బ్యాంక్‌ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు | RBI Orders Banks To Install Currency Authentication Machines In Border Districts To Curb Fake Notes, More Details Inside | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు

Aug 1 2026 8:44 AM | Updated on Aug 1 2026 11:11 AM

RBI Crackdown Fake Currency Note Sorting Machines UV Lamps Border Bank Branches

దేశ ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు సవాలుగా మారిన నకిలీ కరెన్సీ చలామణిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక అడుగు వేసింది. అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన జిల్లాల్లో ఉన్న అన్ని బ్యాంకు శాఖలు, కరెన్సీ చెస్టుల్లో నోట్ల ప్రామాణికతను తనిఖీ చేసే ప్రత్యేక యంత్రాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని వాణిజ్య బ్యాంకులను ఆదేశించింది. నకిలీ నోట్ల గుర్తింపు, నివేదన ప్రక్రియలో కొన్ని బ్యాంకులు చూపుతున్న నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బ్యాంక్ ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలతో కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది.

సరిహద్దు జిల్లాలే లక్ష్యంగా..

పొరుగు దేశాల సరిహద్దుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోకి దొంగనోట్లను చేరవేసే వ్యవస్థలకు అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అంతకుముందు ఏప్రిల్‌లో జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్ల అమలు తీరును సమీక్షించగా పలు బ్యాంకు శాఖల సన్నాహకాలు ఆశించిన స్థాయిలో లేవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

నూతన మార్గదర్శకాల్లోని అంశాలు

  • అంతర్జాతీయ సరిహద్దు పరిధిలోని జిల్లాల్లో ఉన్న ప్రతి బ్యాంకు శాఖ, బ్యాక్ ఆఫీసుల్లో నోట్ సార్టింగ్, అథెంటికేషన్ యంత్రాలతో పాటు ఆల్ట్రావైలెట్ లాంప్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

  • కౌంటర్లలో నగదు లావాదేవీలు నిర్వహించే ప్రతి ఉద్యోగికి అసలైన నోట్ల భద్రతా లక్షణాలు, నకిలీ నోట్ల పసిగట్టే నైపుణ్యాలపై 2026 అక్టోబర్ 31 నాటికి శిక్షణ పూర్తి చేయాలని ఆర్‌బీఐ స్పష్టమైన గడువు విధించింది.

  • డిపాజిట్ల సమయంలో కౌంటర్‌లో గానీ, బ్యాక్ ఆఫీస్‌లో గానీ నకిలీ నోట్లను గుర్తిస్తే వాటిని వెంటనే జప్తు చేసి ఆర్‌బీఐకి నివేదించాలి. ఏ పరిస్థితుల్లోనూ నకిలీ నోటును ఖాతాదారునికి తిరిగి ఇవ్వడం గానీ లేదా బ్యాంకు స్థాయిలో నాశనం చేయడం గానీ చేయకూడదు.

  • బ్యాంకుల ఫోర్జ్‌డ్ నోట్ విజిలెన్స్ (ఎఫ్‌ఎన్‌వీ) సెల్స్ తమ డేటాను విశ్లేషించి నకిలీ నోట్లు ఎక్కువగా వస్తున్న హాట్‌స్పాట్ ప్రాంతాలను, ట్రెండ్స్‌ను గుర్తించి తదనుగుణంగా తనిఖీలు తీవ్రతరం చేయాలి.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement