కర్నూలు జిల్లా: నిద్రిస్తున్న భార్యను అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన నిందితుడు ఆమె సమాధి వద్దే బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు, సీఐ మధు వివరాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన మాదరమోని బాబు (56), అమృత (45) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.
మద్యానికి అలవాటు పడిన బాబు తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న భార్యను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన పోలీసులు అతడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. వారం రోజుల కిందట పూచీకత్తుపై విడుదలయ్యాడు.
ఈ క్రమంలో అతనితో ఎవరూ సరిగా మాట్లాడటం లేదు. దీంతో మానసిక వేదనకు గురైన బాబు గురువారం రాత్రి నోములలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న భార్య సమాధి వద్దకు వెళ్లి అక్కడే నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు చూసి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


