సన్నిధి
భగవంతునికి చేసే షోడశోపచారాలలో తొమ్మిదవ ఉపచారం చందన సమర్పణం. ఓ దేవదేవా! మంచి సువాసన కలిగిన, మనోహరమైన ఈ శ్రీగంధాన్ని ప్రీతితో స్వీకరించమంటూ భగవంతునికి చందనం సమర్పిస్తాం.
సృష్టిలో ఉన్న వృక్ష జాతులలో గంధపు చెట్టుది ప్రత్యేక స్థానం. పూజలు, వ్రతాలు, నోములు, పేరంటాలు, పెండ్లిండ్లలో చందనం అందించడం తప్పనిసరి. పేరంటాలలో ముత్తైదువులకు గంధాన్ని కంఠ భాగంలో అలంకరిస్తారు. యోగశాస్త్రం ప్రకారం కంఠ భాగంలో విశుద్ధి చక్రం ఉంటుంది. అక్కడ రెండు వేళ్ళతో చందనం రాయడం వల్ల విశుద్ధి చక్రం ఉత్తేజితమౌతుంది. నుదుటి భాగంలో గంధం రాయడం వల్ల మెదడు చల్లబడుతుంది. కోపావేశం ఉపశమిస్తుంది. శాంతి లభిస్తుంది.
గంధం పూయడం వలన మనస్సుకు ఏకాగ్రత కుదురుతుంది. లలాట ప్రదేశంలో గంధం, కస్తూరి వంటి వాటితో బొట్టు పెట్టుకొంటే కనుబొమల మధ్యన ఉన్న జ్ఞాననాడులకు స్ఫూర్తి కలుగుతుంది. సంకల్ప శక్తి దృఢమవుతుంది. ఆయుర్వేద శాస్త్ర రీత్యా స్త్రీలు గంధం పూసుకోవడం వల్ల ఋతుక్రమం చక్కబడి ఆరోగ్యకరమైన అండోత్పత్తి జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అనారోగ్యం, అంటువ్యాధులు, చర్మరోగాలు నివారించబడతాయి. గర్భవతులకు గంధం పూయడం వారి కడుపులోని బిడ్డకు ఆరోగ్యకరం. శుభకార్యాలలో అతిథులనుచందన తాంబూలాలతో గౌరవించడం మన ఆచారం.
దేవతలకు కూడా...
సింహాద్రి అప్పన్నకు ఏడాది పొడవునా చందనం అలంకరిస్తూ ఆయన రౌద్రాన్ని శాంతింపజేస్తూంటారు. అక్షయ తదియనాడు ప్రతి ఏటా ఆయనకు చందనోత్సవం జరుపుతారు. అమ్మవారికి కూడా చందనమంటే ఎంతో ప్రీతి. అందుకే ఆమెను చందన ద్రవ దిగ్ధాంగీ’
(శరీరానికంతటికీ చందన ద్రవం అలదుకొన్నది) అని వర్షిస్తారు.
ఇక శ్రీకృష్ణ పరమాత్మ అయితే సదా చందన చర్చిత నీల కళేబరుడు. ఆంజనేయునికీ సింధూరం, గంధం ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు. తిరుమల వంటి దివ్యక్షేత్రాలలో శ్రీగంధ కైంకర్యం నిత్యం జరిగే పూజా విధిలో భాగం. అందుకోసం అక్కడ ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పరచబడింది. గంధ పరిమళం వ్యాపించి ఉన్న ్రపాంతంలో సానుకూల శక్తి, దైవిక అనుభూతి ఉంటుందన్న విశ్వాసం, ఆ పవిత్ర వాతావరణంలో జరిగే కార్యక్రమాలు విజయవంతం అవుతాయనే నమ్మకమూ భక్తులలో దృఢంగా ఉన్నాయి.
జ్వర తీవ్రత తగ్గడానికి తల కణతలకు గంధం రాయడం ఒక వైద్యం. చందనలేపనం ముఖ కాంతిని పెంచుతుంది. గంధం మంచి సౌందర్య సాధనం కూడా! ΄ûడర్లు, సబ్బులు, అగరుబత్తి, అత్తరు వంటి వాటి తయారీలో గంధం వాడతారు కదా!
పరమశివుని అభిషేక ద్రవ్యాలలో గంధం కూడా ఒకటి. మొత్తానికి ఆరోగ్యం, ఆహ్లాదం, అందం, ఆనందం, ఆధ్యాత్మికత కలబోసిన సంప్రదాయంగా చందన లేపనాన్ని చెప్పవచ్చు.
– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి


