ఒకే ఇంట్లో బయటపడ్డ 23 మృతదేహాలు! | Nepal Flash Flood: 23 Bodies Found in One House Death Toll Nears 1000 | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో బయటపడ్డ 23 మృతదేహాలు!

Sep 1 2026 9:15 AM | Updated on Sep 1 2026 9:19 AM

Nepal Flash Flood: 23 Bodies Found in One House Death Toll Nears 1000

నేపాల్‌ను వణికించిన ఆకస్మిక వరదల విషాదం.. రోజురోజుకూ మరింత భయానక పరిస్థితుల్ని వెలుగులోకి వస్తోంది గతవారం సంభవించిన ఫ్లాష్‌ ఫ్లడ్స్‌లో మృతుల సంఖ్య 1000కి చేరువైంది. గల్లంతైన వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వాళ్ల ఆచూకీ తెలియకపోవడంతో అన్వేషణ కొనసాగుతోంది. భారీ వర్షాలు, బురద, దెబ్బతిన్న రహదారులు, మూసుకుపోయిన సొరంగాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి.

ఆగస్టు 26న నేపాల్‌–టిబెట్‌ సరిహద్దులో మంచు, రాళ్ల భారీ ప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడటంతో భోటేకోషి–త్రిశూలీ నదీ వ్యవస్థలో వరదలు పోటెత్తాయి. ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు పట్టణాలు, గ్రామాలను ముంచెత్తిన ఈ వరదల్లో ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్‌ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి నేపాల్‌ సహాయక బృందాలు, వివిధ దేశాల రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి గాలింపు కొనసాగిస్తున్నాయి.

తాజాగా.. నువాకోట్‌ జిల్లాలోని బెత్రావతిలో ఈ ఉదయం ఓ ఇంట్లో 23 మృతదేహాలు బయటపడటం తీవ్ర విషాదాన్ని నింపింది. వరదల తర్వాత గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా ఈ మృతదేహాలను గుర్తించారు. అవి ఒకే కుటుంబానికి చెందినవా? చుట్టుపక్కల వాళ్లు తలదాచుకునేందుకు వచ్చి మరణించారా? లేదంటే కొట్టుకు వచ్చిన మృతదేహాలా? అని పరిశీలిస్తున్నారు. మరోవైపు నేపాల్‌ నుంచి కొట్టుకొచ్చినట్లు భావిస్తున్న 13 మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌ సమీపంలోని గండక్‌ నదిలో లభించాయి. వీరిలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను నేపాల్‌కు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సొరంగాల్లో 900 మందికి పైగా?
నేపాల్‌ ఆకస్మిక వరదల కారణంగా జలవిద్యుత్‌ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 933 మంది కార్మికుల జాడ లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రసువా, నువాకోట్‌ జిల్లాల్లోని పలు సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. త్రిశూలీ 3ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40–42 మంది ఇంజినీర్ల ఆచూకీ ఇంకా లభించలేదు. త్రిశూలీ 3బీ ప్రాజెక్టులో 118 మంది కార్మికులు గల్లంతయ్యారు. బురద, నీటితో సొరంగాలు పూర్తిగా మూసుకుపోవడంతో సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్మీ సిబ్బంది నియంత్రిత పేలుళ్లు, ఎక్సకవేటర్లు, సెర్చ్‌లైట్లను ఉపయోగించి మార్గాలను క్లియర్‌ చేస్తున్నారు. అయితే కెమెరాల్లోనూ లోపల నిశబ్ధ వాతావరణం కనిపిస్తుండడంతో.. వాళ్లంతా కొట్టుకునిపోయి ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సామూహిక ఖననాలే దిక్కు!
వరదల్లో గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతదేహాల గుర్తింపు అధికారులకు మరో పెద్ద సవాల్‌గా మారింది. పోఖారా ఆస్పత్రికి గోర్ఖా, తనహున్‌, ధాదింగ్‌, నావల్‌పరాసీ ఈస్ట్‌ ప్రాంతాల నుంచి 102 మృతదేహాలను తరలించారు. వీరిలో 16 మందిని గుర్తించి కుటుంబాలకు అప్పగించారు. అయితే చాలా మృతదేహాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఫొటోలు, దుస్తులు, నగలు, టాటూల ఆధారంగా బాధితులను గుర్తించాల్సి వస్తోంది. అవసరమైన చోట డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్‌కు చెందిన 18 మంది ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా గుర్తింపు ప్రక్రియలో సహకరిస్తున్నారు.

అలాగే వదరలు సంభవించిన రీజియన్‌లో మార్చురీల సంఖ్య.. సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. బాడీ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌లను తాత్కాలికంగా ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో సామూహిక ఖననాలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

వేలాది మంది గల్లంతు.. విదేశీయులూ
రసువాలోని ఉత్తర్‌గయా గ్రామానికి చెందిన సుమారు 350 మంది విద్యార్థులు గల్లంతైనట్లు సమాచారం. ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10 వేల మందికిపైగా ప్రజలను రక్షించారు. వీరిలో 323 మంది విదేశీయులు ఉన్నారు. మరోవైపు 39 దేశాలకు చెందిన సుమారు 590 మంది విదేశీయులు ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నట్లు నేపాల్‌ విదేశాంగ శాఖ తెలిపింది.

65 వేల మందికి అత్యవసర సాయం
వరదల తీవ్రతను ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళనకరంగా అభివర్ణించింది. ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 65 వేల మందికి తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అత్యవసర సాయం అవసరమని తెలిపింది. 22 వేల మందికిపైగా చిన్నారులకు రక్షణ సేవలు అవసరమవుతున్నాయి. పాఠశాలలు కూడా వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 19 పాఠశాలలు దెబ్బతినగా, తొమ్మిది పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో ఎనిమిది పాఠశాలలను ప్రస్తుతం బాధితులకు ఆశ్రయ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. వరదల్లో దెబ్బతిన్న రహదారులు, వంతెనల కారణంగా సహాయక సామగ్రిని బాధిత ప్రాంతాలకు తరలించడం కష్టంగా మారింది. ఫ్రీజర్లు, డీఎన్‌ఏ కిట్లు, డ్రోన్లు, లిడార్‌ పరికరాలు, వంతెన నిర్మాణ సామగ్రి వంటి ప్రత్యేక పరికరాలను నేపాల్‌ కోరింది. భారత్‌, చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా తదితర దేశాలు సహాయక చర్యలకు మద్దతు అందిస్తున్నాయి. మరోవైపు టిబెట్‌లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఏర్పడిన సరస్సులు, హిమనదుల(గ్లేసియర్‌) కూలిపోయే ప్రమాదంపై కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

ఇదీ చదవండి: నేలమట్టమైన వందల ఏళ్ల నాటి హిందూ దేవాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement