ఝుమ్మనే నాదం విని గూటిలో సుప్తావస్థలో ఉన్న కీటకం దానిని అనుసరిస్తూ తాను కూడాఅటువంటి నాదం చేసే ప్రయత్నంలో భ్రమరం లాగా రూపాంతరం చెందుతుంది. ఈ అనుసరణ అన్నది తానే లక్ష్య వస్తువు అయ్యేట్టు చెయ్యగలదు. ఒక గురువునో, నాయకుణ్ణో అనుకరించేవారు వారి వలె తయారౌతారే కాని, వారుగా అయిపోరు. వారుగా, కనీసం వారంతటి వారుగా అయిపోవటానికి కావలసినది అనుసరణ మాత్రమే. భగవత్తత్త్వాన్ని అందుకోవాలంటే కూడా అంతే! శ్రీరాముడు పితృభక్తి కలవాడు అని చెపుతాం. అంటే అర్థం తండ్రి చెప్పిన విధంగా జీవించాడు అని. ఆయన మాట జవదాట లేదు. ఆయన తనతోచెప్పిన మాటనే కాదు ఆయన ఎవరికిచ్చిన మాటనైనా పాటించాడు. రాముడిపితృభక్తి, గురుభక్తి విశ్వామిత్రుడు తాటకను సంహరించమన్నప్పుడు మారు మాటాడక సంహరించటంలో వ్యక్తమౌతాయి. తల్లితండ్రులని వృద్ధాశ్రమాలలో ఉంచి ‘‘మేము రామభక్తులం’’ అంటే రాముడిపట్ల అపచారం చేసినట్టే. ఆయనలో ఉన్న కొన్నిగుణాలనైనా అలవరచుకుంటే రామభక్తులు అనిపించుకోగలుగుతారు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు
భక్తి ఎప్పుడూ ఆధిపత్య ధోరణిని, అహంభావాన్ని ప్రదర్శించదు. నేను గొప్ప, నాకిది వచ్చు. నాకన్నా వాళ్లెంత...అన్న వైఖరిని చూపదు. విద్య...విత్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అది వినయం. ‘‘విద్యాదదాతి వినయం వినయాద్యాతిపాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మంతత సుఖం’’ వైరాగ్య సుఖం, మోక్ష సుఖం వరకు అంతే. అందుకే త్యాగరాజ స్వామి వారిని... మీరంతవారు, మీరింత వారని అంటూంటే... ఆయన పొంగిపోలేదు. పైగా ఆయనేమన్నారు.. అంటే... ఎందరో మహానుభావులు ...అందరికీ వందనములు... అన్నారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు, రమించినవారు, పాడినవారు, అర్చించినవారు, అనుభవించినవారు ఎంతో మంది ఉండగా వారి ముందు నేనెంత, వారికి నేనేం చేయగలను, నమస్కారం చేస్తా...’’ అని వారందరినీ ఆదరపూర్వకంగా స్మరించుకున్నారు. వినయం అంటే అదీ. ఆదిశంకరులు అంతటి వారు ‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయాపాలయవిభో’’...‘శివా! నేను పశువును. నీవు పశుపతివి. ఇదే మనిద్దరి మధ్య బంధం’ అన్నారు. అది వినయం. అది విద్యకు పరమార్థం.అది దేనిచేత ప్రకాశిస్తుంది... అంటే ఉపాసనా దేవత అనుగ్రహానికి పాత్రమయితే అప్పుడు వినయం వస్తుంది. ఆ వినయం మనకు వాగ్గేయకారులందరిలో కనబడుతుంది. అందుకే వారు ఏది చెప్పినా ఏది చేసినా మనకు సందేశం ఇస్తున్నట్లో, సలహా ఇస్తున్నట్లో ఉండదు. వారికి వారు చెప్పుకున్నట్లు ఉంటుంది. భిన్న కథనాలు ఉన్నప్పటికీ, త్యాగరాజ స్వామివారు ఒకసారి వేంకటాచలం వెళ్ళారు, స్వామి వారి దర్శనం కోసం కూచున్నారు. తెర అడ్డంగా ఉంది. దిగంతాలకు వ్యాపించిన కీర్తిమంతుడిని, సాక్షాత్ ఉపనిషద్బ్రహ్మేంద్రులంతటి వారు నన్నుపిలిచి కీర్తనలు పాడించుకుంటారే, నేనొస్తే తెర వేస్తారా... అని ఆయన కోపగించుకోలేదు. ఈ తెర కాసేపయితే తీస్తారు.. ఇవ్వాళ కాకపోతే రేపయినా తీస్తారు. కానీ లోపల ఇంకొక తెర ఉంది... అనే అర్థంలో ఆయన అన్న మాటేమిటంటే...‘‘తెర తీయగ రాదా, నాలోని తిరుపతి వేంకటరమణా! మదమత్సరమను తెరదీయగరాదా, పరమ పురుషా!’’ అని పిలిచారు. నిజానికి భగవంతుడు ఎక్కడ దర్శనం కావాలి? మన లోపల.. ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా... లోపల అక్కడ కనబడాలి. పరమ యోగీంద్రులకు భావగోచరమైన పాదాబ్జములు నాకు దర్శనమయితే నేను యోగిని. .. అన్నారు తెర వేసినందుకుగానీ, తెర తొలగించనందుకు గానీ ఆయన ఎవరినీ నింద చేయలేదు. నా అంతటివాడొస్తే.. అని అహంకరించలేదు. ఎప్పుడు తీస్తారని అడగలేదు. ఇక్కడ ఉన్న తెర ఎవరయినా, ఎప్పుడయినా తీస్తారు. ‘లోపల నాకు అడ్డొస్తోన్న తెరవల్ల నీవు నాకు ఎప్పటికీ కనబడడం లేదు. అది నీవే తీయాలి. నేను తీసుకోలేను. ఇంకొకరు తీయలేరు. అది తీయవయ్యా నాలోని వేంకటరమణా!’– అని వేడుకున్నారు. నిన్ను పొందడానికి నాకు అడ్డొస్తున్నదేమిటంటే మత్సరం... అన్నారు. ఎంతగొప్పమాట! మత్సరం అంటే అన్య సుఖ ద్వేషి. ఇంకొకరికిఏదయినా మంచి జరిగితే మనం చాలా బాధపడి పోతుంటాం. అన్నపానీయాలు ఎక్కవు. నిద్రాసుఖం ఉండదు. వాడికి శుభం జరగడమా, నాకన్నావాడేం గొప్ప. వాడికేం తెలుసని. వాడికి కీర్తి రావడమేమిటి, వాడికి శుభాలు జరగడమేమిటి ... ఇలా ఇతరులను తక్కువచేసి తన గొప్పదనం స్మరించుకోవడం... అది మత్సరానికి ప్రారంభ స్థానం. అది అడ్డొస్తున్నదన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
భక్తుడికి ఆహారం భక్తే
యోగరతోవా భోగ రతోవా/ సంగ రతోవా సంగ విహీనః/ యస్య బ్రహ్మణి రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ... చెరుకు గడను తీసుకొచ్చి కత్తితో నరికినా, మరలోవేసి తిప్పినా, నోటితో కొరికినా... ఎంత హింసించినా తియ్యటి రసాన్ని ఒలికించడం తప్ప అది మరో విధంగా స్పందించదు. కారణం – త్యాగం దాని లక్షణం. ఏ వాగ్గేయకారుడి జీవితం చూసినా ప్రతివారి జీవితంలో ఈ ప్రశాంతత, ఈ కారుణ్యం, ఈ ద్వంద్వాతీత స్థితి, అందరినీ ప్రేమించగల, అనుగ్రహించగల శక్తి కనపడుతుంటాయి. వాళ్ళు కూడా అంత గొప్పగా ఆ సంగీతంతోనే ఎదిగారు. ఆ సంగీతంతోనే మనల్ని ఉద్ధరించారు. త్యాగరాజ స్వామి జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. మహారాజుగారు అన్ని కానుకలు పంపితే ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగబల్కు మనసా..’’ అంటూ వాటిని తీసుకెళ్ళి చెత్తదిబ్బలో పారేస్తాడా ... అని తోడబుట్టిన అన్నగారికే నచ్చలేదు తమ్ముడి పద్ధతి. ‘ఎప్పుడూ ఆ విగ్రహాలు పట్టుకుని కూర్చుంటాడు. తమ్ముడు కనుక రాజుగారి కొలువులో పాడితే ఎంత హాయిగా జీవించవచ్చు...’ అనే భావన అన్నగారిది. కాదు... సంగీతం మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వగలదు. ఇది ఇవ్వగలిగిన ఆనందం వేరొకటి ఇవ్వలేదు. వాగ్గేయకారులకు ఉన్నది సంగీతసాహిత్యాలు మాత్రమే కాదు. నేను పాట రాస్తాను, బాణీ కడతాను, అంటే ఎవడూ వాగ్గేయకారుడై పోడు. సంగీతసాహిత్యాల్లో అంతర్లీనంగా భక్తి ప్రవహించాలి. అది ఎటువంటి భక్తి ...అంటే నువ్వు ఏమయిపోతున్నా... నమ్ముకున్న వాడి చరణాలు వదలలేనిది అది.. అచంచలమైనది... అదే భర్తృహరి మాటల్లో చెప్పాలంటే... నిను సేవింపగ ఆపదల్ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,/జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై/కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ/చ్చిన రానీ... అంటాడు. ఏది ఏమయిపోయినా ఆ భక్తిలో పరమానందాన్ని పొంది ఎప్పటికప్పుడు లోపల ఈశ్వర గుణానుభవాలు పెరిగి అవి కీర్తనలుగా వెలువడుతుంటే ఆయన వాగ్గేయకారుడు. అంటే భక్తి ప్రధానం. భక్తుడికి భక్తి అమ్మలాంటిది. పసిబిడ్డకు పాలు ఎలాగో, భక్తుడికి భక్తి అలా ఆహారం. భగవంతుడి పాటలు వింటూ, తాను పాడుకుంటూ, రచన చేస్తూ, స్వరపరుస్తూ, శిష్యులకు చెబుతూ, ఏదీ ఆశించకుండా, ఏది లభిస్తే అది తింటూ, పరమ పవిత్రమైన జీవనాన్ని గడుపుతూ ఆఖరికి తన అవసరం లేదనుకున్నప్పుడు గహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకారం చేసి... భగవంతుడిలో ఐక్యమవుతాడు. భక్తుడిని వేరొకరు రక్షింపనక్కర లేదు..‘‘వాడిని నా కొరకు రక్షింపవలయు..’’ అంటాడు శ్రీమన్నారాయణుడు భాగవతంలో. వాడిని నేను రక్షించేది వాడి కోసం కాదు, నా కోసం..అంటున్నాడు. నన్ను నమ్ముకున్న వాడినే రక్షించకపోతే ఇక నేను ఉన్నానని లోకం ఎందుకు నమ్ముతుంది? అందుకని నేనున్నానని జనులు నమ్మడం కోసం.. నాకోసం వాడిని రక్షిస్తున్నా... అంటున్నాడు. భక్తుని స్థితి అలా ఉంటుంది. వాగ్గేయకారుల అనుభవాలు కూడా ఇవే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
భయం వద్దు... భక్తి కావాలి!
ఏమిట్రా అది... బొత్తిగా భయం భక్తీ లేకుండా అని అంటూ ఉంటారు పెద్దలు. భయభక్తులు మనిషికి చాలా అవసరం. ఈ రెండూ బాల్యం నుంచే ఉండాలి ఎవరికైనా. ఎందుకంటే చిన్నప్పుడు తలిదండ్రులు, గురువుల భయం లేకపోతే పిల్లలు తప్పు చేయడానికి సిద్ధపడతారు. తాము ఈ తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏమైనా అంటారనే భయం ఉంటే తప్పు చేయరసలు. అయితే భయం కన్నా భక్తి ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే భయంతో నడవడిక మారడం తాత్కాలికమే. ఎప్పుడైతే భయం పోతుందో, మనిషి ఏ పని చేయడానికైనా వెనుకాడడు. భక్తి అలాకాదు. ఒకసారి పాదుకుంటే... కలకాలం ఉంటుంది. రామభక్తి వల్లే కదా, హనుమ అఖండ విజయాన్ని సాధించింది. భక్తరామదాసు, భక్త తుకారాం, భక్త జయదేవ, తులసీదాసు, అన్నమయ్య వంటివారు భక్తితోనే కదా అన్నేసి మంచి పనులు చేయగలిగింది, అంతటి అజ రామరమైన సంకీర్తనలను భావితరాలకు అందించగలిగిందీ. అందుకే భయభక్తులనేవి మనిషికి అత్యవసరమైనవి. ఒకవేళ లేకపోతే అవశ్యం అలవరచుకోవలసినవీనూ. -
సంగమేశ్వరం..భక్తి పారవశ్యం
– శాస్త్రోక్తంగా నదీమ తల్లికి హారతులు – తెల్లవారుజామున 5.45 నిమిషాలకు ప్రారంభమైన పుష్కరాలు – తరలివచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు – తొలిరోజు పుష్కర స్నానమాచరించిన ప్రజాప్రతినిధులు – భక్తుల సేవలలో అధికార యంత్రాంగం సంగమేశ్వరం నుంచి సాక్షి ప్రతినిధి : సప్తనదుల కూడలి సంగమేశ్వర క్షేత్రం..భక్తిపారవశ్యంతో ఓలలాడింది. శుక్రవారం తెల్లవారుజామున 5.54 నిమిషాలకు వేదపండితులు నదీమ తల్లి కృష్ణమ్మకు పూజలు చేసి.. హారతులిచ్చి పుష్కరాలను ప్రారంభించారు. సంగమేశ్వర ఘాట్ వద్ద జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, ఎస్పీ ఆకె రవికృష్ణ, జేసీ హరికిరణ్, టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శివానందరెడ్డి తొలిసారిగా పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తుల సంఖ్య ఉదయం చాలా మందకొడిగా ఉండటంతో ఘాట్లు వెలవెలబోయాయి. అయితే ఈ సంఖ్య 11 గంటల తరువాత రానురాను పుంజుకోవడంతో కోలాహలం కనిపించింది. తొలిరోజు సాయంత్రం 6.10 గంటలకు పుష్కర స్నానాలను ముగించారు. డిప్యూటీ సీఎం గైర్హాజరు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన కృష్ణా పుష్కర ప్రారంభోత్సవ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. సంగమేశ్వర క్షేత్రం వద్ద డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా పుష్కరాలు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులే పుష్కరాలను ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల పుణ్యస్నానాలు సప్తనదీ సంగమేశ్వర క్షేత్రం వద్ద పుష్కర స్నానం ఆచరించేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కుటుంబసమేతంగా తరలివచ్చారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐజయ్య క్షేత్రానికి చేరుకుని పుష్కర స్నానమాచరించారు. అనంతరం లలిత సంగమేశ్వరస్వామివార్లను దర్శించుకున్నారు. అక్కడ ఏర్పాట్లపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వీఐపీ ఘాట్ ఇక్కడ లేదా అంటూ కొత్తపల్లి తహశీల్దార్ నరసింహులును నిలదీశారు. ప్రజాప్రతినిధులకు ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సతీసమేతంగా పుష్కరస్నానాలు ఆచరించి లలిత సంగమేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి పుష్కరిణిలో స్నానాలు చేశారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టి.. రాయలసీమ ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించమని సంగమేశ్వరుడిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపారు. పరవశించిన భక్తులు.. సంగమేశ్వరంలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు కష్ణానది పరవళ్ల సోయగాలను, సముద్రాన్ని తలపించేలా ఉన్న కృష్ణమ్మను చూస్తూ పరవశించిపోయారు. నిజంగానే నదీమ తల్లిలో స్నానం ఆచరించగానే తమ పాపాలు తొలగిపోయినట్లుగా భావన కలిగిందని మరికొందరు చెప్పుకోవడం జరిగింది. రాయలసీమ వాసులతోపాటు ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి భక్తులు తరలివచ్చారు. జేసీ పర్యవేక్షణలో ఏర్పాట్లు.. సంగమేశ్వరం వద్ద భక్తుల కోసం చేపట్టిన పనులు ఇంకా అసంపూర్తిగా ఉండటంతో వాటిని పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశించారు. భక్తులెవరైనా తేలు, పాము కాటుకు గురైతే వారికి తక్షణమే ప్రథమ చికిత్స అందించి.. అవసరమైతే జిల్లా కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సహాయ వైద్యాధికారి రాజా సుబ్బారావుకు సూచించారు. పుష్కరాలకు వచ్చే వికలాంగులను వలంటీర్లు జాగ్రత్తగా పుష్కర స్నానాలు చేయించి అదేక్రమంలో వారిని సురక్షితంగా వాహనాల్లో కూర్చోబెట్టాలన్నారు. అయితే అక్కడ పుష్కర విధులు నిర్వహించేందుకు వచ్చిన అధికారులు, సిబ్బంది అరకొర వసతులు కల్పించడం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో ఉన్న వారికి కనీసం మంచినీటిని అందించకపోవడంతో వారందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.


