విజయానికి మచ్చ లేదు! | Wear Your Scars, a campaign created in partnership with Hockey India | Sakshi
Sakshi News home page

విజయానికి మచ్చ లేదు!

Aug 27 2026 5:02 PM | Updated on Aug 27 2026 5:15 PM

Wear Your Scars, a campaign created in partnership with Hockey India

క్రీడాకారుల సౌందర్యం వారి రూపంలో కాదు, మైదానంలో వారు చూపే ఆత్మస్థైర్యం, సహనంలో ఉందనే దిశగా ‘వేర్‌ యువర్‌ స్కార్స్‌’ సరికొత్త చర్చకు తెరలేపింది. కాప్రి స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలోని ది స్పోర్ట్స్‌ ఉమెన్‌ సంస్థ, భారత హాకీ సమాఖ్యతో కలిసి ‘‘మీ గాయాలను గర్వంగా ప్రదర్శించండి’’ అంటూ ఒక ప్రత్యేక డిజిటల్, సోషల్‌ మీడియా ఫొటో సిరీస్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. క్రీడారంగంలో సమాజం చెప్పేటువంటి సాంప్రదాయ సౌందర్య ప్రమాణాలకు ఎటువంటి స్థానం లేదని ఈ ప్రచారం గట్టిగా చెబుతోంది. 

మహిళా అథ్లెట్లు మైదానంలో ఆడేటప్పుడు తగిలే గాయాలు, కుట్లు, కట్‌ మార్క్స్, కందిపోయిన గుర్తులను దాచడం లేదా ఫొటోల్లో రీటచ్‌ చేసి తొలగించడం సాధారణం. కానీ, ‘వేర్‌ యువర్‌ స్కార్స్‌’ ఈ గాయాలను దాచడానికి నిరాకరించింది. పదహారవ మహిళల ప్రపంచ కప్‌ హాకీ టోర్నీని పురస్కరించుకొని చేస్తున్న ఈ ప్రచారం మహిళల శరీర రూపురేఖలు, అందంపై సమాజంలో ఉన్న పాతబడిన ఆలోచనలను గట్టిగా ప్రశ్నిస్తోంది. మహిళలు ఎప్పుడూ నాజూగ్గా, మచ్చలు లేకుండా ఉండాలనే సామాజిక ఒత్తిళ్లకు, సౌందర్య ప్రమాణాలకు క్రీడా ప్రపంచం లో స్థానం లేదని అంటోంది. 

మైదానంలో ఆడే మహిళల శరీరాలపై పడే ప్రతి గాయం వారి అసాధారణ పోరాటానికి, విజయానికి నిజమైన ఆభరణమని చాటిచెబుతోంది. ఈ క్యాంపెయిన్‌లో అథ్లెట్లు తమ శరీరాలపై ఉన్న గాయాలను రత్నాభరణాల రీతిలో దర్పంగా ప్రదర్శించారు. ఒంటిమీద ధరించే మెరిసే ఆభరణాల్లా ఈ గాయాలపై కూడా కాంతి ప్రసరించేలా చిత్రీకరించారు. 

క్రీడా మైదానంలో తగిలే గాయాలు వైకల్యాలు కావు, అవి క్రీడాకారుల పట్టుదలకు, ఆత్మస్థైర్యానికి సజీవ సాక్ష్యాలని స్పష్టం చేస్తున్నారు. ఫ్యాషన్‌ గ్లామర్‌కూ, మైదానంలో అథ్లెట్లు చిందించే చెమట–రక్తాలకు మధ్య ఉన్న ఒక విభిన్నమైన వ్యత్యాసాన్ని ఈ ప్రచారం కళ్ళకు కట్టినట్లు చూపుతోంది.  

 

(చదవండి: భారత వంటకాల రుచి దెబ్బకు..మరో రెసిపీని ట్రై చేయలేకపోతున్నా! అమెరికా వ్యక్తి ఆవేదన..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement