‘సర్‌’ ఓటర్లు 3,71,38,182 | Kurnool has the highest number of voters and Polavaram has the lowest | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ఓటర్లు 3,71,38,182

Aug 1 2026 5:23 AM | Updated on Aug 1 2026 5:23 AM

Kurnool has the highest number of voters and Polavaram has the lowest

రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు ఓటర్లు 4,16,27,694

‘సర్‌’లో ఓటర్లుగా క్లెయిమ్‌ చేయని వారి సంఖ్య 44,89,512

ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే అర్హులు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు  

నేటి నుంచి వచ్చే నెలాఖరు వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలకు గడువు.. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ 

మహిళా ఓటర్లు 1.89 కోట్లు.. పురుష ఓటర్లు 1.82 కోట్లు 

కర్నూలులో అత్యధికంగా ఓటర్లు.. పోలవరంలో అత్యల్పం 

మృతులు 15.22 లక్షలు.. ఇతర చోట్లకు తరలిపోయిన ఓటర్లు 22.30 లక్షలు.. రెండు చోట్ల ఓటున్న వారు 7.37 లక్షలు 

నోటీసు ఇవ్వకుండా ఎవరి ఓటూ తొలగించం  

అక్టోబర్‌ 3న ఓటర్ల తుది జాబితా: సీఈవో వివేక్‌ యాదవ్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ అనంతరం ముసాయిదా జాబితాలో 3,71,38,182 మంది ఓటర్లున్నారు. ‘సర్‌’కు ముందు 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారు, రెండు మూడు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు, మృతులను మినహాయించి 3,71,38,182 మంది ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫారాలను సమర్పించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ వెల్లడించారు. 

సర్‌ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం ఆయన ప్రకటించారు. 89.22 శాతం మంది ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇచ్చారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదుకు వచ్చే నెలాఖరు వరకు ఫారం 6 సమరి్పంచవచ్చు. నిజమైన ఓటర్లు డిక్లరేషన్‌ ఫారమ్‌తో పాటు ఫారం 6 అందచేస్తే ఓటర్ల జాబితాలో తిరిగి చేరే అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైతే ఒకచోట మాత్రమే ఉంచుతారు.   

ఓటర్లలో కర్నూలు టాప్‌ 
అక్టోబర్‌ 3వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. సర్‌ అనంతరం 15.22 లక్షల మంది ఓటర్లు (3.66 శాతం) మృతి చెందినట్లు తేలింది. 22.30 లక్షల మంది అంటే 5.33 శాతం శాశ్వతంగా మరో చోటకు తరలివెళ్లడం లేదా గైర్హాజరు అయినట్లు గుర్తించారు. మరో 7.37 లక్షల మంది ఓటర్లు (1.77 శాతం) రెండు లేదా మూడు చోట్ల నమోదైనట్లు వెల్లడైంది. మొత్తం 44,89,512 మంది అంటే 10.78 శాతం ఓటర్లుగా క్లెయిమ్‌ చేయలేదు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పురుషులు కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 

మహిళా ఓటర్లు 1.89 కోట్ల మంది కాగా పురుష ఓటర్ల సంఖ్య 1.82 కోట్లు మాత్రమే. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 18,12,532 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా పోలవరం జిల్లాలో 2,39,591 మంది ఓటర్లున్నారు. నోటీసు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించబోమని వివేక్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. సహేతుకమైన అవకాశం ఇస్తామ­న్నారు. అర్హుడైన ప్రతి పౌరుడిని ఓటర్ల జాబితాలో కొనసాగించడం, అనర్హులను జాబితాలో లేకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్‌ కట్టుబడి ఉందన్నారు. ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ 28లోగా పరిష్కరిస్తారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 3న ప్రచురిస్తారు.  

ఏ ఫారం ఎందుకంటే..?
ఫారం 6: కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తు  
ఫారం 6ఏ: విదేశీ భారతీయుడిని చేర్చడానికి దరఖాస్తు  
ఫారం 7: ప్రతిపాదిత చేర్పును వ్యతిరేకించడానికి లేదా ఇప్పటికే ఉన్న నమోదును తొలగించమని కోరడానికి దరఖాస్తు  
ఫారం 8: ప్రస్తుత ఓటరు నియోజకవర్గం లోపల లేదా వెలుపల నివాసం మార్చడం, వివరాలలో సవరణ కోసం దరఖాస్తు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement