గురుగ్రామ్‌లోని సూరత్ నగర్‌లో ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. భార్య విడాకులు కోరడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తుండగా, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు సంజీవ్ యాదవ్ (36) ఓ కంపెనీలో అసోసియేట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.
ఘటన సమయంలో ఇంట్లో అతడి భార్య మన్‌ప్రీత్ కౌర్, ఏడేళ్ల కుమారుడు మాత్రమే ఉన్నారు. సంజీవ్ ఉరివేసుకున్న దృశ్యాలను కుమారుడు మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్తను రక్షించేందుకు మన్‌ప్రీత్ సహాయం కోసం కేకలు వేసిందని, అనంతరం తన కుటుంబ సభ్యులతో పాటు సంజీవ్ తల్లిదండ్రులకు సమాచారం అందించిందని పోలీసులు చెప్పారు.
అయితే సంజీవ్ కుటుంబ సభ్యులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య విడాకులు కోరడంతో ఇద్దరి మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతుందని.. సంజీవ్ సోదరి కిరణ్ తెలిపారు. తన సోదరుడి మరణంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు. సంజీవ్ తండ్రి రామ్‌సేవక్ యాదవ్ కూడా తన కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. తన కుమారుడిని కుట్ర పన్ని హత్య చేసి ఉండవచ్చని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మన్‌ప్రీత్ కౌర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సంజీవ్, మన్‌ప్రీత్‌లు 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గురుగ్రామ్‌లోని డెన్సో కంపెనీలో పనిచేసే సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 2019లో వారికి కుమారుడు జన్మించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని.. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ సింగ్ తెలిపారు.


