ఇప్పటివరకు మన ఊహకే పరిమితమైన ఒక విషయం త్వరలో వాస్తవ రూపం దాల్చనుంది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో మనుషులు జంతువులు, పక్షులతో సంభాషించగలిగే అవకాశం త్వరలో రానున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ సాంకేతికతతో జంతువుల స్వరాలు, కదలికలను సేకరించి విశ్లేషించడం వాటి గోప్యత హక్కును ఉల్లంఘించే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
జంతువుల భాషను అర్థం చేసుకునే దిశగా
మెషిన్ లెర్నింగ్ నమూనాలు.. జంతువుల ధ్వనులను క్రమబద్ధీకరించి, మనుషులు సులభంగా గుర్తించలేని నమూనాలను గుర్తిస్తున్నాయి. కారియన్ క్రో (కాకి)ల స్వరాలపై ఏళ్లుగా పరిశోధన చేస్తున్న జీవశాస్త్రవేత్త విట్టోరియో బగ్లియోన్.. ఏఐ తన రికార్డింగుల్లోని సాధారణ లక్షణాలను గుర్తించగలగడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. కాకులు గూడు రక్షణ కోసం ఇతర కాకులను పిలిచే ఒక స్వరం ‘రండి.. సహాయం చేయండి’ అనే అర్థాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.
‘ప్లేబ్యాక్’తో ప్రమాదం
రికార్డు చేసిన జంతు స్వరాలను అడవిలో తిరిగి వినిపించే ‘ప్లేబ్యాక్’ పద్ధతి దుర్వినియోగానికి దారితీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిచయమైన స్వరాన్ని అనుకరించి జంతువుల ప్రవర్తనను ప్రభావితం చేయవచ్చని, దాని అసలు అర్థం పూర్తిగా తెలియకపోయినా ఇది సాధ్యమని పేర్కొన్నారు. వేటగాళ్లు లేదా దురుద్దేశంతో ఉన్నవారు ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని బగ్లియోన్ హెచ్చరించారు.
సంభాషణా.. లేక జోక్యమా?
న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన మోర్-దాన్-హ్యూమన్ లైఫ్ కార్యక్రమం డైరెక్టర్ సీజర్ రోడ్రిగెజ్-గరవిటో కూడా ప్లేబ్యాక్ సాంకేతికతపై ఆందోళన వ్యక్తం చేశారు. 2025లో జంతు సంభాషణకు సంబంధించిన ఏఐ వ్యవస్థలపై రూపొందించిన నివేదికలో.. ఈ సాంకేతికత వల్ల జంతువులను సంప్రదించేందుకు పెద్ద సంఖ్యలో మనుషులు ప్రయత్నించే పరిస్థితి ఏర్పడొచ్చని, వాటిని ఆయుధాలుగా ఉపయోగించే ప్రమాదమూ ఉందని పేర్కొన్నారు.
ఏనుగు ఉదంతం హెచ్చరిక
2007లో జంతుశాస్త్రవేత్త కేటీ పేన్.. మరణించిన వృద్ధ ఏనుగు స్వరాన్ని రికార్డు చేసి వినిపించడంతో ఓ ఏనుగు తీవ్ర ఆందోళనకు గురైందని తెలిపారు. జంతువుల స్వరాన్ని కచ్చితంగా పునరుత్పత్తి చేయగలిగినా.. దాని అర్థం, దాని ప్రభావం పూర్తిగా అర్థం కాకపోవచ్చని ఈ ఘటన సూచిస్తోంది.
2030 నాటికి సాధ్యమేనా?
ఇన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ జంతువులతో సంభాషణకు వీలైన వ్యవస్థల అభివృద్ధిపై పరిశోధకులు, సాంకేతిక సంస్థలు దృష్టి కొనసాగిస్తున్నాయి. మనుషులతో సంభాషిస్తున్నామని జంతువుకు తెలియకుండానే సంభాషణను గుర్తించగల ప్రాజెక్టుకు ప్రస్తుతం 10 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. ఈ సవాలుకు నిధులు సమకూరుస్తున్న బిలియనీర్ జెరెమీ కొల్లర్.. వచ్చే దశాబ్దంలోనే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని ఓ కార్యక్రమంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ వేగాన్ని దృష్టిలో ఉంచుకుని 2030 నాటికి ఈ ‘కోడ్’ను ఛేదించగలమని అన్నారు.
ఇది కూడా చదవండి: నీమ్ కరోలి బాబా ఎవరు.. స్టీవ్ జాబ్స్‌ను ఎలా ప్రభావితం చేశారు?


