నేపాల్‌: లక్కీ హౌస్‌ వెనక.. అసలు కథ ఇదే! | Nepal Floods: The Mystery Behind the Viral House That Survived | Sakshi
Sakshi News home page

నేపాల్‌: లక్కీ హౌస్‌ వెనక.. అసలు కథ ఇదే!

Aug 31 2026 9:32 AM | Updated on Aug 31 2026 9:38 AM

Nepal Floods: The Mystery Behind the Viral House That Survived

నేపాల్‌ వరద బీభత్సంలో.. ఓ ఆకుపచ్చ ఇల్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. చుట్టూ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నా.. ఈ ఇల్లు మాత్రం మొండిగా నిలబడింది. ఇంటి చుట్టూ నీరు, బురద, భారీ బండరాళ్లు దూసుకొస్తున్నా.. బాల్కనీలో చిక్కుకున్న కుటుంబం సైతం సురక్షితంగా బయటపడింది. దీంతో ‘ఈ ఇంటిని కట్టిన ఇంజనీర్‌ ఎవరు? ఇంతటి వరదను ఇది ఎలా తట్టుకుంది?’ అనే చర్చ మొదలైంది.

నేపాల్‌లోని హిమాలయ లోయల్లో ఆగస్టు 26న ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ నీటితో పాటు బురద, బండరాళ్లు, చెట్ల దుంగలు ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చాయి. మార్గంలో కనిపించిన ఇళ్లు, వంతెనలు, రహదారులను ధ్వంసం చేశాయి. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోల్లో మాత్రం ఓ ఆకుపచ్చ ఇల్లు ప్రత్యేకంగా కనిపించింది. వరద నీరు ఆ ఇంటిని దాదాపు చుట్టుముట్టింది. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోయింది. అయినప్పటికీ ఇంటి నిర్మాణం కూలిపోలేదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బాల్కనీలోకి చేరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. చివరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

అసలు కారణం ఇదే.. 
ఈ ఇల్లు అక్కడి ఇతర నిర్మాణాలతో పోలిస్తే భిన్నంగా ఉండటమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో అనేక ఇళ్లు రాళ్లతో నిర్మిస్తారు. ఇవి ఇంటిపై పడే నిలువు బరువును తట్టుకోగలిగినా.. వరద నీరు అడ్డంగా ఢీకొన్నప్పుడు ఏర్పడే భారీ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. కానీ వైరల్‌గా మారిన ఇంటికి రీన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ (RCC) ఫ్రేమ్‌ ఉన్నట్లు నిర్మాణ నిపుణుల విశ్లేషణలో తేలింది. పిల్లర్లు, బీములు, పునాదులను స్టీల్‌ రాడ్లతో అనుసంధానించడంతో మొత్తం నిర్మాణం ఒక బలమైన ఫ్రేమ్‌లా పనిచేసింది. వరద నీరు, బురద, రాళ్లు ఢీకొన్నప్పుడు ఏర్పడిన అడ్డదిశ ఒత్తిడిని ఈ ఫ్రేమ్‌ కొంత మేర గ్రహించి పునాది వైపు మళ్లించింది.

ఇంజినీరింగ్‌ ఒక్కటే కాదు.. అదృష్టం కూడా!
అయితే ఇంటి నిర్మాణమే దాన్ని కాపాడిన ఏకైక కారణం కాదు. వరద ప్రవాహం నేరుగా ఇంటిని ఢీకొనకపోవడం కూడా అత్యంత కీలకంగా మారింది. భారీ బండరాళ్లు, చెట్లు, మట్టి కలిసిన ప్రవాహంలో అత్యంత బరువైన శిథిలాలు సాధారణంగా ప్రధాన ప్రవాహ మార్గంలోనే దూసుకుపోతాయి. ఈ ఇల్లు ఆ ప్రధాన ప్రవాహ మార్గానికి కొద్దిగా పక్కన, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంది. దీంతో వరద శక్తిలో కొంత భాగం ఇంటిని నేరుగా ఢీకొట్టకుండా ఇరువైపులా విడిపోయి వెళ్లింది.

ఇంటి ఆకారం కూడా ప్లస్‌ పాయింట్‌
ఇంటి కాంపాక్ట్‌ ఆకారం కూడా వరద ప్రవాహాన్ని మళ్లించడంలో సహాయపడినట్లు నిపుణులు చెబుతున్నారు. నీరు నేరుగా ఇంటి గోడను ఢీకొని అక్కడే నిలిచిపోకుండా.. ఇరువైపులా ప్రవహించే అవకాశం ఏర్పడింది. వరదతో వచ్చిన బురద ఇంటి చుట్టూ పేరుకుపోవడం కూడా మరో రక్షణగా మారింది. అది సహజమైన ర్యాంప్‌లా ఏర్పడి.. తర్వాత వచ్చిన ప్రవాహాల దిశను కొంత మార్చినట్లు నిపుణుల విశ్లేషణ.

‘ఇంజినీర్‌ ఎవరు?’ అనే ప్రశ్నకు..
సోషల్‌ మీడియాలో ఈ ఇల్లు వైరల్‌ కావడంతో ‘ఇంత బలంగా కట్టిన ఇంజినీర్‌ ఎవరు?, ఏ సిమెంట్‌ వాడారు’ అనే ప్రశ్నలు వచ్చాయి. అంతేకాదు.. బిహార్‌లో చిన్నపాటి వరదలకు కూడా బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, ఈ మధ్య వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ వేలు కూడా కొట్టుకుపోతుండడంతో .. ఆ ఇంజినీర్‌ సాబ్‌ను ఇక్కడికి రప్పించాలనే చర్చా సరదాగా నడిచింది. అయితే ఆ ఇంజనీర్‌ ఎవరు? అనే విషయా‍న్ని త్వరలో చెబుతామని ఆ కుటుంబం అంటోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. తమను ఇబ్బంది పెట్టొద్దని స్థానిక మీడియాను ఆ కుటుంబం వేడుకుంది. ఇటు నెట్టింట కూడా.. దాని బలమైన పునాదే అంత పెద్ద వరదను తట్టుకుని నిలబడిందనే దానిపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.

ప్రతి ఇల్లు ఇలా నిలబడుతుందా?
కచ్చితంగా కాదు. ఇదే తరహా నిర్మాణం ఉన్న ప్రతి ఇల్లు ఇలాంటి విపత్తును తట్టుకుంటుందని చెప్పలేం. వరద వేగం, నీటి పరిమాణం, బండరాళ్ల దెబ్బ, పునాది బలం, నిర్మాణ నాణ్యత, అది కట్టిన ప్లేస్‌ కూడా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే వైరల్‌ వీడియోలో కనిపిస్తున్న ఆ ఇల్లు కేవలం ‘అదృష్టవంతమైన ఇల్లు’ కాదు.. సరైన నిర్మాణ విధానం, అనుకూలమైన స్థానం రెండూ కలిసి పనిచేసిన అరుదైన ఉదాహరణ. చుట్టూ విధ్వంసం జరిగినా.. ఆ చిన్న ఇల్లు మాత్రం నిలబడటం ఇప్పుడు నేపాల్‌ వరదల విషాదంలో ఆశ్చర్యపరిచే దృశ్యంగా మిగిలిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ఇల్లు.. పర్యాటక ప్రదేశంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. 

ఇదీ చదవండి: అటు అమెరికాలోనూ పెను విధ్వంసం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement