‘మోదీనే బెస్ట్’ అంటూ వ్యాఖ్యలు.. సీజేపీ నేత దాస్ ‘పోస్ట్’ కలకలం | Cockroach Janta Party Saurav Das Modi Best Tweet Viral | Sakshi
Sakshi News home page

‘మోదీనే బెస్ట్’ అంటూ వ్యాఖ్యలు.. సీజేపీ నేత దాస్ ‘పోస్ట్’ కలకలం

Aug 3 2026 1:11 PM | Updated on Aug 3 2026 1:24 PM

Cockroach Janta Party Saurav Das Modi Best Tweet Viral

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌కు సంబంధించిన 2015 నాటి ఓ పాత సోషల్ మీడియా పోస్ట్ మళ్లీ వైరల్‌గా మారింది. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై విమర్శలు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ప్రస్తుతం సీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుండటంతో, సౌరవ్ దాస్ గత వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ ప్రస్తావిస్తున్నారు.

2015లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి సౌరవ్ దాస్ చేసిన పోస్టులో, "ఆప్‌కు ఏమైంది? పూర్తిగా మారిపోయింది. ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. మీరు కూడా కాంగ్రెస్‌లాగే మారిపోయారు. మోదీజీ చాలా మెరుగైన నాయకుడు... ఆయనే బెస్ట్" అని పేర్కొన్నారు. ఆ పోస్టు స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పాత పోస్టును ఆధారంగా చేసుకుని నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు గతంలో మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండడాన్ని ప్రస్తావిస్తుండగా, మరికొందరు రాజకీయ నాయకుల అభిప్రాయాలు కాలక్రమేణా మారవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.

సౌరవ్ దాస్ ప్రస్తుతం అభిజీత్ దిప్కే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమాలు, విద్యా సంస్కరణలు తదితర అంశాలపై పార్టీ తరఫున తరచూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇటీవల సీజేపీ కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వంపై పార్టీ వైఖరి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన పాత సోషల్ మీడియా పోస్టులు కూడా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అయితే వైరల్ అవుతున్న ఈ పాత పోస్టుపై సౌరవ్ దాస్ గానీ, సీజేపీ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అలాగే, 2015లో చేసిన ఆ వ్యాఖ్యలపై ఆయన ప్రస్తుత వైఖరి ఏమిటన్న విషయంపైనా ఎలాంటి స్పష్టీకరణ వెలువడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement