ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి సన్నబియ్యం ఒకేసారి ఇవ్వనున్నారు.
ఈ మేరకు మండల్ లెవల్ స్టాక్ పాయింట్ల నుంచి జూలై 28వ తేదీ నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా అవుతున్నాయి. చిన్న దుకాణాలకు ఒకేసారి, పెద్ద దుకాణాలకు రెండుసార్లు బియ్యం రవాణా చేసి నిల్వ చేయనున్నారు. ఇందుకోసం జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రేషన్‌కార్డుదారుడు మూడుసార్లు వేలిముద్రలు వేసి బియ్యం పొందాల్సి ఉంటుంది. గతంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం అందజేసిన విషయం తెలిసిందే.
డీలర్లకు స్థలం కొరత
జిల్లాలో చాలామంది డీలర్లకు మూడు నెలల బియ్యం కోటా నిల్వ చేసుకునేందుకు సరిపడా స్థలం లేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ తమకు శక్తికి మించి భారమవుతుందని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ–పాస్ యంత్రాలు సక్రమంగా పని చేయకపోవడం, వినియోగదారులు మూడుసార్లు వేలిముద్రలు పెట్టడంతో పంపిణీ ఆలస్యం అవుతుంది. దీంతో ఒక్కో వినియోగదారుడికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని డీలర్లు వాపోతున్నారు.


