మానసిక వైద్యురాలిని కబళించిన డిప్రెషన్‌! | Ghaziabad Psychiatrist Dies by Suicide After Battle with Depression | Sakshi
Sakshi News home page

మానసిక వైద్యురాలిని కబళించిన డిప్రెషన్‌!

Aug 3 2026 12:12 PM | Updated on Aug 3 2026 12:20 PM

A Psychiatrists Silent Battle Ghaziabad Doctor Dies After Divorce Struggle

వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిళ్లు.. కారణాలు ఏవైనా కావొచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి మనిషిని కుంగదీస్తుంది. అలాంటి సమయంలో సరైన సహాయం, మద్దతు అందకపోతే పరిస్థితులు విషాదకర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించాల్సిన ఓ వైద్యురాలే.. చివరకు అదే మానసిక ఒత్తిడికి బలికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లోని ఆఫీసర్స్‌ సిటీ-2 సొసైటీలో నివసిస్తున్న డాక్టర్‌ హేమికా అగర్వాల్‌ (40) ఆదివారం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హేమికా తండ్రి డాక్టర్‌ ఆర్‌. చంద్ర కూడా ఘజియాబాద్‌లో ప్రముఖ సైకియాట్రిస్ట్‌గా ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన విడాకుల తర్వాత ఆమె తీవ్ర భావోద్వేగ ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమార్తె వివాహ బంధం ముగిసిన తర్వాత మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు.

దాని నుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారని.. పేషెంట్లకు చికిత్స కొనసాగిస్తుండడంతో మామూలుగా మారిందని తాము భావించామని చెబుతున్నారాయన. మరోవైపు ఆమె మృతి వార్త స్థానికంగా వైద్య వర్గాల్లో విషాదం నింపింది. పలువురు ఆమె మృతికి సంతాపం తెలుపుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

ఇతరుల మానసిక సమస్యలకు పరిష్కారం చూపే వృత్తిలో ఉన్న ఓ వైద్యురాలే వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడితో విషాద నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.  అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్‌ నోట్‌ బయటపడకపోవడంతో.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement