source: X
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేసింది. నగర పరిధిలో సోమవారం జరిపిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో ఐదుగురు మరణించగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రికి తొలుత రెండు మృతదేహాలు చేరినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని మున్సిపల్ పార్క్ సమీపంలో ఓ నివాస భవనం ప్రవేశద్వారం వద్ద ఇజ్రాయెల్ వైమానిక దాడి జరగడంతో ఈ మరణాలు సంభవించినట్లు వారు పేర్కొన్నారు.
ఆ తర్వాత నగరంలోని టెల్ అల్-హవా ప్రాంతంలో ఓ పౌర వాహనంపై డ్రోన్ దాడి జరిగినట్లు ఆసుపత్రి వెల్లడించింది. ఈ ఘటనలో మరో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడినట్లు తెలిపింది.
హమాస్ లక్ష్యంగా..
ఈ రెండు దాడుల్లోనూ హమాస్ సైనిక విభాగానికి చెందిన వ్యక్తులనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మృతుల్లో ఒకరిని ఒమర్ మహమ్మద్ రోష్డీ సరాజ్‌గా గుర్తించిన ఇజ్రాయెల్ సైన్యం.. అతడు హమాస్‌కు ఆయుధాలు సరఫరా చేసేవాడని ఆరోపించింది.
కొనసాగుతున్న హింస
అమెరికా మద్దతుతో 2025 అక్టోబర్‌లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. గాజాలో హింస పూర్తిగా ఆగలేదు. హమాస్‌కు చెందిన మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతూ ఇజ్రాయెల్ సైన్యం వరుసగా దాడులు కొనసాగిస్తోంది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై చేసిన భారీ దాడి తర్వాత గాజా యుద్ధం ప్రారంభమైంది.
చదవండి: అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!


