మరో క్రెడిట్ చోరీకి బాబు యత్నం | Chandrababu attempts another credit theft | Sakshi
Sakshi News home page

మరో క్రెడిట్ చోరీకి బాబు యత్నం

Aug 1 2026 5:35 AM | Updated on Aug 1 2026 6:25 AM

Chandrababu attempts another credit theft

భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నాటి సీఎం వైఎస్‌ జగన్, జీఎంఆర్‌ (ఫైల్‌)

అన్ని అనుమతులు సాధించి.. వివాదాలు పరిష్కరించి ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేలా వైఎస్‌ జగన్‌ కృషి

టెంకాయ కొట్టిన రోజే పూర్తి చేసే సమయాన్ని కూడా ప్రకటించి నిబద్ధతతో వైఎస్‌ జగన్‌ అడుగులు

సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్త­రాంధ్ర ఊహలకు రెక్కలు తొడుగుతూ... శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుది­ద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమవుతోంది. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. 

అదే ప్రకారం భోగాపురం ఎయిర్‌పోర్టు శనివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటం గమనార్హం. పలు కోర్టు వివాదాలు, భూ సేకరణ చిక్కుముడులు, పునరావాసం కల్పన, కేంద్రం నుంచి కీలక అనుమతులు రాబట్టడం.. ఇలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సాధించడంతోపాటు పనులు కూడా ప్రారంభించడంతో ముందుగా అనుకున్న సమయానికల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాత్రి పూట అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అడ్డంకులు తొలగిపోయి వివిధ దేశాలకు నేరుగా కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభించింది. 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా వేగంగా అడుగులు వేశారు. భోగాపురంలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతోపాటు ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ పార్వతీపురం, విజయనగరంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. మూలపేట పోర్టు, షిప్‌ ల్యాండింగ్‌ సెంటర్లతో తీరానికి ఆర్థిక పరిపుష్టి కల్పించి మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా చర్యలు చేపట్టారు. 

బాబు పబ్లిసిటీ పీక్స్‌లో..!
భూ సేకరణ చేయలేదు.. పునరావాసం ఊసు లేదు.. కోర్టు కేసులు తేల్చలేదు.. కేంద్రంలో కొన­సాగి, పౌర విమానయాన శాఖ దక్కించుకుని కూడా కనీసం ఎన్‌వోసీలు తేలేదు..! అయినా సరే భోగా­పురం ఎయిర్‌పోర్టును తామే కట్టేశామని ప్రచా­రం చేసుకుంటూ జబ్బలు చరుచుకోవడం ఒక్క చంద్రబాబు సర్కారుకే చెల్లుతుందనే విమ­ర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 – 19 మధ్య సీఎం­గా ఉన్న చంద్రబాబు భోగాపురం విమానా­శ్రయం నిర్మాణం విషయంలో తీవ్ర కాలయాపన చేశారు. 

నాడు టీడీపీ నుంచి గెలిచిన అశోక్‌ గజపతి­రాజు  విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కనీ­సం భూ సేకరణ చేయలేకపోయారు. అనుమ­తులు సాధించలేకపోయారు. 2,703 ఎకరాలకు గాను కేవలం 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారు. భూసేకరణ, ఎన్‌వోసీ­లు, ఎటువంటి అనుమతులు లేకుండానే నాడు ఎన్నికల ముందు హడావుడిగా ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి మమ అనిపించారు. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా విశాఖ – భోగాపురం ఎయిర్‌పోర్టును అనుసంధానించే ఆరు లైన్ల రోడ్డు పనులను మొదలు పెట్టలేకపోయారు. 

రూ.1,200 కోట్లకు పైగా వ్యయం చేసిన వైఎస్‌ జగన్‌ సర్కారు
2019లో వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టాక భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను  పరుగులు పెట్టించారు. ఉత్తరాంధ్ర మణిహారంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2200 ఎకరాల్లో నిర్మించే విధంగా 2020 ఏప్రిల్‌లో జీఎంఆర్‌తో వైఎస్‌ జగన్‌ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వెంటనే భూమిని సేకరించడంతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం లాంటి కీలక ప్రక్రియను చకచకా పూర్తి చేశారు. హైకోర్టు, ఎన్జీటీల్లో దాఖలైన దాదాపు 130 కేసులను పరిష్కరించి ఎయిర్‌పోర్టు పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమం చేశారు. 

మూడు గ్రామాల్లో దాదాపు 400 కుటుంబాలను అధునాతనమైన కాలనీలకు తరలించి సరికొత్త ఇళ్లకు యజమానులను చేసింది. ఒక్కో ఇంటికి ఐదు సెంట్ల స్థలంతోపాటు రూ.8.5 లక్షల ఆర్థిక సాయం వెనువెంటనే అందించారు. భూ సేకరణ, పునరావాసం, విద్యుత్, నీరు, రహదారులు లాంటి కీలక మౌలిక వసతుల  కల్పన కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.1,200 కోట్లకుపైనే వ్యయం చేసింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కీలకమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ)ని కేంద్రం నవంబర్‌ 2022లో జారీ చేసింది. 

ఇలా అన్ని అనుమతులు సాధించి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ 2023 మే 3న భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో 3,800 మీటర్లు పొడవైన రన్‌వే నిర్మించడంతో బోయింగ్‌ 777, బోయింగ్‌ 787, డ్రీమ్‌ లైనర్, ఎయిర్‌ బస్‌ ఏ–330, ఎయిర్‌ బస్‌ ఏ–340 లాంటి అత్యాధునిక భారీ విమానాలను ల్యాండ్‌ చేసేందుకు వీలుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభించనుండగా ఆగస్టు 17 నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు మొదలు కానున్నాయి.

క్రెడిట్‌ తండ్రీ, తనయులదే..!
‘‘మా ఫస్ట్‌ ఎయిర్‌పోర్టుకు హైదరాబాద్‌లో వైఎస్సార్‌ శంకుస్థాపన చేసి.. ఆయనే సీఎంగా ఉండగా నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో కూడా వైఎస్సార్‌ పాల్గొన్నారు. ఇది భగవంతుడి నిర్ణయమో ఏమో తెలియదు.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ సీఎంగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం..’’  – 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టు  శంకుస్థాపనలో జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావు

ఎయిర్‌పోర్టుకు అనుబంధంగా మరిన్ని...
» 5,000 చ.మీ విస్తీర్ణంలో లాజిస్టిక్‌ ఎకో సిస్టం, కార్గో టెర్మినల్‌ నిర్మాణంతో సరకు రవాణాకు  విస్తృత అవకాశాలు
» ఎయిర్‌పోర్ట్‌కు అనుబంధంగా ఏవియేషన్‌ అకాడమీ, మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్‌ హాలింగ్‌ వ్యవస్థల ఏర్పాటు
» విమానాశ్రయ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా మరో 10,000 మందికి ఉద్యోగాల కల్పన

 

2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన అనంతరం విమానాశ్రయం నమూనాను పరిశీలిస్తున్న నాటి సీఎం వైఎస్‌ జగన్‌ (ఫైల్‌)   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement