నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం
వెయ్యి జీవితాలు మన కోసం వేచి చూడడం లేదు. జస్ట్... ఒకే ఒక్క జీవితం! అందుకే... ఆత్మహత్య అనే భావన మన మనసులోకి ఎప్పుడూ రానివ్వకూడదు. ‘జీవనోత్సాహం’ అనే ఉప్పెన ముందు ‘నిరాశ–నిస్పృహ’ అనేవి పూచిక పుల్లలు!
‘స్నేహ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాలని చెన్నైకి చెందిన డా.లక్ష్మీ విజయ్‌కుమార్ ఆలోచన చేసినప్పుడు చుట్టూ ఉన్నవారు సందేహించారు. వారు ఆమెతో మూడు విషయాలు చెప్పారు. వాలంటీర్లతో మాత్రమే ఒక సంస్థను నడపడం సాధ్యం కాదు. రకరకాల సంకోచాలతో సహాయం అడగడానికి ఎవరూ ముందుకు రారు. ప్రజలతో మాట్లాడడం ద్వారా మాత్రమే ఆత్మహత్యలను నివారించలేము. వారందరి అంచనాలు సరికాదని నాలుగు దశాబ్దాల ‘స్నేహ’ ప్రస్థానంతో నిరూపించారు లక్ష్మీ విజయ్ కుమార్. ఈ స్వచ్ఛంద సంస్థను పూర్తిగా వాలంటీర్‌లే నడుపుతున్నారు.
ఎన్నో జాగ్రత్తలు తీసుకొని...
‘స్నేహ కోసం వాలంటీర్‌ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. రెండు వందల నుంచి మూడు వందల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటారు. మూడు ఇంటర్వ్యూలతో ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం తొమ్మిది నుంచి పదిమంది మాత్రమే వాలంటీర్‌లుగా ఎంపిక అవుతారు. మా వాలంటీర్‌లు శిక్షణ పొందిన కౌన్సిలర్‌లుగా ఉండాలనుకుంటాం. ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండడం, ఎవరినీ తప్పు పట్టకపోవడం, ఇతరుల బాధను అర్థం చేసుకొని తమ బాధగా భావించడం, తమ అభి్రపాయాలను ఇతరులపై రుద్దకపోవడమే మేము ప్రతి దరఖాస్తుదారు నుంచి ఆశించేవి’ అంటారు లక్ష్మి.
ఆమె పోరాట ఫలితమే...
ఆత్మహత్యలు జరగకుండా నివారించడమేకాదు.. ఆపదలో ఉన్న వారికి సహాయపడడం, ఆత్మహత్య నివారణలపై అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తోంది స్నేహ స్వచ్ఛంద సంస్థ. వియన్నాలో 1985లో జరిగిన అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంఘం సదస్సులో పాల్గొన్న లక్ష్మి ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అక్కడ ఎంతోమంది మానసిక వైద్యులు, ఆత్మహత్యల నివారణ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. భారతదేశంలో ఆత్మహత్యలను నేరంగా పరిగణించడాన్ని లక్ష్మీ విజయ్‌కుమార్ వ్యతిరేకించారు.
2017 వరకు ఆత్మహత్యయత్నం నుండి బయటపడిన వారిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 309 కింద కేసు నమోదు చేసేవారు. ఇది శాస్త్రీయ ఆధారం లేని వలసవాద చట్టం అని పేర్కొంటూ దీనిని మార్చడానికి ఉద్యమించారు. భారత లా కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ లక్ష్మణన్‌తో మాట్లాడి, ఇది బ్రిటిష్ కాలం నాటి పురాతన చట్టం అని, చాలా దేశాలు దీనిని తొలగించాయని చెప్పారు. లక్ష్మీ విజయ్‌కుమార్ పొరాటం ఫలించింది. 2017లో మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని ఆమోదించారు. ఇది ఆత్మహత్యయత్నాన్ని నేరంగా కాకుండా, తీవ్రమైన మానసిక ఒత్తిడికి సంకేతంగా పరిగణించడంతోపాటు పునరావాస అవకాశాలను కూడా అందిస్తోంది.
పరిశోధన బాటలో...
మానసిక ఆరోగ్యానికి అనుకూలమైన చట్టాలు, విధానాల రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించడమే కాదు మానసిక ఆరోగ్య పరిశోధనలో గణనీయ కృషి చేశారు లక్ష్మీ. మానసిక ఆరోగ్య పరిశోధనకు సంబంధించి డేటా కొరత వల్ల తానే స్వయంగా పరిశోధన బాట పట్టారు. మానసిక ఆరోగ్య పరిశోధన రంగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా రాయల్ కాలేజీ ఆఫ్ సైకియాట్రిస్ట్స్ గౌరవ ఫెలోషిప్, ఫెలోషిప్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అందుకున్నారు. ఈ రెండు విశిష్ట పురస్కారాలను అందుకున్న తొలి భారతీయ సైకియాట్రిస్ట్‌గా తన ప్రత్యేకత చాటుకున్నారు.
మార్పు కోసం...
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిని గుర్తించే ఏకైక ఏఐ సంస్థ ‘సమురాయ్’ మాత్రమే కాదు. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ అయిన మెటా... ఎవరైనా ఆత్మహత్య చేసుకునే దిశలో ఆలోచిస్తున్నారని సూచించే పోస్ట్‌లు లేదా బ్రౌజింగ్ హిస్టరీని ఫ్లాగ్ చేయడానికి తమదైన సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఎవరైనా ఆత్మహత్యకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేసినా, సెర్చ్ చేసినా వారి ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి సూయిసైడ్ అండ్ క్రైసిస్ లైఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్ రంగంలోకి దిగుతుంది. అవసరమని భావిస్తే ఎమర్జెన్సీ రెస్పాండర్స్‌కు కాల్ చేస్తుంది.
ఆత్మహత్యలను ఏఐ అడ్డుకోగలదా?
ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయడానికి అమెరికాలోని ఏఐ కంపెనీ సమురాయ్ ల్యాబ్స్ రంగంలోకి దిగింది. ఆత్మహత్య చేసుకోవాలనే భావన కనిపించే సోషల్ మీడియా పోస్ట్‌లను విశ్లేషించడానికి ఏఐ సాధనాలను ఈ కంపెనీ ఉపయోగిస్తోంది. ‘డైరెక్ట్ మెసేజ్’లాంటి వ్యూహాలతో ముందుకు వెళుతోంది.
‘ఆత్మహత్యల నివారణ కోసం సోషల్ మీడియాను ఉపయోగించడంలో ఒకరకమైన వైరుధ్యం ఉంది. ఆత్మహత్యలకు సోషల్ మీడియానే కారణం అని నిందించేవారు ఎక్కువగానే ఉన్నారు. అయితే అదే సోషల్ మీడియా నుంచి లక్షలాది పోస్ట్‌లను విశ్లేషించి, నిరాశానిస్పృహల చీకటిలో ఉన్నవారిని, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారిని గుర్తించి వారిని సరిౖయెన మార్గంలో తీసుకురావడం మంచిదే కదా!’ అంటున్నారు సమురాయ్ కో–ఫౌండర్ పాట్రిసియా.

డా.లక్ష్మీ విజయ్‌కుమార్


