ఏఐ దోస్తీ.. ఉద్యోగాలతో కుస్తీ | Impact of Artificial Intelligence on Employment | Sakshi
Sakshi News home page

ఏఐ దోస్తీ.. ఉద్యోగాలతో కుస్తీ

Sep 3 2026 5:08 AM | Updated on Sep 3 2026 5:42 AM

Impact of Artificial Intelligence on Employment

కృత్రిమ మేధతో మారుతున్న జనజీవితం

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రభావం 

భారత్‌లో తరచూ వినియోగిస్తున్న 80 శాతం మంది ఉద్యోగులు 

ఏఐను పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్న 40 శాతం భారతీయ సంస్థలు 

ఉద్యోగాల్లో 19 శాతం కోత.. ఏఐ నైపుణ్యాలుంటే 62% అధిక వేతనం.. తాజా అధ్యయనాల్లో వెల్లడి 

36 దేశాలకు చెందిన 39 వేలకు పైగా ఉద్యోగులపై అధ్యయనం

సాక్షి, అమరావతి: కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం మామూలుగా లేదు. సమాచార సేకరణ, రచన, లెక్కలు, పరిశోధన, వైద్యం, విద్య, వ్యాపారం.. ఇలా దాదాపు ప్రతి రంగంలోకి చొచ్చుకుపోతోంది. ఏఐ అభివృద్ధి కొత్త అవకాశాలను సృష్టిసూ్తనే.. కొన్ని వర్గాలకు కొత్త సవాళ్లను కూడా తెస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ముందున్న భారత్‌
‘పీపుల్‌ ఎట్‌ వర్క్‌–2026’ సర్వేలో 36 దేశాలకు చెందిన 39 వేలకు పైగా ఉద్యోగులను భాగస్వాముల్ని చేయగా.. ఏఐ వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ ముందంజలో ఉన్నట్టు అధ్యయన నివేదిక తేల్చింది. దేశంలో 80 శాతం మంది ఉద్యోగులు వారానికి పలుమార్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. 41 శాతం మంది దాదాపు ప్రతిరోజూ వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ ఏఐ వినియోగం 20 శాతం మాత్రమే. అంటే భారత్‌లో వినియోగం ప్రపంచ సగటుకు రెట్టింపు కంటే ఎక్కువ. అలాగే 18 నుంచి 39 ఏళ్ల వయసున్న ఉద్యోగుల్లో నిత్యం ఏఐ వాడుతున్న వారి వాటా 43 శాతంగా ఉంది. మహిళల్లో ఇది 44 శాతం కాగా.. పురుషుల్లో 40 శాతం. పెద్దసంస్థల్లో రోజువారీ ఏఐ వినియోగం 54 శాతంగా ఉంది.

ప్రపంచం మారుతోంది
‘2026 ప్రపంచ ఏఐ ఉద్యోగాల సూచీ’ ప్రపంచంలోని 27 దేశాల్లో 100 కోట్లకు పైగా ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించింది. ఏఐ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు మొత్తం ఉద్యోగ మార్కెట్‌ కంటే దాదాపు 8 రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. ఏఐ నైపుణ్యాలు గల ఉద్యోగులకు సగటున 62 శాతం అధిక వేతనం లభిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది. ఏఐని సమర్థవంతంగా ఉపయోగిస్తున్న సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య కూడా ఇతర సంస్థల కంటే వేగంగా పెరిగింది. అత్యధిక ఏఐ వినియోగం ఉన్న సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య 52 శాతం పెరగ్గా.. తక్కువ వినియోగం ఉన్న సంస్థల్లో 36 శాతమే పెరిగింది. ఉత్పాదకతలోనూ స్పష్టమైన తేడా కనిపించింది.

యువతకే ఎక్కువ దెబ్బ
‘కృత్రిమ మేధ తాజా ఉపాధి ప్రభావాలు’ అనే అంశంపై స్టాన్‌ఫర్డ్‌ డిజిటల్‌ ఎకానమీ ల్యాబ్‌ చేసిన అధ్యయనం అమెరికాలో లక్షలాది ఉద్యోగుల వేతన సమాచారాన్ని పరిశీలించింది. ఏఐ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉద్యోగాల్లో 22 నుంచి 25 ఏళ్ల యువత ఉపాధి, ఉండాల్సిన స్థాయితో పోలిస్తే 19 శాతం తక్కువగా ఉంది. 2025లో ఈ లోటు 15 శాతంగా ఉండగా.. 2026 జూన్‌ నాటికి 19 శాతానికి పెరిగింది. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే యువతకు నియామకాలు తగ్గడం ఈ ప్రభావానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మనిషికి బదులు.. డిజిటల్‌ ఫ్రెండ్‌
ఏఐ ప్రభావం ఉద్యోగాలకే పరిమితం కాదు. ‘కృత్రిమ మేధ సహచరులతో పరస్పర చర్య, మానసిక శ్రేయస్సు’–నేచర్‌ హ్యూమన్‌ బిహేవియర్, 2026 అధ్యయనంలో అమెరికాకు చెందిన 1,131 మంది ఏఐ వినియోగదారుల నుంచి సమాచారం సేకరించారు. వీరిలో 237 మంది పాల్గొన్న 4,664 సంభాషణల్లో 4,64,687 సందేశాలను కూడా పరిశీలించారు. ఏఐతో కొందరు వినియోగదారులు స్నేహపూర్వక, అనుబంధ భావాలను పెంచుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్న వారికి ఏఐతో మాట్లాడటం తోడుగా అనిపిస్తోందని తేలింది.

 ఏఐతో పని వేగం పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. వైద్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమల్లో కొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో నైపుణ్యాలు లేని ఉద్యోగులు వెనుకబడటం, యువతకు తొలి ఉద్యోగ అవకాశాలు తగ్గడం, వ్యక్తిగత సమాచార భద్రత, తప్పుడు సమాచారం వంటి సమస్యలు కూడా పెరగవచ్చు. అందుకే ఏఐని మనిషికి ప్రత్యామ్నాయంగా కాకుండా.. మనిషి సామర్థ్యాన్ని పెంచే సాధనంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. రేపటి ప్రపంచంలో యంత్రంతో పోటీ పడే ఉద్యోగి కంటే.. యంత్రాన్ని సమర్థవంతంగా ఉపయోగించగల ఉద్యోగికే ఎక్కువ విలువ ఉంటుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement