హార్ముజ్‌పై ట్రంప్‌ సంచలన కామెంట్స్‌.. ఇరాన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ | Trump Says US has almost total control of Hormuz | Sakshi
Sakshi News home page

హార్ముజ్‌పై ట్రంప్‌ సంచలన కామెంట్స్‌.. ఇరాన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Sep 2 2026 7:16 AM | Updated on Sep 2 2026 7:27 AM

Trump Says US has almost total control of Hormuz

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్‌ జలసంధిపై అమెరికాకు దాదాపు పూర్తి నియంత్రణ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలుతున్నదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రెండు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ స్పందిస్తూ.. ఇరాన్‌ను మళ్లీ చర్చల టేబుల్‌ వద్దకు తీసుకురావడానికి తాను ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరినా తనకు పెద్దగా పట్టింపు లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం హార్ముజ్‌ జలసంధిపై అమెరికాకు దాదాపు పూర్తి నియంత్రణ ఉండటం, ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉండటమే తనకు సరైన పరిస్థితి అన్నట్లుగా వ్యాఖ్యానించారు.

మరోవైపు.. ఇరాన్‌పై అమెరికా తాజాగా భారీ వైమానిక దాడులు చేసింది. హార్ముజ్‌‌ సమీపంలోని ఇరాన్‌ సైనిక స్థావరాలు, రాడార్‌ వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, సముద్ర సంబంధిత లక్ష్యాలపై దాడులు జరిగినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్‌ సముద్రంలో మైన్లు ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలు, అమెరికా బలగాలు, వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్‌ కూడా క్షిపణులు, డ్రోన్లతో ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. జోర్డాన్‌, బహ్రెయిన్‌, కువైట్‌ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్‌ మాత్రం అమెరికా దాడులకు తీవ్రమైన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటూ హెచ్చరించింది.

చమురు ధరలకు సెగ
హార్ముజ్‌ జలసంధిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ జలసంధి మీదుగా సాగుతుంది. తాజా దాడుల నేపథ్యంలో బుధవారం బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 95.52 డాలర్లకు, WTI ధర 91.02 డాలర్లకు చేరింది. ఇదిలా ఉండగా.. అమెరికా నౌకాదళ దిగ్బంధం కారణంగా ఇరాన్‌ చమురు ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి. మార్చిలో రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్లుగా ఉన్న ఇరాన్‌ క్రూడ్‌ లోడింగ్స్‌ ఆగస్టులో కేవలం 2.2–2.55 లక్షల బ్యారెళ్లకు పడిపోయినట్లు రాయిటర్స్‌ తెలిపింది. దీంతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.

మొత్తంగా.. అమెరికా-ఇరాన్‌ మధ్య ఆరు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణ మరో కీలక మలుపు తిరిగింది. హార్ముజ్‌పై నియంత్రణ, చమురు ఎగుమతులు, అమెరికా సైనిక చర్యలే ఇప్పుడు ఇరుదేశాల మధ్య ప్రధాన పోరాటంగా మారాయి. తాజా పరిణామాలతో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement