నిషేధిత తెహ్రీక్–ఇ–లబాయక్ పనేనంటున్న మైనారిటీలు
తిరిగి నిర్మించాలంటూ హిందువుల డిమాండ్
ఆలయం వర్షాలతో దెబ్బతిందంటున్న అధికారులు
లాహోర్: పాకిస్తాన్‌లో పంజాబ్ ప్రావిన్స్‌లో వందేళ్లనాటి హిందూ ఆలయాన్ని అధికారులు నేలకూల్చి, ఆ స్థలాన్ని మదర్సాలో కలిపివేశారు. భారీ వర్షాల కారణంగా పురాతన ఆలయం ధ్వంసమైందని ప్రభుత్వం చెబుతుండగా, స్థానిక మైనారిటీ వర్గాలు ఖండిస్తున్నాయి. పక్కనే ఉన్న మదర్సాలో ఆ స్థలాన్ని కలుపుకునేందుకే కొందరు అతివాదులు ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నాయి.
లాహోర్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవాలోని సిరాజ్ గ్రామంలో వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న 125 ఏళ్లనాటి హిందూ ఆలయాన్ని ఆగస్ట్ 21వ తేదీన తెహ్రీక్–ఇ–లబాయక్ పాకిస్తాన్ అనే నిషేధిత ఇస్లాం పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆలయాన్ని నేలకూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని, పునర్నిర్మించాలని పాకిస్తాన్ మసీహా మిల్లత్ పారీ్ట(పీఎంఎంపీ)పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. ఆగస్ట్ 28వ తేదీన పంజాబ్ హోం శాఖ అదనపు కార్యదర్శిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశామని పీఎంఎంపీ చైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత్రా తెలిపారు.
విధ్వంసం జరుగుతున్నా స్పందించని అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఆలయ శిఖరంపైనున్న లోహాపు సామగ్రి, ఇతర వస్తువులు, ఇటుకలను కూడా అక్కడి నుంచి మాయం చేశారని ఆరోపించారు. ఆలయానికి అనుబంధం ఉన్న భూమిని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) గతంలో మదర్సాకు లీజుకు ఇచ్చిందని, చాలా ఏళ్లుగా లీజును కూడా చెల్లించడం లేదని చెప్పారు. అయితే, ఆలయం దెబ్బతిందని, సంబంధిత నిర్మాణాలన్నీ ఇతరుల ఆక్రమణలో ఉన్నాయని ఈటీపీబీ అధికారి రాణా ఇఫ్తికార్ చెప్పారు.
‘ఆలయానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులేవీ మా వద్ద లేవు. ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఆ స్థలానికి సీల్ వేశామన్నారు. ఆలయాన్ని తిరిగి నిర్మించే విషయం ఉన్నతాధికారులు చూసుకుంటారు. ఈ స్థలాన్ని ఎవరికీ లీజుకు ఇవ్వలేదు. మదర్సాకు ఇచ్చిన లీజు హక్కులను సైతం రద్దు చేశాం’అని తెలిపారు. నరోవాల్ జిల్లా శాంతి కమిటీ, పాక్ ధర్మ ఆస్థాన్ హిందూ కమిటీ సభ్యుడు రత్తన్ లాల్ పురాతన ఆలయాన్ని నేలకూల్చడాన్ని ఖండించారు. తిరిగి నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.


