యూపీ ఎన్నికలపై కాంగ్రెస్‌ ప్లాన్‌ బీ.. వారికి బంపరాఫర్‌? | UP Elections 2027, Congress Eyes Stronger Candidates, Seeks 115–120 Seats In Alliance Talks | Sakshi
Sakshi News home page

యూపీ ఎన్నికలపై కాంగ్రెస్‌ ప్లాన్‌ బీ.. వారికి బంపరాఫర్‌?

Sep 2 2026 9:17 AM | Updated on Sep 2 2026 10:31 AM

Congress eyes resourceful candidates in UP Elections

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కూడా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్న వేళ.. అభ్యర్థుల ఎంపికలోనూ కొత్త విధానాన్ని అనుసరించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

బలమైన ప్రజాదరణతో పాటు ఎన్నికల ప్రచారాన్ని సొంతంగా నిర్వహించగల ఆర్థిక సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు టికెట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు ‘ఇండియా టుడే’ కథనం వెల్లడించింది. ఎన్నికలను ఈసారి కాంగ్రెస్‌ అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత తెలిపారు. నియోజకవర్గంలో ప్రజాదరణ, గెలుపు అవకాశాలు, ప్రచారానికి అవసరమైన వనరులు ఉన్న నేతలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

అయితే.. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ గెలిచే సత్తా ఉన్న బలమైన అభ్యర్థులకు మాత్రం మినహాయింపు ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేశాయి. అదే సమయంలో అభ్యర్థులు పార్టీ నిధికి కూడా తమ వంతు సహకారం అందించాలని పార్టీ ఆశిస్తోంది. గతంలో ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ నుంచి నిధులు తీసుకున్న కొందరు అభ్యర్థులు వాటిని పూర్తిగా ప్రచారానికి వినియోగించకుండా తమ వద్దే ఉంచుకున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఈ అంశంపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

2022 ఫలితాల నేపథ్యంలో కొత్త వ్యూహం
2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 399 స్థానాల్లో పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పలువురు అభ్యర్థులకు పార్టీ నుంచి ఎన్నికల ప్రచారం కోసం భారీగా నిధులు అందించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అనుభవం నేపథ్యంలోనే ఈసారి అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలతో పాటు ఆర్థిక సామర్థ్యానికీ ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

ఎస్పీతో సీట్లపై కాంగ్రెస్‌ పట్టు
మరోవైపు.. సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాల అంశం కాంగ్రెస్‌కు కీలకంగా మారింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 115 నుంచి 120 సీట్లు కావాలని కాంగ్రెస్‌ పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ రాజేంద్ర పాల్‌ గౌతమ్‌ ఏకంగా 50 శాతం సీట్ల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌ ఆరు స్థానాలు గెలుచుకోవడం, ఉత్తర భారతదేశంలో రాహుల్‌ గాంధీకి పెరుగుతున్న ఆదరణ తమకు అనుకూలంగా మారుతుందని పార్టీ అంచనా వేస్తోంది. దళితులు, మైనారిటీలు, యాదవేతర ఓబీసీ వర్గాలు రాహుల్‌ వైపు మొగ్గుచూపుతున్నాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

ఇక వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై యాంటీ ఇన్‌కంబెన్సీ తమకు కలిసొచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ భావిస్తోంది. సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తూ మొత్తం 403 నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తోంది. సీట్ల పంపకాల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు.. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: రీల్స్‌.. ఫాలోవర్ల మోజు!.. పా‍ర్టీని పట్టించుకోరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement