భద్రాచలం వద్ద 53 అడుగులకు నీటి మట్టం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5.28 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వరద దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 14.26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
పోలవరం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. స్పిల్ వే 48 గేట్ల ద్వారా వచ్చిన వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 5,39,934 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 5,28,934 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 92,709 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 54.34 టీఎంసీలకు చేరుకుంది.
రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు
రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతంపై ఉన్న వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి గాలులతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అత్యధికంగా 3.7,ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వేమవరం, కాకినాడ జిల్లా ఇంజారంలో 3.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.


