వరంగల్ క్రైం: సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ కటకటలపాలయ్యాడు. ఈమేరకు శుక్రవారం సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ 2014 బ్యాచ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్. సోషల్ మీడియా వేదికగా మహిళలతో పరిచయం పెంచుకుంటూ.. వారిని మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. 2025లో ఫేస్ బుక్ ద్వారా శ్రీకాంత్ ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు.
అనంతరం ఆమెతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. అతడు జమ్మికుంటలో పనిచేస్తుండగా ఆమె వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని బలవంతంగా లొంగదీసుకున్నాడు. అనంతరం బాధితురాలి వ్యక్తిగత ఫొటోలతో బెదిరించడం, వీడియో కాల్స్ ద్వారా అసభ్యకరంగా వేధించి, డబ్బులు వసూలు చేశాడు. ఇచ్చిన డబ్బులు అడిగితే బెదిరించాడు. ఈమేరకు బాధితురాలు హనుమకొండలోని సుబేదారి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విచారణ కొనసాగుతుండగా.. నాలుగు నెలల నుంచి నిందితుడు అరెస్ట్‌కు భయపడి గోవా, హైదరాబాద్, నిజామాబాద్ పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ తిరిగినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్ వెల్లడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చివరికి సిమ్‌కార్డులు కూడా ధ్వంసం చేసి వై–ఫై ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించాడు. సాంకేతిక «ఆధారాలు, విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా, హనుమకొండ మూడో అదనపు కోర్టు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌కు తరలిస్తున్న ట్లు ఉత్తర్వులు జారీ చేశారని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


