టన్నెల్‌లో 93 మంది మిస్సింగ్‌.. డ్రోన్ల గాలింపులోనూ ఫలితం లేదు! | nepal flash floods 93 workers disappeared inside nepal tunnel | Sakshi
Sakshi News home page

టన్నెల్‌లో 93 మంది మిస్సింగ్‌.. డ్రోన్ల గాలింపులోనూ ఫలితం లేదు!

Aug 31 2026 5:02 PM | Updated on Aug 31 2026 5:29 PM

nepal flash floods 93 workers disappeared inside nepal tunnel

నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వరదల తాకిడికి  రసువా జిల్లాలోని 111 మెగావాట్ల రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న 93 మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. అయితే వారు టన్నెల్‌లో చిక్కుకుపోయారనే అనుమానంతో టన్నెల్‌లో డ్రోన్లతో ప్రత్యేక గాలింపులు చేపడుతున్నారు. వారి ఆచూకీ లభించలేదు. దీంతో వారి క్షేమ సమాచారంపై ఆందోళన నెలకొంది.

అసలు ఏం జరిగింది?

భోటే కోషి నదిలో ఒక్కసారిగా భారీగా వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రసువాగఢి ప్రాంతంలోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వరదల సమయంలో జలవిద్యుత్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న పలువురు కార్మికులు బయటకు రాలేకపోయి ఉండవచ్చని అధికారులు అనుమానించారు. ప్రత్యేకంగా టన్నెల్‌లోని చివరి భాగంలో కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చన్న సమాచారంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

అయితే జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెల్లు సాధారణంగా కొండల లోపలికి చాలా దూరం వెళ్తాయి. వరద నీరు, బురద, రాళ్లు, మట్టి, దెబ్బతిన్న నిర్మాణాలు, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఉంటే మనుషులను నేరుగా లోపలికి పంపడం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. దీంతో డ్రోన్లతో ప్రత్యేక గాలింపులు చేపట్టారు.

కార్మికులంతా టన్నెల్‌లో చిక్కుకుపోయి ఉండవచ్చన్న అనుమానంతో నేపాల్ సైన్యం, ఇంజినీర్లు, డ్రోన్ నిపుణులతో కూడిన బృందం టన్నెల్‌లోకి వెళ్లి విస్తృతంగా గాలింపు చేపట్టింది.అయితే టన్నెల్‌లోని అత్యంత లోపలి ప్రాంతం, చివరి భాగం వరకు చేరుకున్న రెస్క్యూ బృందానికి అక్కడ ఎవరూ ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించలేదు. థర్మల్ డ్రోన్లతో కూడా లోపల పరిశీలన జరిపారు. అయినప్పటికీ మనుషుల ఉనికిని సూచించే ఆధారాలు దొరకలేదు. దీంతో ఈ దశలో టన్నెల్‌లో గాలింపు చర్యలు నిలిపివేశారు. 

థర్మల్ కెమెరాలు సాధారణ కెమెరాల మాదిరిగా కేవలం మనుషుల ఆకారాన్ని మాత్రమే చూడవు. శరీరం నుంచి వెలువడే వేడిని గుర్తించగలవు. చీకటి లేదా తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లో కూడా వేడి ఆధారంగా జీవి ఉన్న అవకాశాన్ని గుర్తించడంలో అవి సహాయపడతాయి.ఈ ఘటనలో రెస్క్యూ బృందం నేరుగా ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా డ్రోన్లను ముందుకు పంపింది.టన్నెల్ చివరి భాగం వరకు డ్రోన్లు వెళ్లి పరిశీలించాయి. అయితే అక్కడ మనిషి ఉనికిని సూచించే సంకేతాలు కనిపించలేదు.

అయితే థర్మల్ డ్రోన్ మనిషి శరీర ఉష్ణాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. కానీ భారీ బురద, రాళ్లు, నీరు, కాంక్రీట్ లేదా ఇతర పదార్థాల వెనుక ఎవరైనా పూర్తిగా కప్పబడి ఉంటే గుర్తింపు కష్టమవుతుంది. అదేవిధంగా శరీర ఉష్ణోగ్రత చాలా తగ్గిపోయినా లేదా వ్యక్తి డ్రోన్ సెన్సర్‌కు కనిపించని ప్రదేశంలో ఉన్నా సంకేతం దొరకకపోవచ్చు. దీంతో కార్మికుల ఆచూకీ కనుక్కోవడం ఇప్పుడు ఎంతో కష్టతరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement