‘డాడీ గుర్తొస్తున్నావ్‌..’.. కన్నీటితో తడిపేస్తున్న ఇన్‌స్టా పోస్ట్‌! | One Late Night I Miss You Text Sends Dad On A 14 Hour Journey For An Emotional Reunion, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

‘డాడీ గుర్తొస్తున్నావ్‌..’.. కన్నీటితో తడిపేస్తున్న ఇన్‌స్టా పోస్ట్‌!

Sep 2 2026 9:16 AM | Updated on Sep 2 2026 10:30 AM

Late Night Text to 14 Hour Journey Fathers Heartwarming Surprise Goes Viral

అర్ధరాత్రి వేళ కుమార్తె పంపిన ఆ సందేశం చూసి, ఆమె తండ్రి ఏకంగా 14 గంటల పాటు ప్రయాణించి, ఆమె దగ్గరకు చేరుకున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘ఆపిల్.కైవల్య’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ తన తండ్రి ముకేశ్ హీరో తనపై చూపిన అనురాగాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు.

రాత్రి సుమారు 1:50 గంటల సమయంలో ఆమె తన తండ్రికి ‘డాడీ చాలా గుర్తొస్తున్నావ్’ అంటూ ఓ సందేశం పంపారు. కుమార్తె నుంచి వచ్చిన ఆ ఒక్క మాటే ఆయనను వెంటనే ప్రయాణానికి పురికొల్పింది. మరుసటి రోజు ఉదయం ఆమె తలుపు తీసి చూసేసరికి, వీపున బ్యాగ్‌తో తండ్రి గుమ్మం ముందు నిల్చుని కనిపించారు. కేవలం ఎనిమిది గంటల పాటు కుమార్తెతో గడపడం కోసం ఆయన 14 గంటల పాటు ప్రయాణించి వచ్చారు. ఆయన తిరిగి తాను ఉండే చోటుకు వెళ్లడానికీ మరో 14 గంటల సమయం పడుతుంది.

ఆ కొద్దిపాటి సమయంలోనే ఆ తండ్రీకూతుళ్లు ఎంతో విలువైన క్షణాలను పంచుకున్నారు. ఆమెతో కలిసి బైక్ రైడ్‌కు వెళ్తూనే ఆయన ఆఫీస్ ఫోన్ కాల్స్ మాట్లాడారు. వినోద కేంద్రానికి వెళ్లి సరదాగా సమయం గడిపారు. అనంతరం  రెస్టారెంట్‌లో భోజనం చేశారు. కేవలం బయటకు వెళ్లడమే కాకుండా, కుమార్తె వంటగదిలోని గిన్నెలు కడగడం సహా పలు చిన్నపాటి పనులను ఆయనే స్వయంగా చేసిపెట్టారు.

ఈ వీడియోను పంచుకుంటూ.. ‘నిన్ను చూడాలని ఉందని చెప్పాను.. వెంటనే వచ్చేశారు. 14 గంటల ప్రయాణం, ఒక్క రోజు కలయిక, అడగకుండానే చేసిపెట్టిన ఎన్నో పనులు’ అని ఆ యువతి రాసుకొచ్చారు. తల్లిదండ్రులు తమ మాటల్లో ఎప్పుడూ తోడుంటామని చెప్పకపోవచ్చు కానీ, చేతల్లో ఆ ప్రేమను చాటుతారని ఆమె భావోద్వేగంతో వివరించారు. అనంతరం ఆయన స్లీపర్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మాటల కంటే చేతలే గొప్పవని నిరూపించిన ఈ వీడియో నెటిజన్ల మనసులను అమితంగా హత్తుకుంటోంది.

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురిలో అయోధ్య సీఈవో.. నేడు వెల్లడి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement