సాక్షి, చెన్నై: చెన్నై మెరీనా తీరంలోని పట్టినంబాక్కంలో 25 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండ సచివాలయం, అసెంబ్లీ భవన్ రూపుదిద్దుకోనున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తులు మొదలయ్యాయి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన చారిత్రాత్మక సెయింట్ జార్జ్ కోట భవనంలో ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ సచివాలయం, శాసనసభ కొనసాగుతున్నాయి. అక్కడ తీవ్రమైన వాహనాల రద్దీ, పార్కింగ్ ఇబ్బందులు ప్రజల రద్దీ పెరిగిన నేపథ్యంలో చెన్నై పట్టినంబాక్కంలో కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
బ్రహ్మాండ భవనంగా..
రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త సచివాలయం, శాసనసభ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రధాన భవనాన్ని 20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో, 15 అంతస్తుల ఎత్తులో అత్యంత అధునాతనంగా రూపొందించనున్నారు. గిండిలోని హైవేస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నందంబాక్కం ఫిన్‌టెక్ సిటీ ఎదురుగా ఉన్న భూములను పరిశీలించిన అనంతరం,పట్టినంబాక్కంలోని 25 ఎకరాల భూమిని ఈ నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదించింది. శాంతోమ్ ప్రధాన రహదారిని అనుసంధానించే ఈ స్థలం తమిళనాడు హౌసింగ్ బోర్డు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చదరపు అడుగు మార్కెట్ మార్గదర్శక విలువ రూ.22,000 కాగా, మొత్తం భూమి అంచనా విలువ సుమారు రూ.2,047 కోట్లుగాపరిగణించి ఉన్నారు.
అనుమతుల మంజూరు
మైలాపూర్, పట్టినం బాక్కం పరిధిలోని 21.37 ఎకరాల హౌసింగ్ బోర్డ్ భూమిని ప్రజా ప్రయోజనాల సచివాలయ నిర్మాణానికి ఉపయోగించేందు కు తమిళనాడు హౌసింగ్ బోర్డు అనుమతి ఇచ్చింది. అలాగే మిగిలిన భూమి, రోడ్ల వినియోగానికి చెన్నై కార్పొరేషన్ కమిషనర్, రెవెన్యూ శాఖలు కూడా ఆమోదం తెలిపాయి. 1958లో సేకరించిన ఈ స్థలంలో గతంలో నిర్మించి ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన క్వార్టర్స్ భవనాలను కూల్చివేసి స్థలాన్ని ఖాళీ చేసే ప్రక్రియను హౌసింగ్ బోర్డు వేగవంతం చేయడానికి నిర్ణయించింది.
చదవండి: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. బాటిల్‌పై రూ.10 తగ్గింపు


