ముంబై: విదేశాల్లో భారతీయ కంపెనీల లిస్టింగ్‌తో పాటు విదేశీ పెట్టుబడుల నిబంధనలను మరింత సరళతరం చేసేలా రిజర్వ్ బ్యాంకు ముసాయిదాను రూపొందించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాలకు అనుగుణంగా రెగ్యులేటరీపరమైన సంక్లిష్టతను తగ్గించి, స్పష్టతనిచ్చేలా వివిధ ప్రొవిజన్లను క్రమబద్ధీకరించడం, వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేయడం, భవిష్యత్ పరిస్థితులకు తగ్గట్లుగా నియంత్రణ వ్యవస్థను తీర్చిదిద్దడం దీని లక్ష్యం.
పీఎఫ్‌ఆర్‌డీఏ చట్ట నిబంధనలకు లోబడి ఎన్నారైలు కూడా నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో చేరవచ్చని పేర్కొంది. వీటిపై ఆగస్టు 31లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ఆర్‌బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. విదేశీ మారక నిర్వహణ చట్ట నిబంధనలను సమీక్షిస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించిన నేపథ్యంలో ఏర్పాటైన కమిటీ సిఫార్సుల మేరకు ఆర్‌బీఐ ఈ ముసాయిదా నిబంధనలను రూపొందించింది.


