బిష్కెక్: షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 25వ వార్షికోత్సవం సందర్భంగా కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్‌లో మంగళవారం నిర్వహించిన 26వ ఎస్సీఓ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అంతర్జాతీయంగా సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించిందని, ప్రజల కృషితోనే ఇది సాధ్యమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలు విదేశీ పర్యటనలు, విదేశాల్లో పెళ్లిళ్లను తగ్గించి ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. దేశం సాధించిన 7.8 శాతం ఆర్థిక వృద్ధి భారతీయుల సమష్టి కృషికి, సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు అభినందనలు తెలుపుతూనే, ‘అబద్ధాల ప్రతిధ్వనుల’ (ఝూఠ్ కీ గూంజ్) తో నిరాశను వ్యాప్తి చేసేవారిపై విమర్శలు గుప్పించారు. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వివాహాలు, అనవసర బంగారు కొనుగోళ్లను తగ్గించి, స్వదేశీ విధానాన్ని బలోపేతం చేయాలని ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో పిలుపునిచ్చారు.
‘2020 కొవిడ్ సమయం నుంచి ప్రపంచంలో ఎక్కడా స్థిరత్వం కనిపించలేదు. కానీ భారత్ వేగంగా పురోగమిస్తోంది’ అని తెలిపారు. దేశంలో నిరాశలో మునిగిపోయిన కొందరు అబద్ధాల ద్వారా ప్రతికూలతను వ్యాప్తి చేస్తున్నారని, వాటన్నింటినీ అధిగమించి దేశం 7.8 శాతం వృద్ధి నమోదు చేసిందని వ్యాఖ్యానించారు. ఈ వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి ఆత్మనిర్భర భారత్, ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రం అత్యంత కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. స్వదేశీకి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్వాతంత్ర్య శతాబ్ది నాటికి యువతకు ‘వికసిత భారత్’ను అందించవచ్చని పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సంకల్పంతో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. నాలుగు రోజుల మధ్య ఆసియా పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్తాన్‌లో ద్వైపాక్షిక చర్చలు ముగించుకుని ఆయన బిష్కెక్ చేరుకున్నారు. ప్రాంతీయ భద్రత, అనుసంధానత, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా పలువురు యురేషియా నేతలతో చర్చలు జరిపారు.
PM Shri @narendramodi Ji congratulates citizens on India’s impressive 7.8% GDP growth, crediting the collective strength, hard work and determination of 140 crore Indians.#GDP#NewIndia pic.twitter.com/oFF8bijrfr
— BJP Mahila Morcha (@BJPMahilaMorcha) September 1, 2026


