నంద్యాల: జయమ్మ సజీవంగానే ఉందా? | Jayamma Mystery Deepens: NIA Probe Raises Fresh Questions | Sakshi
Sakshi News home page

నంద్యాల: జయమ్మ సజీవంగానే ఉందా?

Aug 1 2026 9:12 AM | Updated on Aug 1 2026 9:14 AM

Jayamma Mystery Deepens: NIA Probe Raises Fresh Questions

ప్రతీకాత్మక చిత్రం

కేరళ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు చెబుతున్న మావోయిస్టు జయమ్మ అలియాస్‌ అరుణ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఆమె నిజంగానే ఎన్‌కౌంటర్‌లో చనిపోయిందా? లేదంటే ఇంకా బతికే ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా నంద్యాల జిల్లాలో చేపట్టిన విచారణే!. 

నంద్యాల జిల్లాలోని గడివేముల, పడమటూరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు పర్యటించి జయమ్మకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు సమాచారం. ఆమె తల్లిదండ్రులు, బంధువులను కలిసి పలు విషయాలపై ఆరా తీశారు. అలాగే గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) నుంచి కూడా ఆమెకు సంబంధించిన స్థానిక వివరాలను సేకరించారు.

జయమ్మ కోసం ఎన్‌ఐఏ ఆరా
మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధం ఉన్న జయమ్మ అలియాస్‌ అరుణ గురించి ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీశారు. ఆమె కుటుంబ నేపథ్యం, గతంలో ఉన్న సంబంధాలు, కదలికలపై వివరాలు సేకరించారు. జయమ్మకు సంబంధించిన పాత రికార్డులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తుల గురించి అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విచారణలో ఎలాంటి కీలక విషయాలు బయటపడ్డాయన్నది అధికారికంగా వెల్లడికాలేదు.

కేరళ ఎన్‌కౌంటర్‌లో జయమ్మ మృతి?
మావోయిస్టు కార్యకలాపాల్లో కీలకంగా ఉన్న జయమ్మ కేరళలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు ఆ మధ్య భద్రతా వర్గాలు ప్రకటించాయి. అయితే తాజాగా నంద్యాలలో ఎన్‌ఐఏ విచారణ జరగడంతో స్థానికంగా కొత్త అనుమానాలు మొదలయ్యాయి. “ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది జయమ్మేనా? ఆమె గుర్తింపు పూర్తిగా నిర్ధారణ అయిందా?” అనే ప్రశ్నలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. 

నల్లమలలో యాక్టివ్‌గా జయమ్మ
జయమ్మ పేరు నల్లమల అడవులతో చాలాకాలంగా ముడిపడి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఆమె దళాల్లో చురుగ్గా పనిచేసినట్లు భద్రతా వర్గాల సమాచారం. 2005 తర్వాత మావోయిస్టులపై పోలీసుల ఆపరేషన్లు తీవ్రం కావడంతో పలువురు నేతలు, దళ సభ్యులు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఈ క్రమంలో జయమ్మ కూడా ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.

భర్త భాస్కర్‌ నేపథ్యంపై కూడా ఆరా
జయమ్మ భర్త భాస్కర్‌ కూడా గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన వ్యక్తే. అయితే ఆ తర్వాత ఆయన పోలీసులకు లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ఎలాంటి సమాచారం పెద్దగా లేదు. ఈ క్రమంలో ఆయన్ని కూడా విచారించారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

సాధారణంగా ఎన్‌కౌంటర్‌ తర్వాత మృతుల గుర్తింపు ప్రక్రియ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఇతర ఆధారాల పరిశీలన జరుగుతుంది. అయితే జయమ్మ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న విచారణ స్థానికుల్లో ఆసక్తిని పెంచింది. ఎన్‌ఐఏ అధికారులు కుటుంబ సభ్యులను కలవడం, పాత వివరాలను సేకరించడం వంటి పరిణామాలతో “జయమ్మ బతికే ఉందా?” అనే చర్చ మొదలైంది. అయితే ఈ అనుమానాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇటు దర్యాప్తు విషయాన్ని కూడా ఎన్‌ఐఏ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

నల్లమల.. మావోయిస్టు చరిత్రలో మరో మలుపు
ఒకప్పుడు నల్లమల అడవులు మావోయిస్టు కార్యకలాపాలకు కీలక కేంద్రంగా ఉండేవి. పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన అనేక ఎన్‌కౌంటర్లు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అలాంటి నేపథ్యంలో జయమ్మ పేరు మరోసారి తెరపైకి రావడం.. ఆమె గతం, కేరళ ఎన్‌కౌంటర్‌, ప్రస్తుత ఎన్‌ఐఏ విచారణపై ఉత్కంఠను పెంచుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement