ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్‌ జలప్రళయంలో ఓ అద్భుతం.. | How 21 Tamil Nadu pilgrims escaped Nepals deadly flash flood | Sakshi
Sakshi News home page

ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్‌ జలప్రళయంలో ఓ అద్భుతం..

Aug 31 2026 1:51 PM | Updated on Aug 31 2026 2:50 PM

How 21 Tamil Nadu pilgrims escaped Nepals deadly flash flood

నేపాల్‌లోని భోటేకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన జలప్రళయం వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చి..శోకసద్రంలోకి నెట్టేసింది. ప్రస్తుతం అక్కడ బురదతో..తమ వాళ్ల ఆచూకీ కోసం ఆత్రంగా ఎదురు చూసే అశ్రుధారతో మిన్నంటే ఘోష కనిపిస్తోంది. ఇలాంటి విషాదకరఘటనలో కొన్ని అద్భుత సంఘటనలు మనకు మానవత్వంపై ఆశ, దేవుడిపై నమ్మకాన్ని రేకెత్తించేలా చోటు చేసుకుంటాయి. అలాంటి అపురూప ఘటనే మానసరోవర యాత్ర కోసం వచ్చిన యాత్రికులకు ఎదురైంది.

అసలేం జరిగిందంటే..నేపాల్‌ మానస సరోవర్‌యాత్ర కోసం వచ్చిన తమినాడు యాత్రికులు నేపాల్‌లో ఆకస్మికంగా సంభవించిన వరద బీభత్సంలో చిక్కుకున్నారు. అయితే ఈవిషాదం నుంచి బయటపడ్డ 21 మంది యాత్రికులు చెన్నై చేరుకున్నాక..తామెలా బయటపడ్డామో తమ ప్రాణాలను ఎలా రక్షించుకున్నామో కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అది అద్భుతం లేక అదృష్టం అనాలో అర్థకావడం లేదు ఇంకా మా కళ్లముందు ఆ మృత్యు ఘోష కనబడుతూనే ఉందని ఆవేదనగా నాటి ఘటన గురించి ఆ బృందంలోని ఒక యాత్రికురాలు ఇలా చెప్పుకొచ్చింది.  

నేపాల్-చైనా సరిహద్దు వైపు రసువా జిల్లా గుండా మొత్తం మూడు బస్సుల్లో ప్రయాణిస్తున్న 57 మంది సభ్యుల బృందంలో ప్రాణాలతో బయటపడ్డ 21 మంది ఉన్నట్లు తెలిపారామె. కుంభకోణానికి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన కైలాశ్‌ మానసరోవర్ యాత్రలో తాము భాగమైనట్లు వెల్లడించారు. అయితే ఆగస్టు 26న, తమ బృందం శ్యాబ్రుబేసి నుంచి చైనా ఇమ్మిగ్రేషన్ పాయింట్ వైపు ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా పరిసరాలు మారిపోయాయని, దుమ్ము మేఘాన్ని చూశామని నాటి విషాదాన్ని గుర్తు చేసుకుందామె. 

ఆ తర్వాత ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అది అచ్చం బాంబు పేలుడు లాంటి శబ్దమని, ఆ తర్వాత కొద్దిసేపటికే తమ వాహనం చుట్టూ రాళ్లు పడటం ప్రారంభమయ్యాయని చెప్పుకొచ్చారు. అయితే నేపాలీ డ్రైవర్‌ మమల్ని అప్రమత్తం చేసి తక్షణమే బస్సు దిగి వెళ్లిపోవాల్సిందిగా సూచించడంతో తాము పక్కనే ఉన్న పర్వతంపైకి ఎక్కే ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చింది ఆ యాత్రికురాలు. అయితే తమ బృందంలోని మగవాళ్లంతా పర్వత శిఖరం పైకి సులభంగా వెళ్లిపోగలిగారు గానీ, మహిళలు మాత్రం అస్సలు పర్వతం ఎక్కలేకపోయారని చెప్పుకొచ్చింది. ఎందుకంటే బురద, ఆ శిఖరం వాలు అత్యంత భయానకంగా ఉండటంతో ఎక్కడం కష్టమై జారిపోయామని తెలిపింది. 

అయితే తమ బృందంలోని ఒక మహిళ చీరవిప్పేసి, ఒక కేబుల్‌ వైర్‌కి అనుసంధానించి వదలడంతో..దాని సాయంతో తాము బయటపడ్డామని కన్నీటి పర్యంతమైందామె. ఆ మహిళ స్వెటర్‌ ధరించి చీర విప్పేసి తమకోసం ఇచ్చినట్లు తెలిపింది. నిజానికి ఆ మహిళ ఆ ధైర్యం చేసి ఉండకపోతే ఈ రోజు ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని గద్గద స్వరంతో చెప్పుకొచ్చిందామె. అంతేగాదు ఆ భయానక పరిస్థితుల్లో ఆ చీర తమకు ప్రాణదాతగా మారిందంటూ నాటి విషాద పరిస్థితిని వివరించారామె. 

కాగా, మొత్తం 57 మంది యాత్రికుల్లో కేవలం 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగా మిగతా 36 మంది ఆచూకీ కానరాలేదు. అలాగే ఈ విపత్తు సమయంలో సరిహద్దు చైనా వైపున ఉన్న గిరోంగ్ పోర్ట్ ప్రాంతంలో చెన్నైకి చెందిన మరో 49 మంది యాత్రికుల ఆచూకీ కూడా తెలియరాలేదని సమాచారం. 

 

(చదవండి: 65 ఏళ్ల వయసులో టిఫిన్‌ సర్వీస్! ఇవాళ ఏకంగా రూ. 2.5 కోట్లు..)
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement