హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ తీరు తెన్నులపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ దళితులను దగా చేసిందని ఆరోపించారు. తెలంగాణకు పీడ దినాలు పట్టి 1000 రోజులు అయ్యిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్‌ఎస్ చార్జ్‌షీట్ విడుదల చేసిన కేటీఆర్ మాట్లాడుతూ పలు సమస్యలతో రైతులు ధాన్యం కుప్పల మీద చనిపోతున్నారని, నీళ్లు అడిగితే తెలంగాణ సీంఎం రక్తం పారిస్తున్నారన్నారు. ఈ వెయ్యి రోజుల్లో ఎంతో మంది రైతులు చనిపోయారు. రైతు బీమాను కూడా తెలంగాణ ప్రభత్వం రద్దు చేసింది. రేవంత్ అన్నదాతల జేబులు కొట్టి రాహుల్ జేబు నింపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరంపై కక్ష రైతులకు శిక్షగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రశ్నించిన ఇంజినీర్లను బెల్టుతో కొడతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు.జాబులు అడిగితే లాఠీలతో కొడుతున్నారు. ఉద్యోగాలు అడిగితే బావిలో దూకమంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్.. చంద్రబాబుకు చెంచాగిరీ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. చదువురాని వ్యక్తి చేతుల్లో విద్యాశాఖ ఉందన్నారు. విద్యాసంస్థల భూములను కూడా గుంజుకున్నారు. విద్యావ్యవస్థను సీఎం భ్రష్టు పట్టిస్తున్నారు. హెచ్‌సీయూ భూముల మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగిన కాలేజీలను బెదిరిస్తున్నారు.
ఇప్పుడున్నది లుచ్చా కాంగ్రెస్ అని కేటీఆర్ ఆరోపించారు. వైఎస్‌ఆర్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌ను తాము కొనసాగించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ అంటున్నారు. పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎప్పుడు పెంచుతారని కేటీఆర్ ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లపై ప్రభుత్వం పిటిషన్లు వేయించిందని ఆరోపించారు. పథకాలు లేవు కానీ మూసీకి కోట్ల నిధులు ఖర్చు చేస్తామని చెబుతున్నారన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో దళిత, గిరిజనులకు అన్యాయం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ ముందు మోకరిల్లిన సిల్లీ పాలన కాంగ్రెస్ పాలన అని ఎద్దేవా చేశారు. కమిషన్లు, పర్సంటీజీల పాలన కాంగ్రెస్ పాలన అని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయి. హామీలు అమలు కాక ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో పట్టపగలే దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయి. మెట్రో విస్తరణను గాలికొదిలేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. పాక్సో నిందితులను ప్రభుత్వం కాపాడుతోంది. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. తనకు హిట్లర్ ఆదర్శం అని రేవంత్ అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో స్కామ్‌ల జాతర సాగుతోంది. వీళ్ల అవినీతి భరించలేక ఓ ఐఎఎస్ కూడా పాడిపోయారని కేటీఆర్ అన్నారు. ప్రతి పనిలోనూ కుంభకోణానికి పాల్పడుతున్నారు. వాటాల కోసం మంత్రులు కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు. ప్రశ్నించిన జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని రేవంత్ అంటున్నారు. కేసీఆర్‌కు రాజీనామాలు కొత్తకాదు. కేసీఆర్ రాజీనామా చేస్తేనే కదా రాష్ట్రం వచ్చింది అని కేటీఆర్ అన్నారు కేసీఆర్ అనే నాయకుడు లేకుంటే..రేవంత్‌కు సీఎం పదవి వచ్చేనా అని కేటీఆర్ ప్రశ్నించారు.


